ఏర్పాటు లక్ష్యానికి విరుద్ధంగా.. హెచ్​ఎండీఏ అడుగులు!

హైదరాబాద్ మెట్రోపాలిటన్ డెవలప్ మెంట్ అథారిటీ(హెచ్ఎండీఏ) 2008లో అప్పటి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 7,257 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంతో ఏర్పడింది. మునుపు దీని పేరు హుడా. దీని పరిధిలో 7 జిల్లాలు, 70 మండలాలు,1032 గ్రామాలు ఉన్నాయి. ప్రపంచంలో సింగపూర్, హాంగ్ కాంగ్​సహా 30 దేశాల విస్తీర్ణం దీని కంటే తక్కువ. ఇంతటి విస్తీర్ణంలో దాదాపు కోటిన్నర జనాభా నివసిస్తున్నది. వీళ్లకు, రాబోయే కాలంలో పెరిగే జనాభాకు కావల్సిన ఇండ్లు, ఇతర వసతులు కల్పించే బాధ్యత హెచ్ఎండీఏ మీద ఉన్నది. అందరికీ, ముఖ్యంగా పేదలకు, ఈ మహానగరంలో సౌఖ్యంగా, గౌరవంగా జీవించే విధంగా మౌలిక సౌకర్యాలు(నివాసం, నీళ్లు, ఇతర సేవలు) ఏర్పాటు చేసే బాధ్యత ఈ ప్రణాళిక సంస్థ మీద ఉన్నది. సామాజిక న్యాయం, సమతుల్య అభివృద్ధి, పర్యావరణ పరిరక్షణ ఈ బాధ్యతలో భాగమే. అయితే, హెచ్ఎండీఏ పని చేస్తున్న తీరు వీటికి సంబంధం లేకుండా ఉన్నది. పాలన లేదు, సుపరిపాలన ఆలోచన లేదు. ఫక్తు వ్యాపార సంస్థగా పరిణమించిన హెచ్ఎండీఏ ఒక చట్టం దన్నుగా ప్రజల శ్రేయస్సు కోసం ఏర్పడిందన్న విషయం మర్చిపోయింది.

పాలకమండలి సమావేశాలు ఏవి?

స్వయంగా సీఎం అధ్యక్షతన మున్సిపల్ శాఖ మంత్రి, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సహా అనేక శాఖల అధిపతులు, రైల్వే, విద్యుత్, ఆర్టీసీ, ఎన్నికైన ప్రజా ప్రతినిధులతో కూడిన  పాలక మండలిలో మొత్తం 28 మంది సభ్యులకు హెచ్ఎండీఏ 2008 చట్టం మేరకు స్థానం ఉంది. 2008లో ప్రకటించిన 20 మంది సభ్యుల పాలక మండలి ఇప్పటికీ ఉన్నది. తెలంగాణ ఏర్పడినా కొత్త పాలక మండలి నోటిఫై చేయలేదు. అదనంగా ఒక ఎగ్జిక్యూటివ్​కమిటీ కూడా ఉంది. అది కూడా పాతదే. మానవ వనరులను, సంప్రదింపుల పద్ధతిని ఈ సంస్థ అవలంబించలేదు. ఇంత పెద్ద మహానగరానికి 20 ఏండ్ల అభివృద్ధి ప్రణాళిక సంపూర్ణంగా, ఆధునికంగా, పర్యావరణ-హితంగా, స్థానిక ప్రజల అవసరాల మేరకు రూపొందించడం చాలా అవసరం. ఉమ్మడి ఏపీ ప్రభుత్వం అలాంటి నైపుణ్యం, సంప్రదింపుల ప్రణాళిక చేయలేదు. తెలంగాణ  ప్రభుత్వమూ అదే పద్ధతిని కొనసాగిస్తున్నది. 

ఇంత ముఖ్యమైన సంస్థ పాలక మండలి అసలు సమావేశం అవుతున్నదా? 7వ పాలక మండలి సమావేశం 2017లో జరిగినట్టు తెలిసింది. పాతవి, కొత్తవి కలుపుకుని, ఈ పాలక మండలి సమావేశ వివరాలు ఎక్కడా కానరావు. 2016 లో పాలక మండలి సమావేశ వివరాలు అడిగితే ఇవ్వలేదు. ఈ సంస్థకు 2019 నుంచి కమిషనర్ నియామకం కూడా కాలేదు. మున్సిపల్​శాఖ ముఖ్య కార్యదర్శితో నెట్టుకొస్తున్నారు. మరి, ఇంత ముఖ్యమైన సంస్థకు పూర్తి స్థాయి అధిపతి అవసరం లేదా?

బృహత్తర తప్పిదం

చాల ఘోరమైన తప్పులతో కూడిన హైదరాబాద్ మహానగర బృహత్తర ప్రణాళిక10 ఏండ్ల నుంచి అమలులో ఉందంటే ఈ సంస్థ పని తీరు ఎట్లా ఉందో అర్థం చేసుకోవచ్చు. ఈ బృహత్తర ప్రణాళికలో భూముల సర్వే నంబర్లు, సరిహద్దుల్లో స్పష్టత లేదు. గ్రామ నక్షలను పట్టించుకోలేదు. నివాసిత ప్రాంతాలను నిషేధిత ప్రాంతాలుగా పేర్కొనడంతో వేలాది మంది ఇబ్బంది పడుతున్నారు. ఇండ్లు ఉన్న చోట్ల పరిశ్రమ ప్రాంతంగా చూపెట్టారు. రాజకీయ, పాలనాపర అవినీతికి, అక్రమ నిర్మాణాలకు ఇది ఆదాయం అయింది. హెచ్‌‌ఎండీఏ మాస్టర్‌‌ ప్లాన్‌‌లో 820 కాలనీలు, గ్రామాల పరిధిలో 616 కిలోమీటర్ల పొడవున 208 రహదారులను ప్రతిపాదించారు. ఈ అశాస్త్రీయ ప్రతిపాదనలు ఏనాడో నిర్మితమైన ఇండ్ల మీదుగా వెళ్తున్నాయి. బృహత్తర ప్రణాళికలో దాదాపు 250 చెరువుల ఉనికినే ప్రస్తావించలేదు.

వందలాది పెద్ద చెరువుల్ని, జల వనరులను మాస్టర్‌‌ ప్లాన్‌‌లో చూపించలేదు. దీని ఆధారంగానే నిర్మాణాలకు అనుమతులు ఇచ్చారు. చెరువుల ఆక్రమణకు మార్గం సుగమం అయింది. శిఖం భూముల ద్వారా ఆక్రమణకు ఇది ఒక పైమెట్టు పద్ధతి. దీంతో చెరువు భూముల్లోనూ అడ్డదిడ్డంగా భవనాలు వెలిశాయి. చెరువులకు నీళ్లు అందించే వాగులు యథేచ్ఛగా ఆక్రమణలకు గురయ్యాయి. బుల్కాపూర్ నాల, ఫిరంగి నాలాలు కనుమరుగు అవుతున్నాయి. వరదల ముప్పు పెరగడానికి ఇలాంటి ఆక్రమణలు కూడా కారణం. హిమాయత్ సాగర్, ఉస్మాన్ సాగర్ వంటి జలాశయాల రక్షణకు ఏర్పాటు చేసిన జీవో111 ఎత్తివేస్తూ ప్రభుత్వం ప్రకటిస్తే, బృహత్తర ప్రణాళిక అమలు చేయాల్సిన హెచ్ఎండీఏ నుంచి స్పందన లేదు. ఈ ప్రణాళికలో అవి రక్షించాల్సిన జోనులో ఉన్నాయి. ఇట్లా ప్రభుత్వమే పూనుకుని బృహత్తర ప్రణాళికకు తూట్లు పొడుస్తుంటే, అక్రమార్కులు ఇంకా రెచ్చిపోతున్నారు.

ఆదాయం సమకూర్చే ఏజెన్సీగా..

తెలంగాణ ప్రభుత్వం హెచ్ఎండీఏను భూములు అమ్మడం ద్వారా ట్రెజరీకి ఆదాయం సమకూర్చే ఏజెన్సీగా మార్చింది. హెచ్ఎండీఏకు 2017 నాటికి ప్రభుత్వం బదలాయించిన భూమి 8,260.36 ఎకరాలు. ఇదిగాక ప్రతి లేఔట్ లో హెచ్ఎండీఏకు ‘తనఖా’ పెట్టాల్సిన భూమి కూడా ఉంటుంది. 2018లో ఇట్లాంటి 229 లేఔట్లలోని1.6 లక్షల గజాల భూమి అమ్మకానికి పెట్టింది. దాని ద్వారా దాదాపు రూ.300 కోట్లు ఆర్జించింది. కోకాపేట్ లో దాదాపు 50 ఎకరాలు అమ్మితే రూ.2 వేల కోట్లు వచ్చాయి. తొర్రూర్ లో 223 ప్లాట్లు అమ్మితే రూ.152 కోట్లు, బహదూర్ పల్లిలో 101 ప్లాట్లు అమ్మితే రూ.146.55 కోట్లు వచ్చాయి. ఖానామేట్ లో రూ.729.41 కోట్లు, ఉప్పల్ భగాయత్ లో 44 ప్లాట్లు అమ్మితే రూ.474.61 కోట్లు వచ్చాయి.  తెలంగాణ ప్రభుత్వ తాజా నివేదిక ప్రకారం హెచ్ఎండీఏ 2014- – 23 మధ్య రూ.4,388.28 కోట్లు ఖర్చు చేసింది.

2004-–14 మధ్య కేవలం రూ.2,607.36 కోట్లు మాత్రమే ఖర్చు చేసింది. మరి, ప్రతిష్టాత్మక ఓఆర్ఆర్​మీద ఖర్చు చేసిన రూ.6,700 కోట్లు ఎందుకో ఈ నివేదిక ప్రస్తావించలేదు. ఓఆర్​ఆర్ ​నిర్మాణానికి అయిన ఖర్చు, చేసిన అప్పులు, కట్టిన వడ్డీలు, టోల్ వసూళ్ల మీద సమాచారం లేదు. ఆడిట్ జరగలేదు. మొత్తం ఖర్చు రూ.11 వేల కోట్లు దాటింది అని ఒక అంచనా. ఈ ఆస్తిని నగరీకరణలో భాగంగా ఒక ప్రైవేటు సంస్థకు కేవలం రూ.7,380 కోట్లకు 30 ఏండ్లకు హెచ్ఎండీఏ లీజుకు ఇచ్చింది. ‘ఈ లీజు తక్కువ చేసి ఇచ్చారు, ఇందులో అవినీతి ఉందని’ ప్రతిపక్షాల నుంచి ఆరోపణలు వచ్చాయి. ఇదిలా ఉంటే.. స్థిరాస్తుల విలువ వార్షిక నివేదికలో ప్రకటించలేదు. ‘హైదరాబాద్​ గ్రోత్​ కారిడార్ ​లిమిటెడ్’​ అనే ప్రత్యేక కంపెనీ ఏర్పాటు చేసి, ఓఆర్ఆర్ తో పాటు దానికి రెండు పక్కల ఉన్న భూములను దఖలు పరిచి, హెచ్​ఎండీఏ ఆ లెక్కలను దాచి పెడుతున్నది.

వ్యాపార సంస్థనా?

2016-–17 బాలెన్స్ షీట్ ప్రకారం హెచ్ఎండీఏ చూపెడుతున్న వార్షిక టర్నోవర్ రూ.33.76 కోట్లు మాత్రమే. ఇందులో, రూ.10 కోట్లు అప్పు ఉన్నది. వడ్డీలకు అయిన ఖర్చు రూ.57.46 లక్షలు. అదే, ఆదాయానికి వస్తే కేవలం రూ.1.77 కోట్లు మాత్రమే చూపెడుతున్నారు. ఇందులో గమ్మత్తుగా డెవలప్​మెంట్​చార్జెస్ నుంచి వచ్చే ఆదాయం లేదు. 2019లో 22 గ్రామ పంచాయతీలకు ఇవ్వాల్సిన డెవలప్​మెంట్ డిఫర్మెంట్ చార్జీల మొత్తం రూ.6.71 కోట్లు. ప్రతి సంవత్సరం హెచ్ఎండీఏ పరిధిలో ఉన్న ప్రతి గ్రామ పంచాయతీకి ఇచ్చిన లేదా ఇవ్వాల్సిన పైకం ప్రస్తావన ఎక్కడా లేదు. ఇంపాక్ట్ ఫీజు, ఎల్​ఆర్​ఎస్​ విధానం ద్వారా వచ్చిన నిధులు, బిల్డింగ్ పర్మిషన్ల ద్వారా వచ్చిన ఆదాయం ప్రస్తావన కూడా లేదు. ఒక అంచనా ప్రకారం ఎల్ఆర్ఎస్​ద్వారా రూ.1000 కోట్ల ఆదాయం వచ్చింది. వివిధ ప్రాజెక్టుల కోసం చేసిన భూసేకరణకు హెచ్ఎండీఏ చెల్లించిన కోట్ల రూపాయల నిధుల వివరాలు కూడా లేవు. హెచ్ఎండీఏ అమ్ముకునే భూముల విలువ కూడా వార్షిక ఆర్థిక నివేదికలో ఎప్పుడూ పెట్టలేదు. అసలు హెచ్ఎండీఏ ఎన్నడూ ఒక సమగ్ర వార్షిక నివేదిక తయారు చేసి ప్రజల ముందు పెట్టలేదు. స్థూలంగా, హెచ్ఎండీఏ నిధులు, ఆదాయం, ఖర్చు, ఆధీనంలో ఉన్న స్థిరాస్తుల మీద సమాచారం లేదు. శాసనసభ ఎన్నడూ దాని మీద దృష్టి పెట్టలేదు.

కాగ్ ఆడిట్ కూడా జరగలేదు. హెచ్ఎండీఏ దగ్గర ఉన్న భూమి కరెంట్ ట్రాన్స్ ఫార్మర్, కూరగాయల బజార్, లేదా బస్సులు, ఆటో నిలిపే స్థలం, ప్రార్థన మందిరాలకు, మురికి నీటి శుద్ధి కేంద్రాలకు, మంచి నీరు, మురుగు నీటి పైపులైన్లకు, చెత్త వేసే కేంద్రాలకు, వగైరా అవసరాలకు నిర్దేశించింది. అలాంటి భూమిని అమ్ముకున్నది. భూ వినియోగ ప్రణాళిక తయారు చేసే సంస్థ భూమిని అమ్ముకునే సంస్థగా దాపురించింది. ప్రభుత్వ భూమి ధనికులకు అత్యధిక రేటుకు అమ్ముకోవడానికి హెచ్ఎండీఏ వ్యాపార సంస్థ కాదు. తన ప్రాథమిక లక్ష్యాన్ని మరిచి, భూములను అమ్ముకుంటున్న హెచ్ఎండీఏను ఇటు శాసన సభలో కానీ అక్కడ పార్లమెంటులో కానీ జవాబుదారి చేయలేదు. జవాబుదారిలేని హెచ్ఎండీఏ సంస్థ తెలంగాణ మూలవాసుల ప్రయోజనాలకు వ్యతిరేకంగా ఉండే శక్తులకు సాధనంగా మారింది. రాష్ట్ర ప్రభుత్వ పెద్దలు దాన్ని అట్లా వాడుకుంటున్నారు.

పంచాయతీల ఆదాయానికి గండి

హైదరాబాద్ నగరానికి సమ్మిళిత అభివృద్ధి ప్రణాళిక తయారు చేసి, అమలుకు శాఖల మధ్య సమన్వయం, పర్యవేక్షణ, ప్రోత్సాహం కోసం హెచ్ఎండీఏను ఏర్పాటు చేశారు. 2008లో వచ్చిన సంస్థ, ప్రణాళిక తయారు చేసింది 2012లో. దాన్ని 2013లో చట్టబద్ధం చేశారు. హైదరాబాద్ మెట్రోపాలిటన్ రీజియన్(7,257 చ.కిలోమీటర్లు)కోసం చేసిన ఈ హెచ్ఎండీఏ ‘మాస్టర్ ప్లాన్ 2031’ను తయారు చేసింది ప్రైవేటు సంస్థలు. తప్పులతో, లోపాలతో  కూడిన ఈ ప్రణాళిక ఇప్పటికీ అమలులో ఉంది. తెలంగాణ ప్రభుత్వం తప్పులను సరి చేసి కొత్త ప్రణాళిక తెస్తామని ప్రకటించి7 ఏండ్లు దాటింది. ఇంకా కొత్తది తయారు కాలేదు.

5 మాస్టర్ ప్రణాళికలు జోడించి కొత్త సంపూర్ణ ప్రణాళిక తెస్తామని ఇచ్చిన హామీ కాలం ఎప్పుడో దాటిపోయింది. హెచ్ఎండీఏ వివిధ శాఖల మధ్య సమన్వయం కూడా చేయడం లేదు. ఇది ఒక ప్రణాళిక సంస్థ. కానీ, భవన నిర్మాణాలకు, లేఔట్లకు అనుమతుల నుంచి ఆదాయం పొందే విధంగా మార్చారు. మాస్టర్ ప్రణాళిక విస్తీర్ణం ఏకంగా 5,965 చదరపు కిలోమీటర్లకు పెంచి (15 లక్షల ఎకరాలు), ఇష్టానుసారం జోన్లు ప్రకటించి, తర్వాత జోనల్ మార్పు దరఖాస్తుల ద్వారా ఆదాయం పొందుతున్నది ఈ సంస్థ. బిల్డింగ్, లేఔట్ అనుమతుల ఆదాయం అసలు తనలో విలీనం చేసుకున్న1,052 పంచాయతీలది. కానీ ​అది హెచ్ఎండీఏకు వస్తున్నది. స్థానిక అనుమతులు హెచ్ఎండీఏకు మారడంతో అవినీతికి ఆస్కారం ఏర్పడింది. 

పారదర్శక ప్రగతి లేదు

పారదర్శకతకు పాతర వేసి, హైదరాబాద్ అభివృద్ధిని కొందరి కోసం అన్నట్లుగా హెచ్ఎండీఏ మార్చింది. 2013 నుంచి ఒక జోన్ నుంచి ఇంకొక జోనుకు ఎన్ని వందల ఎకరాలు మారినాయో? కన్సర్వేషన్ జోను నుంచి కేకు కట్ చేసినట్టుగా పద్ధతి, విధి విధా నం లేకుండా వేల ఎకరాలు జోన్లు మారాయి. జోన్ల మార్పిడి సంస్థగా మారింది. జోన్ల నగదీకరణ భావి అవసరాలను దెబ్బతీస్తుంది. అప్పట్లో కన్సర్వేషన్ జోను దాదాపు 6 లక్షల ఎకరాలు ఉంటే(43.48 శాతం), పదేళ్లలో బాగా తగ్గిపోయింది.

వ్యవసాయ భూమి గణనీయంగా తగ్గింది. గుట్టలు, వాగులు, చెరువులు, కుంటలు మాయమయిపోతు న్నాయి. మూసీ నది పరివా హక ప్రాంతం హెచ్ఎండీఏ అమలు చేస్తున్న ప్రణాళిక వల్ల, పని విధానం వల్ల అస్తవ్యస్తంగా మారుతు న్నది. హైదరాబాద్ చుట్టూ ఉన్న ప్రకృతి వనరులను పణంగా పెట్టి అస్తవ్యస్త విశ్వనగర వ్యాప్తికి దోహదం చేస్తున్నది. సంస్థాగత నియంత్రణ వ్యవస్థను నిర్వీర్యం చేస్తున్నది. హెచ్ఎండీఏ పని తీరు అక్రమా ర్కులకు దళారీ వ్యవస్థకు ఆలంబనగా మారిం ది. భూముల ధరలు విపరీతంగా పెరిగి, పేదలు ఇల్లు కట్టు కునే పరిస్థితి దూరమైంది. అవినీతికి ఊతం ఇచ్చింది. వెరసి రాజకీయ నాయకులకు, వ్యాపారులకు సొంత సంపద సృష్టికి ఉపయోగపడింది. ఉపయోగపడుతున్నది.

- డా. దొంతి నర్సింహా రెడ్డి, పాలసీ ఎనలిస్ట్