
- ఫీల్డ్ లో తిరగాలంటే జంకుతున్న ఫారెస్ట్ ఆఫీసర్లు
- రక్షణ కల్పించాలంటూ పోలీసులను ఆశ్రయిస్తున్న సిబ్బంది
- గ్రామ సభల నిర్వహణకు వెనకడుగు
- ఇబ్బందిగా మారిన గిరిజనేతరుల స్థానికత నిరూపణ
మహబూబాబాద్, వెలుగు: భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో ఎఫ్ఆర్వో హత్య రాష్ట్ర వ్యాప్తంగా సంచలనమైంది. ఈక్రమంలో ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా ఫారెస్ట్ ఆఫీసర్లు సైతం పోడు సర్వేకు, గ్రామ సభల నిర్వహణకు జంకుతున్నారు. కొన్నిచోట్ల తమకు రక్షణ కల్పించాలని పోలీసులను ఆశ్రయిస్తున్నారు. ఆయుధాలు ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నారు. తమపైనా ఎక్కడ దాడి చేస్తారోనని ఫారెస్ట్ సిబ్బంది భయపడుతున్నారు. మరోవైపు స్థానికత నిరూపించుకోవడం గిరిజనేతరులకు సవాలుగా మారింది. 1930 నుంచి స్థానికంగా ఉంటేనే పోడు పట్టాలు ఇస్తామని ప్రభుత్వం చెప్పడంతో.. వారంతా తలలు పట్టుకుంటున్నారు. దీంతో పోడు పట్టాల పంపిణీ మరింత ఆలస్యం కానుంది.
ఆగిపోయిన గ్రామ సభలు...
ఉమ్మడి వరంగల్ లోని ములుగు, భూపాలపల్లి, మహబూబాబాద్ జిల్లాలో పోడు భూమి ఎక్కువగా ఉంది. లక్షలాది మంది రైతులు ఏండ్లుగా పోడు పట్టాల కోసం ఎదురుచూస్తున్నారు. కొన్నేండ్లుగా పోరాటాలు కూడా చేస్తున్నారు. ఈక్రమంలో ప్రభుత్వం చేపట్టిన సర్వేతో సమస్యలు పరిష్కారం అవుతాయని భావించారు. త్వరలోనే పోడు పట్టాలు వస్తాయని సంతోషపడ్డారు. కలెక్టర్ల ఆధ్వర్యంలో అన్ని జిల్లాలో దాదాపు 90 శాతానికిపైగా పోడు భూముల సర్వే కూడా పూర్తయింది. ఇటీవల ప్రభుత్వం గ్రామసభలు నిర్వహించి, అసలైన లబ్ధిదారుల ఎంపిక చేయాలని ఆదేశించడంతో ఆ ప్రక్రియ సైతం ప్రారంభమైంది. ఈక్రమంలోనే ఎఫ్ఆర్ వో హత్యతో గ్రామ సభలు ఆగిపోయాయి. దాడుల భయంతో మిగిలిన సర్వేతో పాటు గ్రామ సభల నిర్వహణకు ఫారెస్ట్ ఆఫీసర్లు దూరంగా ఉన్నారు. కొన్ని గ్రామాల్లో అర్హుల జాబితా వెల్లడిస్తే దాడులు జరుగుతాయనే ఉద్దేశంతో డాటాను గోప్యంగా ఉంచుతున్నారు.
గిరిజనేతరుల తిప్పలు..
అటవీ చట్టం ప్రకారం.. 2005కు ముందు సాగు చేసుకున్న భూములకు మాత్రమే పోడు పట్టాలు వస్తాయని ప్రభుత్వం స్పష్టం చేసింది. గిరిజనేతరులు అయితే.. 1930 నుంచి స్థానికతను నిరూపించుకోవాలని చెప్పింది. దీంతో 75 ఏండ్ల స్థానికత ఎలా నిరూపించుకోవాలో తెలియక చాలామంది గిరిజనేతర రైతులు ఇబ్బందిపడుతున్నారు. దీనివల్ల వేలాది మంది రైతులు అర్హత కోల్పోయే ప్రమాదం కూడా ఉంది. ప్రభుత్వం నిబంధనలు సడలించాలని గిరిజనేతరులు కోరుతున్నారు. ఇప్పటికిప్పుడు స్థానికత ఎలా నిరూపించుకోవాలని మండిపడుతున్నారు. ఇదిలా ఉంటే.. మహబూబాబాద్ జిల్లా నుంచే సీఎం కేసీఆర్ పోడు పట్టాల పంపిణీ కార్యక్రమం ప్రారంభిస్తారని మంత్రి సత్యవతి రాథోడ్ చెప్పడం
గమనార్హం.
‘మాకు రక్షణ కల్పించండి’
వెంకటాపూర్(రామప్ప): ఎఫ్ఆర్వో హత్య నేపథ్యంలో తమకు రక్షణ కల్పించాలని ఫారెస్ట్ సిబ్బంది ఎస్సైని వేడుకున్నారు. ములుగు జిల్లా వెంకటాపూర్ మండలానికి చెందిన ఫారెస్ట్ ఆఫీసర్లు.. శనివారం స్థానిక పోలీస్ స్టేషన్ లో ఎస్సై తాజూద్దీన్ కు వినతిపత్రం అందజేశారు. నిత్యం అడవుల్లో విధులు నిర్వహించే తమకు, పోడు పట్టాల విషయంతో ప్రమాదం పొంచి ఉందన్నారు. స్పందించిన ఎస్సై.. ఫారెస్ట్ ఆఫీసర్లకు రక్షణ కల్పిస్తామని, అడవుల్లోకి వెళ్లే ముందు సమాచారం ఇవ్వాలన్నారు.
ఉమ్మడి జిల్లాలో పోడు భూముల వివరాలు(ఎకరాల్లో..)
జిల్లా దరఖాస్తులు పోడు భూములు
భూపాలపల్లి 25,021 63,077
వరంగల్ 7,711 9,968
ములుగు 34,044 91,843
మహబూబాబాద్ 32,697 1,15,948