
- 10 నెలల తర్వాత బెయిల్ మంజూరు చేసిన సుప్రీంకోర్టు
- చంచల్‌గూడ జైలులోనే ప్రణీత్‌రావు, రాధాకిషన్ రావు
హైదరాబాద్, వెలుగు: ఫోన్ ట్యాపింగ్ కేసు నిందితుడు మాజీ అడిషనల్ ఎస్పీ మేకల తిరుపతన్న జైలు నుంచి విడుదల అయ్యాడు. చంచల్‌గూడ జైలు నుంచి మంగళవారం సాయంత్రం 6.30 గంటల సమయంలో ఆయన బయటకు వచ్చాడు.
ఈ కేసులో 4వ నిందితుడిగా ఉన్న తిరుపతన్నను గతేడాది మార్చి 23న సిట్ అరెస్ట్ చేసింది. దీంతో గత 10 నెలలుగా ఆయన చంచల్‌గూడ జైలు జ్యుడీషియల్ రిమాండ్‌లో ఉన్నాడు. ఈ కేసులో రెగ్యులర్ బెయిల్ లభించి విడుదల కావడం ఇదే తొలిసారి.
షరతులతో కూడిన బెయిల్ మంజూరు చేస్తూ సుప్రీంకోర్టు సోమవారం ఆర్డర్ ఇచ్చిన సంగతి తెలిసిందే. సుప్రీం ఆదేశాల మేరకు ఆయన లాయర్లు మంగళవారం నాంపల్లి కోర్టులో ష్యూరిటీస్ దాఖలు చేశారు. అనంతరం బెయిల్ ఆర్డర్‌ను చంచల్‌గూడ జైలు అధికారులకు అందించారు.
దీంతో పది నెలల జైలు జీవితం నుంచి తిరుపతన్నకు విముక్తి లభించింది. ఈ కేసులో మూడో నిందితుడు భుజంగరావు అనారోగ్య కారణాలతో మధ్యంతర బెయిల్‌పై బయటే ఉన్నాడు. రెండో నిందితుడు మాజీ డీఎస్పీ ప్రణీత్‌రావు, సిటీ టాస్క్‌ఫోర్స్ మాజీ డీసీపీ రాధాకిషన్ రావుకు బెయిల్ లభించలేదు. ప్రధాన నిందితుడు ఎస్‌ఐబీ మాజీ చీఫ్ ప్రభాకర్‌రావు, ఐ న్యూస్ మాజీ ఎండీ శ్రవణ్‌రావు అమెరికాలో అక్రమంగా నివాసం ఉంటున్నారు.
పొంగులేటి అనుచరుల ఫోన్లు కూడా ట్యాపింగ్..
ఈ కేసులో రెండో చార్జ్‌షీట్ దాఖలు చేసేందుకు సిట్ దర్యాప్తు ముమ్మరం చేసింది. ఇందుకు సాంకేతిక ఆధారాలు సేకరిస్తోంది. ఇందులో భాగంగా మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి అనుచరులు, మండల స్థాయి కాంగ్రెస్ లీడర్ల ఫోన్లను కూడా ట్యాప్ చేసినట్టు స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీమ్ దర్యాప్తులో బయటపడింది.
2023 నవంబర్ 15 నుంచి 30వ తేదీ మధ్య 450కి పైగా ఫోన్లను ట్యాప్ చేసినట్టు సిట్ సాంకేతిక ఆధారాలు సేకరించింది. ఇందులో త్రిపుర గవర్నర్ నల్లు ఇంద్రసేనారెడ్డి వినియోగించిన రెండు ఫోన్ నంబర్స్‌తో పాటు పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి ప్రధాన అనుచరుల ఫోన్ నంబర్స్ కూడా ఉన్నట్టు గుర్తించారు.
వివిధ టెలికం కంపెనీల నుంచి సేకరించిన సమాచారం ఆధారంగా ఆయా నంబర్స్‌కు చెందిన వారికి కాల్స్ చేసి పిలిపిస్తున్నారు. ఖమ్మం, మహబూబాబాద్, వరంగల్‌కు చెందిన పొలిటికల్ లీడర్లు, వ్యాపారవేత్తలు సహా ఇప్పటికే 50 మంది స్టేట్‌మెంట్స్‌ను రికార్డ్ చేశారు.
తమ ఫోన్లను ట్యాప్ చేయడం ద్వారానే అసెంబ్లీ ఎన్నికల సమయంలో తమ కదలికలను గుర్తించినట్టు బాధితులు స్టేట్‌మెంట్స్ ఇచ్చినట్టు సమాచారం.
ఈ కేసులో ప్రధాన నిందితుడిగా ఉన్న ప్రభాకర్‌రావు, ఆరో నిందితుడు శ్రవణ్‌రావును ఇండియాకు రప్పించేందుకు పోలీసులు ఏర్పాట్లు ముమ్మరం చేశారు. విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖతో పాటు హైదరాబాద్‌లోని అమెరికన్ ఎంబసీ ద్వారా అమెరికా ప్రభుత్వాన్ని సంప్రదిస్తున్నారు.