ఆ దివాసీల హక్కులను హరించడానికి ఉభయ రాష్ట్రాలు ఎస్టీ జాబితాలో గిరిజనేతర కులాలను కలపాలని అసెంబ్లీలలో తీర్మానం చేస్తే రెండు రాష్ట్రాల ఆదివాసీ ప్రజాప్రతినిధులు మద్దతిచ్చి మనుగడను కూల్చింది చాలక కలుపుడు సరైనదేనని కితాబులిస్తున్నారు. తెలంగాణలో అయితే ఆత్మీయ సమ్మేళనాల పేరుతో.. ఏజెన్సీ లో గొర్రెల్ని బలిస్తున్నారు. అమాయక ఆదివాసీలకు డబుల్ బెడ్ రూమ్ ఇళ్ళు ఇస్తాము, ఇంటింటికి పెన్షన్ ఇస్తాం..అని మాయమాటలు చెప్పి ఆత్మీయ సమ్మేళనాలకు తీసుకెళ్లారు. 76 సంవత్సరాల స్వతంత్ర భారతంలో ఆదివాసీల అభివృద్ధి శూన్యం. లంబాడాల అభివృద్ధి గణనీయం. 76 ఏళ్లలో ఆదివాసీలకు జరిగిన అన్యాయం కంటే, కేవలం 8 ఏళ్ల కేసీఆర్ పాలనలో జరిగిన అన్యాయం వెలకట్టలేనిది. 2 లక్షల ఆదివాసీల భూమి హక్కులను పోలవరం ప్రాజెక్ట్ లో జల సమాధి చేశారు. 58 జీవో తెచ్చి ఏజెన్సీ ప్రాంతంలో తెల్ల కాగితాల పైన కొనుగోలు చేసిన గిరిజనుల భూములను 1/70 చట్ట విరుద్ధంగా గిరిజనేతరులకు పట్టాలు చేసి గిరిజనులకు అన్యాయం చేశారు. భూ ప్రక్షాళన పేరుతో ప్రభుత్వ భూములను కబ్జా చేసిన గిరిజనేతరులకు అక్రమంగా పట్టాలు చేశారు.
నేడు 11 కులాలను ఎస్టీ జాబితాలో చేర్చాలని అసెంబ్లీ తీర్మానం చేస్తే ఆదివాసీ ప్రజా ప్రతినిధులు ఒక్కరు కూడా ప్రభుత్వానికి వ్యతిరేకంగా నోరు మెదప లేదు. కానీ కేసీఆర్ బిడ్డ 100 కోట్ల కుంభకోణం చేస్తే ఎక్కడ ప్రభుత్వం పైన వ్యతిరేకత వస్తుందో అనే భయంతో ప్రజల ఆలోచనను మార్చడానికి కేసీఆర్ ఆత్మీయ సమ్మేళనాలు పెట్టిండు.రేపు ఆదివాసీ సమాజం ప్రభుత్వాన్ని, ప్రజా ప్రతినిధులను గ్రామాల్లో ఖచ్చితంగా నిలదీస్తుంది. వీళ్లు పార్టీలకు మాత్రమే ప్రజా ప్రతినిధులా... ప్రజలకు ప్రతినిధులు కారా? 11 గిరిజనేతర కులాలను ఎస్టీ జాబితాలో కలిపితే విద్యా, ఉద్యోగాల్లో, రాజకీయ పదవులు సైతం 11 గిరిజనేతర కులాలు సొంతం చేసుకునే ప్రమాదం ఉంది. ఇప్పటికే లంబాడాలను ఎస్టీ జాబితాలో కలిపితే అసలైన ఆదివాసీలకు ఉద్యోగాలు, రాజకీయ పదవులు మొత్తం లంబాడాలకే పోతున్నాయి. ఇప్పుడు 11గిరిజనేతర కులాలను ఎస్టీ జాబితాలో కలిపితే అసలైన ఆదివాసీలు తీవ్రంగా నష్టపోతారు.
–వూకె రామకృష్ణ దొర, ఫ్రీలాన్స్ జర్నలిస్ట్