ఫారెస్ట్‌‌లో జామాయిల్‌‌ చెట్ల నరికివేత

ఫారెస్ట్‌‌లో జామాయిల్‌‌ చెట్ల నరికివేత
  • వారం రోజుల కింద ఘటన
  • ఆలస్యంగా గుర్తించిన ఫారెస్ట్‌‌ ఆఫీసర్లు

కొత్తగూడ, వెలుగు : మహబూబాబాద్‌‌ జిల్లా కొత్తగూడ మండలంలోని గువ్వలబోడు సమీపంలోని ఫారెస్ట్‌‌ జామాయిల్‌‌ ప్లాంటేషన్‌‌ను గుర్తు తెలియని వ్యక్తులు నరికేశారు. వారం రోజుల కింద జరిగిన ఘటన ఆదివారం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. గువ్వలబోడు సమీపంలోని 1105 కంపార్ట్‌‌మెంట్‌‌లో ఫారెస్ట్‌‌ సిబ్బంది 2014లో జామాయిల్‌‌ మొక్కలు నాటారు. ప్రస్తుతం అవి పెరిగి పెద్దవయ్యాయి.

రెండు ఎకరాల్లోని 200 జామాయిల్‌‌ చెట్లను వారం రోజుల కింద గుర్తు తెలియని వ్యక్తులు నరికేశారు. ఆలస్యంగా గుర్తించిన ఫారెస్ట్‌‌ సిబ్బంది ఆదివారం కేసు నమోదు చేసి, నిందితుల కోసం గాలింపు మొదలుపెట్టారు. ఈ విషయంపై రేంజర్‌‌ వజహత్‌‌ మాట్లాడుతూ చెట్లను నరికి వేసిన వారి కోసం గాలిస్తున్నామని చెప్పారు. నరికిన చెట్లను ఫారెస్ట్‌‌ డిపోకు తరలిస్తున్నామన్నారు.