- ఉత్తర్వులు జారీచేసిన ప్రభుత్వం
- చైర్మన్గా రిటైర్డ్ ఐఏఎస్ బూసాని వెంకటేశ్వరరావు
- సెక్రటరీగా బీసీ గురుకులాల కార్యదర్శి సైదులు
హైదరాబాద్, వెలుగు: స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీ రిజర్వేషన్ల ఖరారు కోసం ప్రభుత్వం ప్రత్యేక డెడికేటెడ్ కమిషన్‌ను ఏర్పాటు చేసింది. ఈ కమిషన్‌కు చైర్మన్గా రిటైర్డ్ ఐఏఎస్ అధికారి బూసాని వెంకటేశ్వరరావు, మెంబర్ గా ఐఎఫ్ఎస్ అధికారి, బీసీ గురుకులాల సెక్రటరీ సైదులును నియమించారు. ఈ మేరకు సోమవారం బీసీ వెల్ఫేర్ ప్రిన్సిపల్ సెక్రటరీ బుర్రా వెంకటేశం ఉత్తర్వులు జారీ చేశారు.
నెల రోజుల్లోగా దీనిపై నివేదిక అందించాలని ప్రభుత్వం ఉత్తర్వుల్లో పేర్కొన్నది. హైకోర్టు ఆదేశాల మేరకే కమిషన్ ఏర్పాటు చేస్తున్నట్టు స్పష్టం చేసింది. కాగా, రిపోర్ట్ రెడీ చేసేందుకు కావాల్సిన సమాచారాన్ని బీసీ కమిషన్ నుంచి తీసుకోవాలని డెడికేటెడ్ కమిషన్‌కు ప్రభుత్వం సూచించింది. కేంద్ర,రాష్ట్ర ప్రభుత్వ శాఖలు, ప్రభుత్వ రంగ సంస్థలు, సంఘాల నేతలు, మేధావుల నుంచి వివరాలు తీసుకోవచ్చని తెలిపింది. మేధావులు, రీసెర్చ్ స్కాలర్స్ అనుభవాన్ని సైతం ఉపయోగించుకోవచ్చని పేర్కొన్నది.
బీసీ సంఘాలతో మీటింగ్స్, టూర్లకు వెళ్లే వెసులుబాటును కూడా ప్రభుత్వం కల్పించింది. కమిషన్ స్టాఫ్, ఆఫీస్ , ఇతర గైడ్ లైన్స్ ను త్వరలోనే వేరే ఉత్తర్వుల్లో విడుదల చేస్తామని బుర్రా వెంకటేశం పేర్కొన్నారు. ఇదిలా ఉండగా.. చైర్మన్గా నియమితులైన బూసాని1987 లో గ్రూప్– 1 పోస్ట్ కి సెలెక్ట్ అయ్యారు. 1993లో కన్ఫర్డ్ ఐఏఎస్ అయ్యారు. అనంతరం విజయనగరం కలెక్టర్ గా, సింగరేణి డైరెక్టర్ గా, స్టేట్ ఎలక్షన్ కమిషన్ సెక్రటరీగా, రెవెన్యూ, జీఏడీ సెక్రటరీగా, ఎంసీహెచ్ ఆర్డీ అడిషనల్ డీజీగా పనిచేశారు. రెవెన్యూ ప్రిన్సిపల్ సెక్రటరీగా పనిచేస్తూ.. 2019 డిసెంబర్ 31న రిటైర్ అయ్యారు.
హైకోర్టు ఆదేశాలతో కమిషన్
బీసీ రిజర్వేషన్లను ఖరారుకు డెడికేటెడ్ కమిషన్ ఏర్పా టు చేయాలని ఇటీవల ప్రభుత్వాన్ని హైకోర్టు ఆదేశించింది. ఈ నేపథ్యంలో ఆదివారం మంత్రులు, అధికారులతో సమావేశం నిర్వహించి, వెంటనే కమిషన్ ఏర్పాటు చేయాలని అధికారులను సీఎం రేవంత్రెడ్డి ఆదేశించారు. ఈ మేరకు ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. రాష్ట్రవ్యాప్తంగా ఈ నెల 6 నుంచి సామాజిక, ఆర్థిక, రాజకీయ సర్వే స్టార్ట్ కానున్నది.