మెట్‌పల్లి, వెలుగు: మామిడి కట్టె తరలించేందుకు పర్మిషన్ ఇవ్వడానికి డబ్బులు డిమాండ్ చేసిన ఫారెస్ట్ డిప్యూటీ రేంజ్ఆఫీసర్ను ఏసీబీ ఆఫీసర్లు పట్టుకున్నారు. సోమవారం రూ. 4,500 తీసుకుంటూ ఏసీబీకి రెడ్‌హ్యాండెడ్‌గా దొరికిపోయాడు. ఏసీబీ డీఎస్పీ రమణమూర్తి తెలిపిన వివరాల ప్రకారం.. సిరిసిల్ల జిల్లా గంభీరావుపేట మండలం రాజా సింగవరం గ్రామానికి చెందిన పల్లపు నరేశ్ కథలాపూర్ మండలం ఇప్పపల్లి గ్రామ శివారు నుంచి కామారెడ్డి జిల్లాకు మామిడి కట్టె తరలించేందుకు పర్మిషన్ కోసం ఆన్‌లైన్‌లో అప్లై చేశాడు. తర్వాత కథలాపూర్ సెక్షన్‌కు ఇన్‌చార్జిగా వ్యవహరిస్తున్న మెట్‌పల్లి ఫారెస్ట్ డిప్యూటీ రేంజ్ ఆఫీసర్ మహ్మద్ హఫీజుద్దీన్ కలిశాడు. పర్మిషన్ ఇచ్చేందుకు రూ. 10 వేలు ఇవ్వాలని హఫీజుద్దీన్ డిమాండ్ చేశాడు.
దీంతో ఈ నెల14 న రూ.5 వేలు ఇచ్చి 10 టన్నుల మామిడి కట్టెను కామారెడ్డికి తరలించాడు. మిగిలిన 8 టన్నుల కట్టెను తరలించేందుకు మరో రూ. 5 వేలు ఇవ్వాలని ఫారెస్ట్ ఆఫీసర్ డిమాండ్ చేశారు. దీంతో నరేశ్ ఏసీబీ ఆఫీసర్లకు ఫిర్యాదు చేశాడు. వారి సూచనతో నరేశ్ సోమవారం హఫీజుద్దీన్‌ను కలిసేందుకు మెట్‌పల్లికి రాగా.. ఆఫీస్‌లో కాకుండా తాను రెంట్‌కు ఉండే ఇంటికి రావాలని సూచించాడు. దీంతో నరేశ్ ఆఫీసర్ ఇంటికి వెళ్లి డబ్బులు తక్కువ తీసుకోవాలని కోరాడు. దీంతో రూ.500 తగ్గించి రూ. 4,500 ఇవ్వాలని చెప్పడంతో నరేశ్ ఆ డబ్బులను ఇచ్చేశాడు. అప్పటికే అక్కడ వేచి ఉన్న ఏసీబీ ఆఫీసర్లు హఫీజుద్దీన్‌ను రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. దాడిలో ఏసీబీ సీఐలు పూర్ణచందర్, తిరుపతి ఉన్నారు.