తల్లీ కొడుకులను కొరడాతో కొట్టిన ఫారెస్ట్​ ఆఫీసర్​

తల్లీ కొడుకులను  కొరడాతో కొట్టిన ఫారెస్ట్​ ఆఫీసర్​
  • దవాఖానకు వెళ్లకుండా అంబులెన్స్​ను తిప్పి పంపిండు 
  • రోడ్డుపై సీజ్​ చేసిన బైక్ ​ఎప్పుడిస్తారని అడిగినందుకే.. 
  • మంచిర్యాల జిల్లాలో ఘటన 

చెన్నూర్​, వెలుగు : సీజ్​ చేసిన బైక్​ను రిలీజ్​ చేయాలని అడిగినందుకు మంచిర్యాల జిల్లా చెన్నూర్ మండలం ఆస్నాద్​ ఫారెస్ట్​ సెక్షన్ ​ఆఫీసర్ ​బాలకృష్ణ.. తల్లీకొడుకులపై దాడి చేశాడు. బాధితుల కథనం ప్రకారం..చెన్నూర్ ​టోల్ ​ప్లాజా సమీపంలో గుడిసె వేసుకొని ఉంటున్న ఎరుకల ఎల్లక్క, ఆమె కొడుకు లక్ష్మణ్​ అక్టోబర్​24న ఆస్నాద్​లోని కులదైవానికి ఊర పందిని బలిచ్చి వస్తుండగా ఎఫ్ఎస్​వో బాలకృష్ణ అడ్డుకున్నాడు. అడవి పందిని చంపారంటూ కేసు పెట్టి బైక్ ​సీజ్ ​చేశాడు. రూ.25వేలు ఫైన్​ కట్టించుకుని బైక్ ​రిలీజ్​ చేయకుండా తిప్పించుకుంటున్నాడు. శుక్రవారం సాయినగర్ సమీపంలో ఎఫ్ఎస్​వో కలవగా బైక్ ఎప్పుడు రిలీజ్​ చేస్తారని అడిగారు. 

‘నన్ను రోడ్డుపై అడుగుతారా’ అంటూ బాలకృష్ణ ఫైర్ ​అయ్యాడు. ఆఫీసుకు రమ్మనడంతో వెళ్లగా తల్లీకొడుకులను కొరడాతో కొట్టాడు. దీంతో లక్ష్మణ్​ స్పృహ తప్పగా హాస్పిటల్​కు తీసుకువెళ్లేందుకు 108కు ఫోన్​ చేస్తే... డ్రామాలు అడుతున్నారంటూ అంబులెన్స్​ను తిప్పి పంపించాడు. ఉదయం 11 గంటల నుంచి 4 గంటల వరకు ఆఫీసులోనే నిర్బంధించాడు. చివరకు అతడి తల్లి ఎలాగో చెన్నూరు హాస్పిటల్​కు తీసుకువెళ్లింది. ఎస్​ఎఫ్​వో బాలకృష్ణ వివరణ కోరగా అడవి పందిని చంపినందుకు బైక్​సీజ్​ చేశానని, శుక్రవారం తల్లీకొడుకులు ఆఫీస్​కు వచ్చి డ్యూటీలో ఉన్న తనను కొట్టారని  ఆరోపించాడు. దీనిపై పీఎస్​లో ఫిర్యాదు చేయడంతో తాను దాడి చేసినట్టు ఆరోపణలు చేస్తున్నారన్నాడు.