ఆదివాసీ మహిళలపై ఫారెస్ట్ గార్డు దాడి

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా  ములకలపల్లి  మండలంలోని  ఫారెస్ట్ గార్డు రెచ్చిపోయాడు.  కట్టెల కోసం  వెళ్లిన తమ  పట్ల  ఫారెస్ట్ గార్డు అనుచితంగా  ప్రవర్తించాడని ఆదివాసీ మహిళలు చెప్పారు. గ్రామంలోని నలుగురు  ఆదివాసీ మహిళలు  అడవిలోకి కట్టెల కోసం వెళ్లారు.  ఆ టైంలో  అటుగా వచ్చిన  ఫారెస్ట్ గార్డు  వారి పట్ల దురుసుగా వ్యవహరించాడని  సదరు మహిళలు చెప్పారు. వారిలోని ఓ మహిళను  ఫారెస్ట్ గార్డు విచక్షణరహితంగా  కొట్టాడని తెలిపారు.  ఫారెస్ట్ గార్డు తన ఒంటిపై  బట్టలు తీసేసి కొట్టాడని బాధితురాలు కన్నీటి పర్యంతమైంది.  మిగిలిన వారిని కూడా దుర్భాషలాడుతూ  చేయి చేసుకున్నాడని బాధితురాలు ఆరోపించింది. ఫారెస్ట్ గార్డుపై  చర్యలు తీసుకోవాలని ఆదివాసీ మహిళలు కోరుతున్నారు.

అయితే ఘటపై  మంత్రి సత్యవతి రాథోడ్ స్పందించారు. జీవనాధారం కోసం  అడవిలోకి  వెళ్లే  ఆదివాసీల  జోలికి వస్తే  సహించేదిలేదన్నారు. ఆదివాసీ మహిళల పట్ల అసభ్యంగా ప్రవర్తించిన  వారిపై చర్యలు తీసుకుంటామన్నారు. ఈ ఘటనపై  వెంటనే సమగ్ర విచారణ  జరపాలని ఆదేశించారు.  మంత్రి సత్యవతి ఆదేశాలతో గిరిజన శాఖ ఉన్నతాధికారులు విచారణ ప్రారంభించారు.