ఆ ముగ్గురిని ఎదుర్కోవడం కష్టం.. టీమిండియాదే ఛాంపియన్స్ ట్రోఫీ: ఆసీస్ మాజీ కెప్టెన్

ఆ ముగ్గురిని ఎదుర్కోవడం కష్టం.. టీమిండియాదే ఛాంపియన్స్ ట్రోఫీ: ఆసీస్ మాజీ కెప్టెన్

ఈ ఏడాది జరగనున్న ఛాంపియన్స్ ట్రోఫీ(2025)ని టీమిండియా ఎగరేసుకు పోతుందని ఆసీస్ మాజీ కెప్టెన్ మైఖేల్ క్లార్క్ జోస్యం చెప్పారు. బుమ్రా లోటు కనిపిస్తున్నప్పటికీ.. రోహిత్ శర్మ నేతృత్వంలో భారత జట్టు ఖచ్చితంగా విజేతగా నిలుస్తుందని క్లార్క్ తేల్చి చెప్పారు.

బుమ్రా లోటు పూడ్చలేం..

జస్ప్రీత్ బుమ్రాను మ్యాచ్ విన్నర్‌గా అభివర్ణించిన క్లార్క్.. అతని లోటును మరొక బౌలర్ పూడ్చగలడన్న మాటలను కొట్టి పారేశాడు. అతని స్థానాన్ని భర్తీ చేయడం మాటలు చెప్పినంత ఈజీ కాదని స్పష్టం చేశాడు. అర్ష్‌దీప్ సింగ్ ఫామ్‌లో ఉన్నా.. అతన్ని టీ20 ప్లేయర్‌గానే చూడొచ్చని అభిప్రాయపడ్డాడు. కానీ, భారత స్పిన్నర్లు జడేజా, అక్సర్, కుల్దీప్, వరుణ్ ఒంటి చేత్తో జట్టుకు విజయాలు అందించగరని ధీమా వ్యక్తం చేశాడు.

"భారత జట్టులో బుమ్రా లోటును మరొకరు పూడ్చలేరు.. అతన్ని మిస్ అవుతారనడంలో ఎటువంటి సందేహం లేదు. అతను మ్యాచ్ విన్నర్. కానీ ఆ జట్టును చూస్తే, ఇప్పుడూ బలంగానే ఉంది. బుమ్రా లేకున్నా.. టీమిండియానే ఫేవరెట్. శుభ్‌మాన్ గిల్ మంచి ఫామ్‌లో ఉన్నాడు. ఇది వారికి కలిసొచ్చే అంశం. రెండ్రోజుల క్రితం రోహిత్ శర్మ సెంచరీ చేశాడు, కాబట్టి అతడు తిరిగి ఫామ్‌ అందుకున్నట్టే. తుది జట్టులో జడేజా, అక్షర్ కంఫర్మ్. కుల్దీప్, వరుణ్‌లలో మరొకరు జట్టులో ఉంటారు. అంటే ముప్పై ఓవర్లు.. ఈ ముగ్గురివే. స్పిన్ పిచ్‌లపై వీరిని ఎదుర్కోవడం అంత తేలికైన పని కాదు.. భారత జట్టు ఫేవరెట్‌ అని ఇప్పటికీ చెప్పగలను.." అని క్లార్క్ బియాండ్23 క్రికెట్ పాడ్‌కాస్ట్‌లో అన్నారు.

ALSO READ | IPL 2025: అంబానీ ఫ్యామిలీనా మజాకా..! ముంబై జట్టులోకి ముజీబ్

ఛాంపియన్స్ ట్రోఫీ ఫిబ్రవరి 19 నుండి మార్చి 9 వరకు జరగనుంది. ఆతిథ్యదేశం పాకిస్తాన్ అయినప్పటికీ, భారత జట్టు మ్యాచ్‌లు దుబాయ్‌లో జరగనున్నాయి. మిగిలిన మ్యాచ్‌లు పాకిస్తాన్‍లోనే. లాహోర్, కరాచీ, రావల్పిండి క్రికెట్ స్టేడియాలు మ్యాచ్‌లకు ఆతిథ్యమివ్వనున్నాయి.

ఈ టోర్నీలో భారత జట్టు.. ఫిబ్రవరి 20(గురువారం) బంగ్లాదేశ్‌తో తొలి మ్యాచ్ ఆడనుండగా.. ఫిబ్రవరి 23(ఆదివారం) పాకిస్థాన్‌తో తలపడనుంది.

ఛాంపియన్స్ ట్రోఫీలో తలపడే భారత జట్టు:

రోహిత్ శర్మ (కెప్టెన్), శుభ్‌మన్ గిల్ (వైస్ కెప్టెన్), విరాట్ కోహ్లీ, శ్రేయాస్ అయ్యర్, కేఎల్ రాహుల్ (వికెట్ కీపర్), రిషబ్ పంత్ (వికెట్ కీపర్), హార్దిక్ పాండ్యా, అక్షర్ పటేల్, రవీంద్ర జడేజా, వరుణ్ చక్రవర్తి, వాషింగ్టన్ సుందర్, కుల్దీప్ యాదవ్, హర్షిత్ రాణా, మహమ్మద్ షమీ, అర్ష్‌దీప్ సింగ్.