
హైదరాబాద్: తెలంగాణలో ప్రముఖ పుణ్యక్షేత్రం యాదగిరి గుట్ట విషయంలో రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. తిరుమల బోర్డు తరహాలో యాదగిరి గుట్టకు బోర్డు ఏర్పాటు చేస్తున్నట్లు ప్రకటించింది. ఈ మేరకు అసెంబ్లీలో రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ ప్రకటన చేశారు. టీడీటీ తరహాలో వైటీడీ ఏర్పాటు చేస్తున్నట్లు ఆమె ప్రకటించారు. వైటీడీ బోర్డులో మొత్తం 18 మంది సభ్యులు ఉంటారని.. వీరి పదవి కాలం రెండేళ్లని చెప్పారు. వీరికి ఎలాంటి జీతభత్యాలు ఉండవని తెలిపారు. బోర్డు చైర్మన్తో పాటు సభ్యులకు జీతభత్యాలుండవని.. కేవలం డీఏ ఇస్తామని క్లారిటీ ఇచ్చారు.
టీటీడీ తరహాలోనే వైటీడీ సేవా కార్యక్రమాలు:
యాదగిరి గుట్ట ఆలయ వ్యవహారాలను సమర్థవంతంగా నిర్వహించేందుకే బోర్డు ఏర్పాటు చేస్తున్నట్లు వెల్లడించారు మంత్రి కొండా సురేఖ. వైటీడీ బోర్డు ద్వారా విద్యా వ్యాప్తికి కృషి చేస్తామని తెలిపారు. టీటీడీ తరహాలోనే వైటీడీ బోర్డుతో సేవా కార్యక్రమాలు చేస్తామన్నారు.