- ఆర్ఓఎఫ్ఆర్ పట్టాలపై అనుమానాలు
- పోడు సమస్య హింసాత్మకం కావడానికి గొత్తికోయలే కారణమంటున్న అటవీ శాఖ
- రాష్ట్రం నుంచి పంపించాలని డిమాండ్
భద్రాచలం,వెలుగు: పోడు భూముల సమస్యకు పరిష్కారం దొరుకుతుందని భావిస్తున్న తరుణంలో చండ్రుగొండ మండలంలో గొత్తికోయలు ఎఫ్ఆర్వోను హత్య చేయడంతో పోడు పట్టాలు వస్తాయా లేదా అనే అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. హత్య నేపథ్యంలో తమకు ఆయుధాలు ఇవ్వాలని, గొత్తి కోయలను రాష్ట్రం నుంచి పంపించేయాలని అటవీ శాఖ ఆఫీసర్లు, ఉద్యోగులు గురువారం నుంచి విధులు బహిష్కరించారు.
ఆర్ఓఎఫ్ఆర్ గ్రామసభల్లో ఫారెస్ట్ ఆఫీసర్ల సంతకాలే కీలకం కాగా, వారు రాకపోవడంతో సభలు నిర్వహించి ఏం ప్రయోజనమని అంటున్నారు. భద్రాద్రికొత్తగూడెం జిల్లాలో 83,663 క్లైమ్లు ఉన్నాయి. 2,99,477 ఎకరాల పోడు భూముల పట్టాలిచ్చే ప్రక్రియలో సబ్ డివిజనల్, జిల్లా స్థాయి మీటింగ్లో ఎఫ్ఆర్వోలు, డీఎఫ్ఓలు తీర్మానాలపై సంతకాలు చేయాలి. ఇప్పటికే 332 పంచాయతీల్లోని 726 హ్యాబిటేషన్లలో జాయింట్ సర్వే పూర్తయింది.
ఇప్పుడు గ్రామసభల్లో ఫారెస్ట్ బీట్ ఆఫీసర్లు సంతకాలు చేస్తేనే పట్టాలు వస్తాయి. ఇప్పుడు ప్రతీ పని ఫారెస్ట్ వాళ్లతోనే ముడిపడి ఉండడం, వాళ్లు విధులు బహిష్కరించడంతో గ్రామసభలెట్లా నిర్వహించాలని జిల్లా యంత్రాంగం తలలు పట్టుకుంటోంది. గురువారం భద్రాద్రికొత్తగూడెం జిల్లాలో 49 గ్రామసభలు జరిగాయి. ఏ గ్రామసభకు కూడా ఫారెస్ట్ స్టాఫ్ హాజరు కాలేదు.
గొత్తికోయ గ్రామాల్లో టెన్షన్..
రాష్ట్రం ఏర్పడ్డాక తొలిసారి ఎఫ్ఆర్వోస్థాయి అధికారి హత్య జరగడంతో పోడు సమస్య హింసాత్మకంగా మారడానికి గొత్తికోయలే ప్రధాన కారణమని అటవీశాఖ ఉన్నత అధికారులు ప్రకటించారు. ఫీల్డ్ లెవల్లో విధులు బహిష్కరించిన స్టాఫ్ వారిని రాష్ట్రం నుంచి పంపించేయాలని డిమాండ్ చేస్తున్నారు. దీంతో గొత్తి కోయ గ్రామాల్లో టెన్షన్ వాతావరణం నెలకొంది.
2018 లెక్కల ప్రకారం భద్రాద్రికొత్తగూడెం, ములుగు జిల్లాల్లో విలీనమైన వెంకటాపురం, వాజేడు మండలాలను కలుపుకుని 131 వలస ఆదివాసీ గ్రామాలున్నాయి. 11 వేల ఫ్యామిలీలు ఛత్తీస్గఢ్ నుంచి వలస వచ్చి జిల్లాలోని అటవీ ప్రాంతాల్లో జీవిస్తున్నారు. 2005లో ఛత్తీస్గఢ్ దండకారణ్యం, సల్వాజుడుం ఉద్యమంతో రావణకాష్టమైంది. దీంతో అక్కడి గొత్తికోయలు ఉమ్మడి ఏపీలోని ఖమ్మం జిల్లాకు వలస వచ్చారు.
అప్పటి నుంచి వారిని పంపించేందుకు సర్కారు ప్రయత్నిస్తున్నా జాతీయ స్థాయిలో వివిధ హక్కుల కమిటీలు, సంఘాల ఒత్తిళ్లతో వారికి ఇక్కడ రేషన్, ఆధార్, ఓటర్కార్డులతో పాటు ఇతర సదుపాయాలు కల్పిస్తున్నారు. నాన్ టింబర్ ఫారెస్ట్ ప్రొడక్ట్స్సేకరించే విషయంలోనూ స్థానిక ఆదివాసీలతో గొడవలు జరుగుతున్నాయి. రేంజర్ హత్య జరిగిన తర్వాత రాష్ట్రం నుంచి గొత్తికోయలను పంపించా లనే డిమాండ్ స్థానిక ఆదివాసీల నుంచి కూడా వస్తోంది.
గతంలో తెలంగాణ సర్కారు కూడా హరితహారం, అడవుల సంరక్షణలో భాగంగా వారికి ఎలాంటి సౌకర్యాలు కల్పించద్దని నిర్ణయించింది. అప్పుడు వ్యతిరేకత రావడంతో వెనక్కు తగ్గాల్సి వచ్చింది. తాజా ఘటన నేపథ్యంలో సర్కారు ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందోననే ఉత్కంఠ నెలకొంది.