
- మంచిర్యాల జిల్లా చర్లపల్లి అడవుల్లో గుర్తించిన పాదముద్రలు
- అటవీ సమీప గ్రామాల ప్రజలను అలర్ట్ చేసిన ఫారెస్ట్ ఆఫీసర్లు
బెల్లంపల్లి, వెలుగు: మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి ఏరియాలో సంచరిస్తోన్న పెద్ద పులి రూటు మార్చింది. దీంతో ఫారెస్ట్ అధికారులు అలర్ట్ అయ్యారు. అచ్చలాపూర్ మండలంలోని గోపాలరావుపేట మీదుగా బెల్లంపల్లి మండలం చర్లపల్లి వైపు వెళ్లినట్టు ఆదివారం ఫారెస్ట్ అధికారులు పులి ముద్రలను గుర్తించారు. రెండు వారాల కింద బెల్లంపల్లి మండలం కన్నాల అటవీలో మకాం వేసిన పెద్దపులి ఇప్పుడు రూటు మార్చి చర్లపల్లి వైపు వెళ్లి అడవిలో సంచరిస్తుండడంతో రంగపేట, మాలగురిజా, చంద్రవెల్లి గ్రామాల ప్రజలు భయాందోళన చెందుతున్నారు. ప్రజలు, పశువుల కాపర్లు జాగ్రత్తగా ఉండాలని ఫారెస్ట్ రేంజ్ అధికారి పూర్ణచందర్ సూచించారు. వేటగాళ్ల ఉచ్చులకు పులి చిక్కకుండా చూస్తామని, పులిని వేటాడితే కఠిన చర్యలు తప్పవని ఆయన హెచ్చరించారు.
భూపాలపల్లి జిల్లాలోనూ..
మహదేవపూర్ : జయశంకర్ భూపాలపల్లి జిల్లా మహదేవపూర్ మండలం బీరసాగర్ ,అన్నారం అడవుల్లో పులి సంచారం కలకలం రేపింది. దీంతో అలర్టైన అటవీశాఖ అధికారులు గాలింపు చేపట్టారు. వారం కింద కాటారం మండలం నస్తురుపల్లి అటవీలో పులి పాద ముద్ర గుర్తులు కనిపించడంతో పాటు ఆదివారం మహదేవపుర్ అడవులలోనూ కనిపించాయి. దీంతో ఫారెస్ట్ ఆఫీసర్లు నాలుగు టీమ్ లుగా విడిపోయి పులి కోసం అడవిలో గాలింపు చేపట్టారు. సమీప గ్రామాల ప్రజలు జాగ్రత్తగా ఉండాలని అలర్ట్ చేశారు.