తెలంగాణ​లో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడటం ఖాయం : ఉత్తమ్

హుజూర్ నగర్, వెలుగు: రాబోయే అసెంబ్లీ  ఎన్నికల్లో హుజూర్​నగర్​లో తనకు  50 వేల మెజారిటీకి ఒక్క ఓటు తగ్గినా తాను రాజకీయాలనుంచి తప్పుకుంటానని ఎంపీ ఉత్తమ్ కుమార్ రెడ్డి అన్నారు. స్టేట్​లో 75 సీట్లకుపైగా గెలిచి కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఏర్పాటు చేయటం ఖాయమని ఆయన అన్నారు. ఈ విజయమే రాహుల్ గాంధీ ప్రధాని కావడానికి తొలి మెట్టు అవుతుందని పేర్కొన్నారు. నవంబర్​లో ఎన్నికలు జరిగే ఐదు రాష్ట్రాల్లో  కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడం ఖాయమని ఉత్తమ్​ ధీమా వ్యక్తం చేశారు. సూర్యాపేట జిల్లా హుజూర్ నగర్ మండలం వేపల సింగారం గ్రామానికి చెందిన బీఆర్ఎస్  మండల అధ్యక్షుడు, ఎంపీటీసీ ముడెం గోపిరెడ్డి తన 200 మంది అనుచరులతో మంగళవారం ఉత్తమ్ సమక్షంలో కాంగ్రెస్ లో చేరారు. ఈ సందర్భంగా ఉత్తమ్ మాట్లాడుతూ.. తన హయాంలో జరిగిన అభివృద్ధి తప్ప నియోజకవర్గంలో ఎక్కడా డెవలమెంట్ కనిపించడం లేదన్నారు. నియోజకవర్గ అభివృద్ధి పేరుతో  కమీషన్లు తీసుకుని ఎమ్మెల్యే సైదిరెడ్డి మూడేండ్లలో 300 ఎకరాలు అక్రమంగా  సంపాదించారని ఆరోపించారు. పోలీసుస్టేషన్ లను వాడుకుంటూ ఎమ్మెల్యే రాజకీయాలు చేస్తున్నారని దుయ్యబట్టారు.

భూములు, ఇసుక, లిక్కర్, మైనింగ్ వ్యాపారాలు చేస్తూ అడ్డొచ్చిన తమ కార్యకర్తలపై తప్పుడు కేసులు పెడుతున్నారని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. అధికార పార్టీ కోసం తప్పుడు పనులు చేస్తున్న అధికారులు త్వరలో ప్రభుత్వం మారుతుందని గుర్తుపెట్టుకోవాలని  హెచ్చరించారు. అధికార పార్టీ నాయకుల వేధింపులు భరించలేక  బీఆర్ఎస్ కు, ఎమ్మెల్యే సైదిరెడ్డికి ప్రజలు  బై బై చెప్పడం ఖాయమని అన్నారు. తెలంగాణ ఇచ్చిన సోనియా గాంధీ, రాహుల్ గాంధీలపై కేటీఆర్, కవిత తమ స్థాయికి మించి వ్యాఖ్యలు చేస్తున్నారని, వారి గురించి మాట్లాడే స్థాయి వారికి లేదని ఆయన గుర్తుచేశారు.