- జంతు సంరక్షణ కార్యకర్త ఫిర్యాదుతో ఎంక్వైరీ
- మరోసారి తప్పు చేయనని వేడుకోవడంతో ఫైన్
జగిత్యాల టౌన్, వెలుగు: ‘బిగ్ బాస్ ఫేమ్’ గంగవ్వపై వైల్డ్ లైఫ్ యాక్ట్ కింద ఫారెస్ట్ ఆఫీసర్లు కేసు బుక్ చేశారు. ఎంక్వైరీ చేసేందుకు ఆమె వద్దకు వెళ్లగా తెలియక తప్పు చేశామని ఒప్పుకోవడంతో ఫైన్ విధించి కేసును క్లోజ్ చేశారు. వివరాల్లోకి వెళ్లే.. మై విలేజ్ షో ద్వారా గుర్తింపు పొందిన గంగవ్వ, యూ ట్యూబర్ రాజు 2022 మేలో చిలుక జోస్యం చెప్పే వీడియో తీసి యూట్యూబ్ లో అప్ లోడ్ చేశారు. దీంతో కరీంనగర్ కు చెందిన జంతు సంరక్షణ కార్యకర్త ఆదులాపురం గౌతమ్ ఫారెస్ట్ ఆఫీసర్లకు ఫిర్యాదు చేశారు.
గంగవ్వ, రాజు తమ స్వ ప్రయోజనాల కోసం చిలుకను బంధించి హింసించారని, వన్యప్రాణి సంరక్షణ చట్టాన్ని ఉల్లంఘించారని ఫిర్యాదులో పేర్కొన్నారు. దీంతో జగిత్యాల అటవీశాఖ అధికారులు కేసు నమోదు చేసి బుధవారం గంగవ్వ వద్దకు వెళ్లి విచారణ చేశారు. కాగా.. తమకు వణ్యప్రాణి సంరక్షణ చట్టంపై అవగాహన లేదని, మరోసారి అలాంటి తప్పు చేయమని గంగవ్వ వేడుకోగా.. రూ. 25వేల ఫైన్ వేసి కేసు క్లోజ్ చేసినట్టు ఎఫ్ ఆర్ఓ పద్మారావు తెలిపారు.