
పుట్టిన రోజు..ముఖ్యమైన రోజుల్లో ఒకటి. ఆ రోజు ఎంతో స్పెషల్గా, సంతోషంగా ఉండాలి అనుకుంటారు ఎవరైనా. అందరూ విష్ చేస్తుంటే మనసు సంతోషంతో నిండి పోతుంది. ఇష్టమైనవాళ్లు విష్ చేస్తే..ఆ ఆనందం రెట్టింపవుతుంది. కానీ, జీవితంలో ఎంతో ముఖ్యమైన వ్యక్తి అనుకునేవాళ్లే పుట్టినరోజు మర్చిపోతే? చాలా బాధగా అనిపిస్తుంది. ఆ ప్రభావం చాలా రోజులు ఉంటుంది.
అందుకే.. ఓ దేశం ఒక వినూత్న చట్టం తీసుకొచ్చింది. ఈ చట్టం భార్యాభర్తలకు మాత్రమే వర్తిస్తుంది. ప్రపంచ వ్యాప్తంగా భార్య పుట్టిన రోజును మర్చిపోయే భర్తలు చాలామందే ఉంటారు. కానీ సమోవా అనే దేశంలో మాత్రం అలా మర్చిపోవడం చాలా పెద్ద నేరం. మర్చిపోయిన భర్తకి భారీ శిక్ష పడుతుంది. సమోవా దేశంలో భార్య బర్త్డే మర్చిపోయిన భర్తకు ఏకంగా ఐదేళ్ల జైలు శిక్ష వేస్తారు.
ఒక్కసారైతే ఓకే
ఈ దేశంలో అమల్లో ఉన్న చట్టం ప్రకారం భార్య పుట్టిన రోజును మొదటిసారి మర్చిపోతే ఆ భర్తను హెచ్చరించి వదిలేస్తారు. రెండోసారి కూడా అదే తప్పు చేస్తే.. ఆ భర్తకు గరిష్ఠంగా ఐదేళ్ల జైలు శిక్షతో పాటు జరిమానా కూడా విధిస్తారు. అంతేకాదు ఇలాంటి ఘటనలపై ఫిర్యాదుల కోసం అక్కడి పోలీసు వ్యవస్థలో ప్రత్యేక బృందాలను ఏర్పాటుచేశారట. తమ బర్త్డేలను మరిచిపోయే భర్తలపై భార్యలు ఈ బృందం అధికారులకు ఫిర్యాదు చేస్తే చాలు. వెంటనే ఆ భర్త మీద యాక్షన్ తీసు కుంటారు ఆ అధికారులు.
ఈ చట్టం గురించి భార్యలకు వివరించడానికి ప్రత్యేక అవేర్నెస్ క్యాంపులను సైతం పెడుతున్నారు అధికారులు. అందుకే అక్కడి పురుషులు ఏం మర్చిపోయినా భార్య పుట్టిన రోజుని మాత్రం అస్సలు మర్చిపోవట్లేదు. భార్య బర్త్డే కోసం కొన్ని రోజుల ముందు నుంచే ప్లాన్ చేసుకుంటారు. ఆ రోజున భార్య ఆనందంగా ఉండేలా చూసుకుంటున్నారు. ఇండియాలో కానీ ఇలాంటి శిక్షలు అమల్లోకి వస్తే జైళ్లు నిండిపోతాయని సరదాగా కామెంట్ చేస్తున్నారు కొందరు.