కలప స్మగ్లింగ్​కు పాల్పడుతున్న ఇద్దరి బైండోవర్

కలప స్మగ్లింగ్​కు పాల్పడుతున్న ఇద్దరి బైండోవర్
  • నన్ను కొట్టారని ఓ వ్యక్తి ఆవేదన

జన్నారం, వెలుగు: జన్నారం ఫారెస్ట్ రేంజ్​లో కలప స్మగ్లింగ్ చేస్తున్నారని మండలంలోని చింతగూడ గ్రామానికి చెందిన పాలాజి శ్రీనివాస్, పుట్టిగూడ గ్రామానికి చెందిన సత్రాజి లక్ష్మణ్​ను ఫారెస్ట్​ఆఫీసర్లు బుధవారం తహసీల్దార్ రాజమనోహర్ రెడ్డి ఎదుట బైండోవర్ చేశారు. పాలాజీ శ్రీనివాస్ ఇంట్లో అక్రమ కలపను స్వాధీనం చేసుకున్నామని, లక్ష్మణ్ కలప స్మగ్లింగ్ కు పాల్పడుతున్నాడని జన్నారం రేంజ్ ఆఫీసర్ సుస్వారావు తెలిపారు.

‘ఫారెస్ట్ ఆఫీసర్లు అకారణంగా కొట్టారు’

కలప స్మగ్లింగ్ చేస్తున్నానని ఫారెస్ట్ ఆఫీసర్లు తనను అకారణంగా కొట్టారని సత్రాజి లక్ష్మణ్ ఆవేదన వ్యక్తం చేశారు. బుధవారం సాయంత్రం మండల కేంద్రంలోని ప్రెస్ క్లబ్ ఎదుట మీడియా సమావేశంలో మాట్లాడారు. గ్రామానికి చెందిన జాడి రాజం అనే వ్యక్తి ఇంట్లోకి వంటచెరుకు కోసం గత శనివారం అడవికి వెళ్లానని.. విషయం తెలుసుకొని బుధవారం ఉదయం ఫారెస్ట్ ఆఫీసర్లు తన ఇంటికి వచ్చి జన్నారంలోని ఆఫీస్ కు తీసుకెళ్లి బేస్ క్యాంపు సిబ్బందితో కలసి కొట్టారని ఆవేదన వ్యక్తం చేశాడు. 

దళితుడైన తనను కలప స్మగ్లింగ్ నెపంతో కర్రలతో కాళ్లు, వీపుపై ఇష్టమొచ్చినట్లు కొట్టారని ఆరోపించాడు. లక్ష్మణ్​ను కొట్టిన ఫారెస్ట్ ఆఫీసర్లపై పోలీసులు ఎస్సీ ఎస్టీ అట్రాసిటి కేసు నమోదు చేసి చర్యలు తీసుకోవాలని ఎంఆర్పీఎస్ మండల ప్రెసిడెంట్ ప్రభుదాస్, జిల్లా నేత మామిడిపల్లి ఇందయ్య డిమాండ్ చేశారు. ఈ విషయమై జన్నారం ఇన్​చార్జి రేంజర్ ఆఫీసర్ సుస్మారావును సంప్రదించగా.. తాము ఎవరిని కొట్టలేదని అన్నారు.