సర్కారు ఒత్తిడితో నివేదిక ఇస్తే.. అసలుకే మోసం

సర్కారు ఒత్తిడితో నివేదిక ఇస్తే..  అసలుకే మోసం
  • బీసీ కమిషన్ మాజీ చైర్మన్ కృష్ణ మోహన్ రావు 

హైదరాబాద్, వెలుగు: స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించేందుకు రెడీ అవుతున్న రాష్ట్ర ప్రభుత్వానికి.. ఒత్తిళ్లకు గురై డెడికేటెడ్ కమిషన్ సమగ్ర అధ్యయనం చేయకుండా ఆదరాబాదరాగా నివేదిక సమర్పిస్తే అసలుకే మోసం జరిగే ప్రమాదం ఉందని బీసీ కమిషన్ మాజీ చైర్మన్ వకుళాభరణం కృష్ణ మోహన్ రావు అభిప్రాయపడ్డారు. ఇటీవల సర్కారు ప్రకటించిన సర్వే డేటాలో బీసీలతో పాటు ఎస్సీ, ఎస్టీల జనాభా తగ్గిందన్న ఆరోపణలు వెల్లువెత్తుతున్న నేపథ్యంలో.. కమిషన్ సమగ్ర విశ్లేషణలతో నివేదిక రూపొందించాలని శుక్రవారం ఒక ప్రకటనలో డిమాండ్ ​చేశారు.

 డెడికేటెడ్ కమిషన్ సుప్రీంకోర్టు మార్గదర్శకాలను, ప్రామాణిక పద్ధతులను పాటించకపోతే, నివేదిక న్యాయస్థానాలలో వీగిపోయే ప్రమాదం లేకపోలేదని ఆందోళన వ్యక్తం చేశారు. కుల సర్వేలో తేల్చిన వివరాల ఆధారాలతో త్వరితగతిన డెడికేటెడ్ కమిషన్ స్థానిక సంస్థల రిజర్వేషన్లపై తన నివేదికను సమర్పించాలని ప్రభుత్వం ఒత్తిడి తెస్తున్నదన్న సమాచారం ఉందన్నారు.

 గతంలో మహారాష్ట్ర ప్రభుత్వం అందించిన వివరాలతో అక్కడ కమిషన్ నివేదిక సమర్పించినప్పుడు సుప్రీంకోర్టు కొట్టి వేసిందని గుర్తుచేశారు. మధ్యప్రదేశ్, ఒడిశా గుజరాత్, కర్నాటక రాష్ట్రాలలో కూడా న్యాయపరమైన సమస్యలు ఉత్పన్నమయ్యాయని ఆయన వివరించారు.