- పశువుల మీద దాడి చేసి చంపుతున్నాయనే కోపంతో విషప్రయోగం
- 8 మంది గిరిజనులను అదుపులోకి తీసుకున్న ఫారెస్ట్ ఆఫీసర్లు
- వీరిలో ఇద్దరు మైనర్లు.. దరిగాం అడవిలో సీన్ రీ కన్స్ట్రక్షన్
- నిందితులను విడిచిపెట్టాలని ఫారెస్ట్ ఆఫీసును ముట్టడించిన
- మూడు గ్రామాల ప్రజలు ఇద్దరు మైనర్లను విడిచిపెట్టిన అధికారులు
కాగజ్నగర్అడవుల్లోఇటీవల మరణించిన రెండు పులులను సమీప గ్రామాలకు చెందిన పశువుల కాపరులే చంపేశారని ఫారెస్ట్ఆఫీసర్లు ప్రాథమికంగా నిర్ధారించారు. ఈ మేరకు 8 మంది గిరిజనులను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. పులుల కళేబరాలు దొరికిన దరిగాం అటవీ ప్రాంతంలోకి నిందితులను గురువారం తీసుకెళ్లి సీన్రీకన్స్ట్రక్షన్ కూడాచేయించారు. తమ పశువుల మీద తరుచూ దాడి చేసి చంపుతున్నాయన్న కోపంతోనే పులుల మీద పశువుల కాపరులు విష ప్రయోగం చేసినట్టు ఫారెస్ట్ అధికారులు భావిస్తున్నారు.
నిందితులతో సీన్ రీ కన్స్ట్రక్షన్..
పులుల మీద విష ప్రయోగం జరిగిన ఘటనపై ఉన్నతాధికారులు సీరియస్ కావడంతో ఆదిలాబాద్ ఫారెస్ట్ కన్జర్వేటర్, కవ్వాల్ ఫీల్డ్ డైరెక్టర్ శాంతారాం, ఆదిలాబాద్ జిల్లా ఫారెస్ట్ ఆఫీసర్ నీరజ్ కుమార్ టిబ్రేవాల్ రంగంలోకి దిగారు. గత నెల 28న పులి ఓ పశువుపై దాడి చేసి చంపడం, ఆ పశువునే విషప్రయోగానికి ఎరగా వాడడంతో ఆ పశువు ఎవరిదనే కోణంలో దర్యాప్తు ప్రారంభించారు. ఈ క్రమంలో వాంకిడి మండలం రెంగరేట్, సర్కేపల్లితో పాటు కాగజ్ నగర్ మండలం దరిగాం గ్రామానికి చెందిన 8 మంది పశువుల కాపర్లను బుధవారం అదుపులోకి తీసుకున్నారు. వీరిలో ఇద్దరు పదేండ్ల బాలురు కూడా ఉన్నారు. ఫారెస్ట్ ఆఫీసర్లు తమదైన శైలిలో విచారించడంతో నిందితులు నిజం ఒప్పుకున్నట్టు తెలిసింది. పులులు తరుచూ తమ పశువులపై దాడి చేసి చంపుతుండడం, పులుల వల్ల తాము అడవిలోకి వెళ్లలేని పరిస్థితి ఉండడంతో తామే విష ప్రయోగం చేశామని వాళ్లు అంగీకరించినట్టు సమాచారం. దీంతో ఫారెస్ట్ ఉన్నతాధికారులు నిందితులను గురువారం అడవిలోకి తీసుకెళ్లి సీన్ రీకన్స్ట్రక్షన్ చేయించారు. ఇదంతా జిల్లా ఫారెస్ట్ ఆఫీసర్ నీరజ్ కుమార్ నేతృత్వంలో నిర్వహించారు.
గిరిజనుల ఆందోళన..
బుధవారం రాత్రి 8 మంది నిందితులను అదుపులోకి తీసుకున్న ఫారెస్ట్ ఆఫీసర్లు.. కాగజ్ నగర్లోని ఫారెస్ట్ డివిజన్ ఆఫీసుకు తరలించి విచారణ ప్రారంభించారు. బయట గేటుకు తాళం వేసి లోపలికి ఎవరూ వెళ్లకుండా జాగ్రత్త పడ్డారు. నిందితుల కుటుంబీకులను, మీడియాను లోపలికి అనుమతించలేదు. ఆదివాసీలను పోలీసులు అదుపులోకి తీసుకున్నారనే విషయం తెలిసి గిరిజన సంఘాల నాయకులు, సర్కేపల్లి, రెంగరేట్, దరిగాం గ్రామాలకు చెందిన జనం గురువారం ఫారెస్ట్ఆఫీసుకు చేరుకుని బైఠాయించారు. వీరికి బీఎస్పీ రాష్ట్ర కార్యదర్శి సిడం గణపతి మద్దతు పలికారు. నిందితులను విడుదల చేయాలని డిమాండ్ చేశారు. ‘‘బుధవారం మా గ్రామాలకు చెందిన కోవ జంగూ, ఆత్రం జలపతి, కుమ్రం చందు, మడావి నాగు, ఆత్రం జంగు, కోవ మల్లుతో పాటు మరో ఇద్దరు బాలురను ఫారెస్ట్ ఆఫీసర్లు అదుపులోకి తీసుకున్నారు. రాత్రంతా వారిని తీవ్రంగా కొట్టారు” అని ఆరోపించారు. గిరిజనుల ఆందోళనతో ఇద్దరు మైనర్లను అధికారులు విడిచిపెట్టారు. కాగా, కేసు వివరాలను శుక్రవారం మీడియాకు వెల్లడించే అవకాశం ఉంది.
మూడో పులి జాడెక్కడ?
గత నెల 26న పులి దాడి చేసి పశువును చంపేసింది. ఆ పశువు కళేబరంలో కొంతభాగం తిని వెళ్లిపోయింది. అయితే 27న ఆ పశువు కళేబరంలో పశువుల కాపరులు విషం పెట్టినట్టు తెలిసింది. 28న ఆ ప్రాంతంలో ఫారెస్ట్ సిబ్బంది సీసీ కెమెరా అమర్చగా, 29న మూడు పులులు విషం కలిసిన పశువు కళేబరాన్ని తిన్నట్టు రికార్డయ్యింది. ఇందులో ఇప్పటికే రెండు పులులు చనిపోగా, మూడో పులి జాడ కోసం వెతుకుతున్నారు. గురువారం 120 మంది ఫారెస్ట్ సిబ్బంది గాలింపు కొనసాగించారు.