బీఆర్ఎస్ సీనియర్ నేత, ఆర్మూర్ మాజీ ఎమ్మెల్యే జీవన్ రెడ్డికి మరో షాక్ తగిలింది. తమ వద్ద తీసుకున్న రూ. 20 కోట్ల రుణంతో పాటు వడ్డీ కలిపి మొత్తం రూ. 45 కోట్లు చెల్లించాలంటూ స్టేట్ ఫైనాన్స్ కార్పొరేషన్ బ్యాంక్ అధికారులు జీవన్ రెడ్డికి నోటీసులు జారీ చేశారు. ఆర్మూర్ లోని జీవన్ రెడ్డి ఇంటికి అధికారులు నోటీసులు అంటించడం చర్చనీయాంశంగా మారింది.
మాల్ నిర్మాణం కోసం 2017లో జీవన్ రెడ్డి (అప్పుడు ఎమ్మెల్యేగా ఉన్నారు) ఆయన భార్య పేరిట లోన్ తీసుకున్నాడు. ఆ సమయంలో జీవన్ రెడ్డితో పాటు మరో నలుగురు వ్యక్తులు షూరిటీలు పెట్టారు. తీసుకున్న రుణం డబ్బులు, వడ్డీ చెల్లించకపోవడంతో తాజాగా జీవన్ రెడ్డికి స్టేట్ ఫైనాన్స్ కార్పొరేషన్ బ్యాంక్ అధికారులు నోటీసులు జారీ చేశారు. ఇప్పటికే చాలాసార్లు నోటీసులు పంపించినా జీవన్ రెడ్డి స్పందించలేదని తెలుస్తోంది. నోటీసుల అంశం స్థానికంగా చర్చనీయాంశంగా మారింది.