మల్హర్, వెలుగు: ఫారెస్ట్ ఆఫీసర్ల వేధింపులు తట్టుకోలేక ఓ రైతు గుండె ఆగిందని కుటుంబసభ్యులు ఆరోపించారు. జయశంకర్ భూపాలపల్లి జిల్లా మల్హర్ మండలం ఎడ్లపల్లి గ్రామానికి చెందిన భూక్య రాజు నాయక్ కు ఐదు ఎకరాల భూమి ఉంది. కొన్ని సంవత్సరాలుగా రాజు నాయక్ కు , కొయ్యూరు రేంజ్ ఫారెస్ట్ ఆఫీసర్లకు వివాదం నడుస్తోంది. రాజు నాయక్ సాగు చేస్తున్న భూమి ఫారెస్ట్ దని, సాగుకు వీలు లేదని ఫారెస్ట్ ఆఫీసర్లు రాజు నాయక్ తో గొడవపడేవారు. ఫారెస్ట్ ఆఫీసర్ల వేధింపులు రోజురోజుకూ ఎక్కువ కావడంతో రాజు నాయక్ బాధపడుతుండేవాడు. పాస్ బుక్కులు చూపించినా ఫారెస్ట్ ఆఫీసర్లు కనికరించలేదని కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. గతంలో మామిడి, జామ, పెసర, జొన్న, ఇతర పండ్ల మొక్కలను రాజు నాయక్ తన భూమిలో సాగు చేస్తుండగా ఫారెస్ట్ ఆఫీసర్లు అడ్డుకొన్నారని తెలిపారు.
బుధవారం ఫారెస్ట్ ఆఫీసర్లకు రాజు నాయక్ మధ్య వాగ్వాదం జరిగింది. ఫారెస్ట్ ఆఫీసర్లు తన భూమి లాక్కుంటారనే ఆవేదన చెందుతుండగా గురువారం రాజు నాయక్ కు గుండెపోటు వచ్చిందని, వెంటనే భూపాలపల్లి హాస్పిటల్ కు తీసుకెళ్లామని కుటుంబ సభ్యులు చెబుతున్నారు. చికిత్స పొందుతూ రాజు నాయక్ మృతి చెందాడు. రాజు నాయక్ మృతికి ఫారెస్ట్ ఆఫీసర్ల వేధింపులే కారణమని కుటుంబ సభ్యులు, గ్రామస్తులు ఆగ్రహం వ్యక్తం చేస్తూ డెడ్ బాడీతో భూపాలపల్లి ఫారెస్ట్ ఆఫీస్ ఎదురుగా రాస్తారోకో నిర్వహించారు. రాజు నాయక్ భార్య వనిత, ముగ్గురు కుమార్తెలు ఉన్నారు. కుటుంబ సభ్యులు కాటారం పోలీస్ స్టేషన్ లో ఫారెస్ట్ ఆఫీసర్లపై ఫిర్యాదు చేశారు.