- ఎలాంటి ఎంక్వైరీ లేకుండానే మంజూరు చేసిన బ్యాంక్ సిబ్బంది
గరిడేపల్లి, వెలుగు : పొదుపు సంఘం సభ్యుల సంతకాలను ఫోర్జరీ చేసి రూ. 10 లక్షలు స్వాహా చేసిన ఘటన సూర్యాపేట జిల్లా గడ్డిపల్లిలో శుక్రవారం వెలుగు చూసిం ది. సూర్యాపేట జిల్లా నేరేడుచర్ల మండలం ఫత్తేపురం గ్రామానికి చెందిన సాయి సుధ సమభావన సంఘం సభ్యులు శుక్రవారం లోన్ కోసం గడ్డిపల్లి ఎస్‌బీఐకి వచ్చారు. తమ సంఘానికి లోన్ మంజూరు చేయాలని ఫీల్డ్ ఆఫీసర్‌ను కలిశారు.
అయితే సంఘం పేరున ఇప్పటికే రూ. 10 లక్షల లోన్ ఉందని ఫీల్డ్ ఆఫీసర్ చెప్పారు. దీంతో తాము ఎలాంటి లోన్ తీసుకోలేదని, ఎవరికి ఇచ్చారంటూ నిలదీయడంతో అసలు విషయం బయట పడింది. ఫత్తేపురం గ్రామానికి చెందిన వీవోఏ అన్నమ్మ సంఘం సభ్యులు, కమ్యూనిటీ కో ఆర్డినేటర్ ఫోర్జరీ సంతకాలు, స్టాంప్‌లతో తీర్మానం కాపీని గతేడాది నవంబర్ 9న బ్యాంక్‌లో ఇచ్చి రూ. 10 సీసీఎల్ లోన్ మంజూరు చేయాలని కోరింది.
బ్యాంక్ సిబ్బంది సైతం కనీస విచారణ చేయకుండా, సంఘానికి ఫస్ట్, సెకండ్ లీడర్లు లేకుండానే అమౌంట్‌ను ట్రాన్స్‌ఫర్ చేసినట్లు తేలింది. దీంతో సంఘం సభ్యులు బ్యాంక్ ఎదుట ఆందోళనకు దిగారు. సంఘ లీడర్లు, సభ్యులు లేకుండా వేరే వ్యక్తుల అకౌంట్‌లోకి డబ్బులు ఎలా ట్రాన్స్‌ఫర్ చేస్తారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఫోర్జరీ చేసిన వీవోఏ, నిర్లక్ష్యంగా వ్యవహరించిన బ్యాంక్ సిబ్బందిపై చర్యలు తీసుకోవడంతో పాటు, తమ డబ్బులు ఇప్పించాలని డిమాండ్ చేశారు.