Sheikh Hasina: బంగ్లాదేశ్ మాజీ ప్రధాని హెలికాఫ్టర్ ఎక్కడ ల్యాండ్ అయిందంటే..

Sheikh Hasina: బంగ్లాదేశ్ మాజీ ప్రధాని హెలికాఫ్టర్ ఎక్కడ ల్యాండ్ అయిందంటే..

న్యూఢిల్లీ: ప్రధాని పదవికి రాజీనామా చేసి ఆర్మీ హెలికాఫ్టర్లో దేశం దాటిన బంగ్లాదేశ్ మాజీ ప్రధాని షేక్ హసీనా భారత్కు చేరుకున్నారు. ఉత్తరప్రదేశ్లోని ఘజియాబాద్లో ఉన్న హిండన్ ఎయిర్ బేస్కు ఆమె ప్రయాణించిన C-130 ఎయిర్క్రాఫ్ట్ చేరుకుంది. భారత వైమానిక దళానికి చెందిన C-17, C-130 ఎయిర్ క్రాఫ్ట్స్ను నిలిపి ఉంచిన సమీపంలో షేక్ హసీనా ప్రయాణం చేసిన C-130 ఎయిర్క్రాఫ్ట్ను పార్కింగ్ చేశారు. హిండన్ ఎయిర్ బేస్ ఢిల్లీ నగరానికి సమీపంలో ఉంటుంది. ఆ ఎయిర్క్రాఫ్ట్ కదలికలను ఇండియన్ ఎయిర్ ఫోర్స్, భారత నిఘా సంస్థలు ఎప్పటికప్పుడు పర్యవేక్షించింది. 

 

ఆ ఎయిర్ క్రాఫ్ట్ ఇండియన్ ఎయిర్ స్పేస్లోకి ప్రవేశించినప్పటి నుంచి ఘజియాబాద్లోని హిండన్ ఎయిర్బేస్లోకి ఎంటర్ అయ్యేంత వరకూ ఇండియన్ ఎయిర్ ఫోర్స్, భారత నిఘా సంస్థలు మానిటర్ చేసినట్లు సమాచారం. ప్రభుత్వ ఉద్యోగాల రిజర్వేషన్లలో స్వాతంత్ర్య సమరయోధుల వారసుల కోటాను రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ బంగ్లాదేశ్లో విద్యార్థులు చేస్తున్న నిరసనలు హింసాత్మకంగా మారాయి.  ప్రభుత్వ మద్దతుదారులకు, నిరసనకారులకు మధ్య ఘర్షణలు జరిగాయి. పరిస్థితి హింసాత్మకంగా మారి గత నెలలో నిరసనలు మొదలైనప్పటి నుంచి ఇప్పటివరకూ 300 మంది ప్రాణాలు కోల్పోయారు.

ALSO READ | Bangladesh PM Hasina: బంగ్లాదేశ్ ప్రధాని దేశం దాటిన దృశ్యాలివే.. వీడియో వైరల్

ఆగస్ట్ 4, 2024 ఆదివారం రోజు నిరసనకారులు ఢాకా వీధుల్లోకి వేల సంఖ్యలో చేరుకున్నారు. నిరసనకారులు దుకాణాలకు నిప్పు పెట్టారు. బస్సులను తగలబెట్టారు. ప్రభుత్వ ఆస్తులను ధ్వంసం చేశారు. ‘అంతిమ పోరాటం’ పేరుతో విద్యార్థులకు నిరసనకారులు పిలుపునివ్వడంతో పరిస్థితి పూర్తిగా అదుపు తప్పింది. సోమవారం నాడు వేల సంఖ్యలో విద్యార్థులు ఢాకా వీధుల్లోకి చేరుకుని నిరసనలకు దిగారు. ప్రధాన మంత్రి షేక్ హసీనా అధికారిక నివాసంలోకి కూడా ప్రవేశించారు. పరిస్థితి పూర్తిగా చేయి దాటిపోవడంతో చేసేదేమీ లేక ఎలాంటి సందేశం ఇవ్వకుండానే ప్రధాని పదవికి రాజీనామా చేసి షేక్ హసీనా దేశం విడిచి వెళ్లిపోయారు. బంగ్లాదేశ్లో ప్రస్తుతం సైనిక పాలన నడుస్తోంది.