ఏపీ సీఐడీ మాజీ చీఫ్ సునీల్ కుమార్ సస్పెండ్

ఏపీ సీఐడీ మాజీ చీఫ్ సునీల్ కుమార్ సస్పెండ్

ఏపీ సీఐడీ మాజీ చీఫ్, సీనియర్ ఐఏఎస్ ఆఫీసర్ పీవీ సునీల్ కుమార్ సస్పెండ్ అయ్యారు. సునీల్ కుమార్‎పై సస్పెన్షన్ వేటు వేస్తూ ఈ మేరకు ప్రభుత్వం ఆదివారం (మార్చి 2) ఉత్తర్వులు జారీ చేసింది. అనుమతి లేకుండా విదేశాలకు వెళ్లి.. అఖిల భారత సర్వీస్ ఉద్యోగుల కోడ్ ఆఫ్ కండక్ట్‎కు వ్యతిరేకంగా వ్యవహరించారన్న ఆరోపణల మేరకు ప్రభుత్వం చర్యలు తీసుకుంది. కాగా, గత వైసీపీ ప్రభుత్వ హయాంలో సీఐడీ చీఫ్‎గా పీవీ సునీల్ కుమార్ కీలకంగా వ్యవహరించారు.

కాగా, అసెంబ్లీ డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణరాజు కేసులో ప్రభుత్వ నిర్ణయాన్ని విమర్శిస్తూ పీవీ సునీల్ కుమార్ సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టిన విషయం తెలిసిందే. ఈ వ్యవహారం అధికార వర్గాల్లో తీవ్ర దుమారం రేపడంతో ప్రభుత్వం సునీల్ కుమార్‎ను విచారించాలని నిర్ణయించింది. విచారణాధికారిగా సీనియర్ ఐఏఎస్ అధికారి సిసోదియాను నియమించింది ఏపీ ప్రభుత్వం. ఐపీఎస్ ఆఫీసర్ హరీశ్​గుప్తా ఈ కేసును విచారణాధికారి ముందు ప్రజంట్ చేయాలని ఈ మేరకు ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. 

ALSO READ | సజ్జలను ఇరికించిన పోసాని.. హైకోర్టును ఆశ్రయించిన వైసీపీ కీలక నేత..!

వైపీసీ ప్రభుత్వ హయంలో రాజద్రోహం కేసులో అరెస్టైన తనను సీఐడీ కస్టడీలో హతమార్చేందుకు యత్నించారంటూ ఏపీలో కూటమి ప్రభుత్వం  అధికారంలోకి వచ్చాక డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణరాజు గుంటూరు నగరపాలెం పోలీసులకు కంప్లైంట్ చేశారు. ఆర్ఆర్ఆర్ ఫిర్యాదు మేరకు అప్పటి సీఐడీ చీఫ్ పీవీ సునీల్ కుమార్‎పై హత్యాయత్నం, నేరపూరిత కుట్ర, బెదిరింపు తదితర సెక్షన్ల కింద పోలీసులు కేసు నమోదు చేశారు. 

ఈ కేసు నమోదును తప్పుబడుతూ 2024 జులై 12న సునీల్‌కుమార్‌ తన అధికారిక ఎక్స్‌ (ట్విట్టర్) ఖాతాలో అసంతృప్తి వ్యక్తం చేశారు. దీంతో సునీల్ తీరు అఖిల భారత సర్వీసు ప్రవర్తనా నియమావళిలోని 7వ నియమ ఉల్లంఘన కిందకు వస్తుందని ప్రభుత్వం తేల్చి.. అతడిపై విచారణకు ఆదేశాలు ఇచ్చింది. విచారణలో సునీల్ కుమార్ అఖిల భారతీయ సర్వీస్ ఉద్యోగుల కోడ్ ఆఫ్ కండక్ట్‎కు వ్యతిరేకంగా విదేశాలకు వెళ్లాడని తేలడంతో ప్రభుత్వం సస్పెన్షన్ వేటు వేసింది.