- కామారెడ్డి జిల్లా మాచారెడ్డిలో ఘటన
కామారెడ్డి, వెలుగు : కామారెడ్డి జిల్లా మాచారెడ్డి మండలంలో ఫారెస్ట్ ల్యాండ్‌ను కొందరు వ్యక్తులు చదును చేస్తున్నారని తెలిసి అక్కడకు వెళ్లిన అటవీ శాఖ అధికారులపై దాడి చేశారు. దాడికి పాల్పడిన ఇద్దరిపై పోలీసులు కేసు నమోదు చేశారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. రత్నగిరిపల్లి బీట్ పరిధిలో అర్ధరాత్రి ఫారెస్ట్ భూమిని ట్రాక్టర్లతో కొందరు వ్యక్తులు చదును చేస్తున్నారు. మాచారెడ్డి డిప్యూటీ రేంజ్‌ఆఫీసర్ రమేశ్, బీట్ ఆఫీసర్ నాగరాజు
బేస్ క్యాంప్ ఆఫీసర్ మోహన్, సిబ్బందితో అక్కడకు వెళ్లారు. ఫారెస్ట్ ఆఫీసర్లను చూసి భూమిని చదును చేస్తున్న వ్యక్తులు అక్కడి నుంచి పారిపోతుండగా, వారిని వీడియో తీశారు. దీంతో ఆగ్రహించిన నిందితులు జీపులో ఉన్న ఆఫీసర్లను కిందికి లాగి దాడి చేశారు. ఫారెస్ట్ ఆఫీసర్ల ఫిర్యాదు మేరకు బోదాసు సురేశ్, కుంచ లింగంపై కేసు నమెదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.