చేతులు కాలాక ఆకులు పట్టుకుంటున్నరు .. రెండేండ్ల కిందటి పరిహారం ఇప్పుడు అందజేత

చేతులు కాలాక ఆకులు పట్టుకుంటున్నరు .. రెండేండ్ల కిందటి పరిహారం ఇప్పుడు అందజేత
  • రెండు పులుల మృతి తర్వాతఫారెస్ట్ ఆఫీసర్ల హడావుడి

కాగజ్ నగర్, వెలుగు: రైతులకు అందాల్సిన పరిహారంపై దృష్టిపెట్టని ఫారెస్ట్​ ఆఫీసర్లు.. రెండు పులులు మృతి చెందడంతో నిద్రలేచారు. ఆఘమేఘాల మీద ప్రజలకు అవగాహన కార్యక్రమాలు చేపడుతున్నారు. పులి దాడిలో పశువులు చనిపోతే వెంటనే పరిహారం ఇస్తామని అవగాహన కల్పిస్తూ.. రెండేళ్ల కిందటే పులి దాడిలో మృతి చెందిన పశువులకు సంబంధించిన నష్ట పరిహారం చెక్కులను ఇప్పుడు అందిస్తున్నారు. పులుల సంరక్షణలో అటవీశాఖ అధికారులకు సహకరించాలని, కరెంటు తీగలు అమర్చి వాటి ప్రాణం తీయవద్దని, పులి దాడి చేస్తే పశువులకు వారం రోజుల్లో పరిహారం ఇస్తానని స్వయానా జిల్లా ఫారెస్ట్ ఆఫీసర్ పల్లెల్లో అవగాహన కార్యక్రమాలు చేస్తున్నారు.

మంగళవారం కాగజ్ నగర్ మండలం వంజిరి గ్రామంలోని రైతు వేదికలో పులి దాడిలో చనిపోయిన 39 పశువుల యజమానులకు రూ.5 లక్షల పరిహారం చెక్కులను డీఎప్​ఓ నీరజ్ కుమార్ టిబ్రేవాల్ జడ్పీ ఇన్​చార్జి చైర్మన్ కోనేరు కృష్ణారావు, ఎమ్మెల్యే హరీశ్ బాబుతో కలిసి అందించారు. పులులకు హాని చేయబోమని అందరితో ప్రతిజ్ఞ చేయించారు. రూరల్ సీఐ నాగరాజు, ఎఫ్ఆర్​ఓ రమాదేవి, ఎస్ఐ సానియా పాల్గొన్నారు. కాగజ్ నగర్ రేంజ్ లోని దరిగాం అడవిలో 15 రోజుల క్రితం రెండు పులులు హతమవగా మిగిలిన నాలుగు పులుల జాడ ఇప్పటికీ దొరకలేదు. ఈ విషయంపై ఫారెస్ట్ ఆఫీసర్లు ఎలాంటి స్పష్టత ఇవ్వడంలేదు.