కార్చిచ్చు కలవరం .. ఏటా భద్రాద్రికొత్తగూడెం జిల్లాలోనే ఎక్కువ ప్రమాదాలు

కార్చిచ్చు కలవరం .. ఏటా భద్రాద్రికొత్తగూడెం జిల్లాలోనే ఎక్కువ ప్రమాదాలు
  • ఈసారి ఇప్పటికే అశ్వాపురం, ములకలపల్లి, మణగూరు మండలాల్లో అడవి దగ్ధం.. 
  • వేసవిలో అటవీశాఖకు తలనొప్పిగా మారుతున్న అగ్ని ప్రమాదాలు
  • ఫైర్​వాచర్ల నియామకంలో నిర్లక్ష్యం.. బడ్జెట్​ కొరతతో ఆఫీసర్లు సతమతం

భద్రాచలం, వెలుగు : అశ్వాపురం మండలం గొందిగూడెం అడవిలో నిప్పు.. ములకలపల్లి మండలం మూకమామిడిలో జామాయిల్​ప్లాంటేషన్​ దగ్ధం.. మణుగూరు మండలం రథంగుట్టకు కార్చిచ్చు.. ఇలా అడవుల జిల్లా భద్రాద్రికొత్తగూడెంలో  రోజూ ఏదో ఒక మూలన అగ్ని ప్రమాదాల వార్తలు అటవీశాఖను కలవరపెడుతూనే ఉన్నాయి. నివారణ చర్యలు తీసుకునేందుకు బడ్జెట్​కొరత వేధిస్తోంది. 

ఇదీ పరిస్థితి.. 

వ్యవసాయదారులు వేసవిలో పొలంలో ఉన్న చెత్తా, చెదారాన్నిను కాల్చుతుంటారు. సాయంత్రం వేళ వారు వాటికి నిప్పు పెడుతుంటారు. కొంతమంది కాల్చే సమయంలో అక్కడ ఉండరు. దీంతో ఆ నిప్పు సమీప అడవుల్లోకి వ్యాపిస్తోంది. ఈ కాలంలో అడవుల్లోని చెట్లు ఆకులు రాల్చుతాయి. వీటికి తోడు ఆ ప్రాంతంలో భూమిపై ఎండిన గడ్డి ఉంటుంది. ఈ మంటలు వాటికి అంటుకుని కార్చిచ్చుగా మారుతున్నాయి. రైతులకు అటవీశాఖ ప్రతిసారి అవగాహన కల్పిస్తోంది. 

కానీ కొంత మంది నిర్లక్ష్యంగా వ్యవహరించడంతో ఇలాంటి ప్రమాదాలు ఆగడం లేదు. ఈ పరిస్థితుల్లో ఖమ్మం జిల్లాలో 2022–-23 సంవత్సరంలో 381, భద్రాద్రికొత్తగూడెం జిల్లాలో 1,942 వరకు అడవుల్లో అగ్నిప్రమాదాలు జరిగాయి. 2023–-24లో ఖమ్మం జిల్లాలోని అడవుల్లో 260, భద్రాద్రికొత్తగూడెం జిల్లాలో 2,600 వరకు అగ్ని ప్రమాదాలు సంభవించాయి. కార్చిచ్చు ఎక్కువగా భద్రాద్రికొత్తగూడెం జిల్లాలోనే జరుగుతుండటం అటవీ శాఖను కలవరపెడుతోంది. 

ఆధునిక టెక్నాలజీ ఓకే.. కీలకమైన సిబ్బందేరీ..? 

అడవుల్లో అగ్నిప్రమాదాలు, కార్చిచ్చును నియంత్రించేందుకు అటవీశాఖ ఆధునిక టెక్నాలజీని వినియోగిస్తోంది. ఏటా ఫైర్​లైన్లు ఏర్పాటు చేస్తున్నారు. లీఫ్​ బ్లోయర్లతో మంటలు విస్తరించకుండా కౌంటర్​ ఫైర్​ చేపడుతున్నారు. జియోస్పాటికల్​ టెక్నాలజీని ఉపయోగించుకుని శాటిలైట్​ కెమెరాల ద్వారా కార్చిచ్చు ఉన్న ప్రాంతాలను గుర్తించి ఆ ప్రాంత బీట్​ ఆఫీసర్​కు సమాచారం ఇస్తున్నారు. వారు వెళ్లి వాటిని అదుపులోకి తెస్తున్నారు. కానీ ఫైర్​ వాచర్ల నియామకం చేపట్టడం లేదు.

 కార్చిచ్చుల నియంత్రణలో వీరే కీలకం. ఈ పోస్టుల భర్తీ కోసం ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపినా నేటికీ ఎలాంటి స్పందన లేదు. నిధుల కొరత కారణంగా  ప్రతిపాదనలన్నీ మూలకు చేరుతున్నాయి. కొత్తగూడెం, ఇల్లెందు, పాల్వంచ, మణుగూరు, భద్రాచలం, వైల్డ్ లైఫ్​ఫారెస్ట్ డివిజన్లలో రూ.55.60లక్షల కంపా నిధులతో 489 కిలోమీటర్ల మేర ఫైర్​ లైన్లు ఈ సంవత్సరం నిర్మించాలని ప్రతిపాదించారు. గ్రౌండ్​ లెవల్​ కు వెళ్లి చూస్తే వాటి ఊసే కన్పించడం లేదు. 

అలర్ట్​ గా ఉంటున్నాం

అడవుల్లో జరిగే అగ్నిప్రమాదాల విషయంలో మేము ఎప్పుడూ అలర్ట్​ గా ఉంటున్నాం. ఫైర్​ వాచర్ల నియామకంపై ప్రభుత్వానికి ప్రతిపాదనలు వెళ్లాయి. అడవి చుట్టూ ఉండే వ్యవసాయదారులు తమ పొలాల్లో మోడ్లు కాల్చేటప్పుడు జాగ్రత్తలు తీసుకోవాలి.  దీనిపై ప్రతిసారి వారికి అవగాహన కల్పిస్తున్నాం. అటవీ ఉత్పత్తులు సేకరించుకోవడానికి వెళ్లినప్పుడు కూడా సేకరణ దారులు నిప్పు పెట్టకుండా ఉండాలి. 

రమేశ్, రేంజర్, అశ్వాపురం