గాంధారీవనం అభివృద్ధిపై ఫోకస్ .. 5 కి.మీ. కొత్త వాకింగ్ ట్రాక్ ఏర్పాటు

గాంధారీవనం అభివృద్ధిపై ఫోకస్ .. 5 కి.మీ. కొత్త వాకింగ్ ట్రాక్ ఏర్పాటు
  • సందర్శకుల కోసం రెస్ట్ హాల్(పగోడా) నిర్మాణం
  • ఓపెన్ జిమ్, రెండో గేటు ఏర్పాటుకు ఎమ్మెల్యే  వివేక్ వెంకటస్వామి ఆదేశాలు
  • అభివృద్ధిపై దృష్టి సారించిన ఫారెస్ట్ ఆఫీసర్లు 

కోల్ బెల్ట్, వెలుగు: మంచిర్యాల జిల్లా క్యాతనపల్లి మున్సిపాలిటీ పరిధిలోని గాంధారీవనం అర్బన్ పార్కు అభివృద్ధి పనులపై ఫారెస్ట్ ఆఫీసర్లు దృష్టి పెట్టారు. ఇటీవల సుమారు 5 కిలోమీటర్ల పొడవున కొత్త వాకింగ్ ట్రాకింగ్​ను ఏర్పాటు చేశారు. సందర్శకులు, వాకర్ల సౌకర్యార్థం రెస్ట్ హాల్(పగోడా) నిర్మాణ పనులు తుది దశకు చేరుకున్నాయి. చిల్డ్రన్స్ ప్లే గ్రౌండ్ పునరుద్ధరణకు సన్నాహాలు చేస్తున్నారు. ఇటీవల గాంధారీవనాన్ని సందర్శించిన చెన్నూరు ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి ఓపెన్​జిమ్, రెండో గేటు ఏర్పాటుతో పాటు పార్కు అభివృద్ధికి హామీ ఇవ్వడంతో వాకర్స్, సందర్శకులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. 

ఎనిమిదేండ్ల క్రితం ఏర్పాటు.. నిర్లక్ష్యం

మందమర్రి మండలం బొక్కలగుట్ట అటవీ ప్రాంతంలో మంచిర్యాల–మందమర్రి నేషనల్ హైవేకు ఇరువైపులా అన్ని హంగులతో ఎనిమిదేండ్ల క్రితం గాంధారీ వనం అర్బన్​పార్కును ఏర్పాటు చేశారు. సుమారు రూ.4 కోట్లతో 134 హెక్టార్లలో ఉన్న ఈ పార్కు పరిధిలో పిల్లల పార్కు, ప్రకృతివనం, జింకల పునరావాసం కేంద్రం, రాశీ, నక్షత్ర, ఔషధ, స్మృతి వనాలు  ఏర్పాటు చేశారు. 

వాకర్స్ కోసం మూడు కిలోమీటర్ల వాకింగ్ ట్రాక్, యోగా కేంద్రం, నీటి కుంట తవ్వించి బోటింగ్ సదుపాయం, వాచ్​టవర్, జంతువుల బొమ్మలను సందర్శకుల కోసం పెట్టారు. ఈ అర్బన్ పార్కును ఉమ్మడి జిల్లావాసులతో పాటు గోదావరిఖని ప్రాంతానికి చెందిన ప్రజలు, స్టూడెంట్లు సందర్శిస్తుండటారు. అయితే పర్యాటక కేంద్రంగా అభివృద్ధి చెందే దశలోనే పార్కు స్థలం మధ్య నుంచి మూడేండ్ల క్రితం నేషనల్ హైవే 363 ఫోర్​లేన్ నిర్మించడంతో పిల్లల అట వస్తువులు, జంతువుల బొమ్మలు, జింకల పునరావాసం కేంద్రం పహరీ ధ్వంసమయ్యాయి. 

ఆ తర్వాత పార్కు అభివృద్ధికి ఫండ్స్ కేటాయించకపోవడం, నిర్వహణలో నిర్లక్ష్యం కారణంగా ఆహ్లాదం కరువైంది. బోటింగ్ నిలిపివేయడంతో ఆదాయం రాకుండాపోయింది. ఏడాది క్రితం రామకృష్ణాపూర్ వైపుఉన్న రెండో గేటు మూసివేయడంతో వాకింగ్, జాగింగ్​కు వచ్చే వారి సంఖ్య పడిపోయింది. రాశి, నక్షత్ర, ఔషధ, స్మృతివనాల నిర్వహణకు నిధుల కొరత, ఆఫీసర్ల పర్యవేక్షణ లేక అవి పిచ్చి మొక్కల్లో కలిసిపోయాయి. 

అభివృద్ధిపై దృష్టి  

జిల్లా వాసులకు ఆహ్లాదం పంచిన గాంధారీ వనానికి పునర్​వైభవం తీసుకొచ్చేందుకు ఫారెస్ట్ ఆఫీసర్లు చర్యలు చేపట్టారు. జిల్లా అటవీశాఖ అధికారి శివ్ ఆశిశ్ సింగ్ నేతృత్వంలో వనంలో వివిధ అభివృద్ధి పనులు చేస్తున్నారు. ఇటీవల మూడు కిలోమీటర్ల పొడవైన ట్రాక్ లో మట్టి పోసి కొత్త వాకింగ్ ట్రాక్ నిర్మించారు. నీటి కుంటకు వెళ్లే మార్గం, కట్ట వెనుకభాగంలో మరో 2 కిలోమీటర్ల ట్రాక్ అందుబాటులోకి తీసుకొచ్చారు. సందర్శకులు, వాకర్స్ రెస్ట్ కోసం కొత్తగా చేపట్టిన రెండో పగోడా(రెస్ట్ హాల్) నిర్మాణ పనులు తుదిదశకు చేరుకున్నాయి. పార్కు ముందు భాగంలో పిల్లల కోసం ప్లే గ్రౌండ్ ఏర్పాటు చేయనున్నారు.  

రెండో గేటు , ఓపెన్ జిమ్ కు ఎమ్మెల్యే హామీ

గాంధారీ ప్రకృతి వనంలో మూసిన రెండో గేటు పునరుద్ధరణ, వాకర్స్ సౌకర్యార్థం ఓపెన్ జిమ్ ఏర్పాటుకు ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి హామీ ఇచ్చారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా గాంధారీవనాన్ని సందర్శించిన ఎమ్మెల్యే దృష్టికి వాకర్లు పలు సమస్యలు తీసుకెళ్లారు. ఈ నేపథ్యంలో ఈనెల 1న పార్కును ఎమ్మెల్యే సందర్శించారు. రామకృష్ణా పూర్ వైపు రింగ్ గేటు ఏర్పాటు చేయాలని, ఓపెన్ జిమ్ అందుబాటులోకి తీసుకురావాలని జిల్లా అటవీ అధికారి శివ్ ఆశిశ్ సింగ్, ఇతర ఆఫీసర్లను ఆదేశించారు. పార్కును మరింత అభివృద్ధి చేస్తానని హామీ ఇచ్చారు. ఎమ్మెల్యే ఆదేశాలతో రింగ్ గేట్ ఏర్పాటుపై చర్యలు చేపట్టారు. రామకృష్ణాపూర్ వైపు నుంచి వాకర్లు వచ్చేందుకు పర్మిషన్ ఇచ్చారు.