ఓ మనిషిని మృత్యువు ధరిచేరనుందని తెలిస్తే.. అతడు ఎంతటి మానసిక సంఘర్షణకు లోనవుతాడో ప్రత్యేకించి చెప్పక్కర్లేదు. ఇక తాను ఎక్కువకాలం బ్రతకనని పదే పదే అతని మనసులో మెదిలో జ్ఞాపకాలు మరణానికి మరింత దగ్గర చేస్తుంటాయి. వీటికి తోడు చుట్టుపక్కల వారు అతనిపై చూపించే సానుభూతిని భరించలేం. అందుకే ఓ దిగ్గజ క్రికెటర్ తనకొచ్చిన అరుదైన వ్యాధిని బహిరంగా పరచకుండా ఇన్నాళ్లు దాచిపెట్టాడు. ఎవరా క్రికెటర్? ఏంటా వ్యాధి? అన్నది తెలుసుకుందాం..
అతనో దిగ్గజ క్రికెటర్. క్రికెట్ చరిత్రలో ఎన్నో మరుపురాని రికార్డులను తన పేరిట సువర్ణాక్షరాలతో లిఖించుకున్నాడు. అతని పేరు మీద ఓ ప్రతిష్టాత్మక టెస్ట్ సిరీస్ జరుగుతుంది అంటే ఊహించుకోండి.. అతను ఎంత గొప్ప క్రికెటరో. అతనెరెవరో కాదు ఆస్ట్రేలియా క్రికెట్ చరిత్ర గతిని మార్చిన 'అలెన్ బోర్డర్'. తనకు పార్కిన్సన్ వ్యాధి సోకిందని ఇక ఎక్కువ కాలం బ్రతకలేనని.. అలెన్ బోర్డర్ ఒక ప్రకటనలో వెల్లడించారు.
"నాకు అలసటగా ఉందని 2016లో ఓ న్యూరోసర్జన్‌ను కలిశా. అతడు నన్ను పరీక్షించాక ఎలాంటి దాపరికాలు లేకుండా పార్కిన్సన్ వ్యాధి ఉన్నట్లు చెప్పాడు. ఎప్పటిలానే నడుస్తూ ఉండమని సూచించాడు. నేను ఇన్నాళ్లు ఈ విషయాన్ని బయటకి చెప్పకపోవడానికి కారణం.. వ్యక్తిగత గోప్యత పాటించడమే. ఒక వేళ చెప్తే.. ఎదుటివారు నాపై చూపించే సానుభూతి భరించలేను. అయితే ఏదో ఒకరోజు ఈ విషయాన్ని అందరూ తెలుసుకుంటారని మాత్రం తెలుసు. నాకు భవిష్యత్తు గురించి భయం లేదు. 80 ఏళ్ల వరకూ జీవిస్తే చాలు. వందేళ్లు జీవిస్తానని మాత్రం అనుకోవడం లేదు..' అంటూ అలెన్ బోర్డర్ భావోద్వేగపూరిత ప్రకటన చేశాడు.
Former Australia captain Allan Border has revealed he has Parkinson's disease ?
— ESPNcricinfo (@ESPNcricinfo) June 30, 2023
? https://t.co/Cfkw2K1zFi pic.twitter.com/BAuShxJ3Z0
ప్రస్తుతం అలెన్ బోర్డర్ వయసు.. 67 ఏళ్లు. ఈ నెల 27న 68వ వసంతంలోకి అడుగుపెట్టబోతున్నాడు. ఇక అలెన్ బోర్డర్ క్రికెట్ కెరీర్ విషయానికొస్తే.. ఆస్ట్రేలియా తరపున 156 టెస్టులు, 273 వన్డేలు ఆడిన బోర్డర్.. వరుసగా 11,174, 6524 పరుగులు చేశాడు. అలెన్ నాయకత్వంలోనే ఆస్ట్రేలియా జట్టు.. తొలిసారి 1987లో వరల్డ్ కప్ ను సాధించింది. అలెన్ బోర్డర్-సునీల్ గవాస్కర్ పేరిట.. ఇండియా- ఆస్ట్రేలియా జట్ల మధ్య బోర్డర్-గవాస్కర్ ట్రోఫీ జరుగుతుంది.