అటవీ అధికారులపై గ్రామస్తుల దాడి..ఆదిలాబాద్ జిల్లా కేశవపట్నంలో తీవ్ర ఉద్రిక్తత  

అటవీ అధికారులపై గ్రామస్తుల దాడి..ఆదిలాబాద్ జిల్లా కేశవపట్నంలో తీవ్ర ఉద్రిక్తత  

ఆదిలాబాద్, వెలుగు:   కలప స్మగ్లర్లు  ఉన్నారనే సమాచారంతో ఆదివారం అటవీశాఖ అధికారులు వెళ్లగా కొందరు గ్రామస్తులు దాడికి దిగిన ఘటన ఆదిలాబాద్ జిల్లా ఇచ్చోడ మండలం కేశపట్నంలో జరిగింది.  తమ ఇండ్లలో సోదాలు చేయొద్దంటూ అడ్డుకోవడంతో ఘర్షణ వాతావరణం నెలకొంది. చివరకు అధికారులు పోలీసులకు సమాచారమివ్వడంతో ఇచ్చోడ సీఐ భీమేశ్, ఎస్ తిరుపతి సిబ్బందితో వెళ్లి.. ఘర్షణకు దిగిన గ్రామస్తులను  అదుపులోకి తీసుకున్నారు. అనంతరం  సోదాలు చేయగా 3.50 లక్షల విలువైన కలప దొరికింది.  వారం రోజుల కింద సిరిచెల్మ అటవీలో కలప తరలిస్తున్నారనే సమాచారంతో అటవీ అధికారులు వెళ్లగా స్మగ్లర్లు పరారయ్యారు.

 కేశవపట్నం గ్రామానికి చెందిన ఓ వ్యక్తిని అదుపులోకి తీసుకోగా..  అతడిచ్చిన  సమాచారంతో తనిఖీలకు వెళ్లినట్టు ఎఫ్డీఓ రేవంత్ చంద్ర తెలిపారు. రాళ్లు, రాడ్లతో తమపైకి దాడికి దిగారని, రెండు వాహనాలు స్వల్పంగా దెబ్బతిన్నట్లు పేర్కొన్నారు. బీట్ ఆఫీసర్ జాదవ్  నౌశీలాల్ కు స్వల్ప గాయాలైనట్టు చెప్పారు. ఆదిలాబాద్ డీఎఫ్ఓ ప్రశాంత్ బాజీరావు పాటిల్ పరిస్థితిని సమీక్షించారు.  స్మగ్లింగ్ కు పాల్పడిన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని చెప్పారు.