ఆక్రమణల్లో ..అటవీ భూములు..మెట్‌‌‌‌పల్లి రేంజ్ పరిధిలో 423 ఎకరాలు మాయం

  •    తాజాగా ఆత్మనగర్, రంగరావుపేట శివారులో 120 ఎకరాలు చదును 
  •      పోడు పట్టాల కోసం కబ్జాకు పాల్పడుతున్న ఆక్రమణదారులు 
  •      పోలీసులకు ఫిర్యాదు చేసిన అటవీ శాఖ 

మెట్ పల్లి, వెలుగు : మెట్‌‌‌‌పల్లి రేంజ్​పరిధిలో ఫారెస్ట్​ భూములు కబ్జాకు గురవుతున్నాయి. ఆ భూములకు పోడు పట్టాలు వస్తాయని గిరిజనుల పేరిట కొందరు ఆక్రమణదారులు ఫారెస్ట్ భూములను చదును చేస్తున్నారు.మెట్‌‌‌‌పల్లి రేంజ్ పరిధిలో  ఇప్పటివరకు సుమారు 423 ఎకరాలకు పైగా భూములు కబ్జాకు గురైనట్లు అటవీశాఖ రికార్డులు చెబుతున్నాయి.  ఇటీవల ఒక్క మెట్‌‌‌‌పల్లి మండలంలోనే  సుమారు 120 ఎకరాలను కబ్జా చేసేందుకు ఆ భూములను చదును చేశారు. దీనిపై ఫారెస్ట్​ ఆఫీసర్లు పోలీసులకు ఫిర్యాదు చేశారు. కాగా ఇప్పటివరకు ఆక్రమణలకు సంబంధించి 281 మందిపై 92 కేసులు నమోదయ్యాయి. . అయినప్పటికీ ఆక్రమణల పర్వం కొనసాగుతూనే ఉంది. 

ఫారెస్ట్​ శాఖలో సిబ్బంది కొరత 

మెట్ పల్లి రేంజ్ పరిధిలో  22,626 ఎకరాల ఫారెస్ట్ ల్యాండ్స్ ఉన్నాయి. మెట్ పల్లి, ఇబ్రహీంపట్నం, మల్లాపూర్, కథలాపూర్, కోరుట్ల మండలాల్లో 12 ఫారెస్ట్ బీట్‌‌‌‌లు ఉన్నాయి. ఈ ప్రాంతాల్లో చాలా భాగం  దట్టమైన అడవులు ఉన్నాయి.  ఇప్పటికే పోడు భూముల పేరిట వందలాది  ఎకరాలు ఆక్రమణకు గురికాగా,  మైనింగ్‌‌‌‌మాఫియా గుట్టల్లో తవ్వకాలతో అటవీ సంపద తరిగిపోతోంది.  కాగా ఫారెస్ట్​ డిపార్ట్‌‌‌‌మెంట్‌‌‌‌లో సిబ్బంది కొరత వేధిస్తోంది. 12 మంది బీట్​ఆఫీసర్లు ఉండాల్సి ఉండగా కేవలం నలుగురితోనే నెట్టుకొస్తున్నారు. మిగతా బీట్లలో ఈ నలుగురే ఇన్‌‌‌‌చార్జి బాధ్యతలు నిర్వర్తిస్తుండడంతో ఆక్రమణలు అడ్డుకోలేకపోతున్నారు.  

ముగ్గురికే పట్టాలు 

సర్కారు నిబంధనల ప్రకారం 2005కు ముందు నుంచి సాగులో చేస్తున్నవారికే పోడు హక్కులు కల్పించే అవకాశం ఉంది. బీఆర్​ఎస్​ హయాంలో మెట్‌‌‌‌పల్లి రేంజ్​పరిధిలో పోడు పట్టాల కోసం 2,600 దరఖాస్తులు వచ్చాయి. వీటిని పరిశీలించిన అధికారులు  కేవలం ముగ్గురినే అర్హులుగా తేల్చి వారికే పట్టాలు అందజేశారు. అయినప్పటికీ ఫారెస్ట్ ​భూముల కబ్జా ఆగడం లేదు. భవిష్యత్‌‌‌‌లో పోడు పట్టాలు వస్తాయన్న ఆశతో గిరిజన రైతుల ముసుగులో ట్రాక్టర్లు, జేసీబీలతో చదును చేస్తూ 
ఆక్రమించుకుంటున్నారు. 

కబ్జా చేస్తే కఠిన చర్యలు తీసుకుంటాం

ఫారెస్ట్ భూములు కబ్జా కాకుండా పకడ్బందీగా చర్యలు చేపడుతున్నాం. ఆక్రమణలకు పాల్పడితే కఠిన చర్యలు తీసుకుంటాం. ఆత్మనగర్, రంగారావు పేట, మెట్లచిట్టాపూర్, అండుబొందుల తాండా, కేసీఆర్ తాండా, ఏఎస్సార్ తండా  శివారుల్లో ఫారెస్ట్ భూముల కబ్జాకు యత్నిస్తున్న వారిపై నిఘా పెట్టాం. కబ్జాకు యత్నించిన వారిని గుర్తించి ఫిర్యాదు చేశాం. ఫారెస్ట్ భూముల్లో సుమారు 20 వేలకు పైగా ప్లాంటేషన్ పెంచాం. ఇటీవల కొందరు ప్లాంటేషన్ ధ్వంసం చేసి కొందరు కబ్జాకు ప్రయత్నించారు. వారిపై కూడా పోలీసులకు ఫిర్యాదు చేశాం.  

షౌకత్ అలీ,  మెట్‌‌‌‌పల్లి రేంజ్ ఆఫీసర్