దుర్గం చిన్నయ్యకు భారీ షాక్ .. వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కు లేఖ

  • 20 మంది బీఆర్ ఎస్​ కౌన్సిలర్ల రాజీనామా

బెల్లంపల్లి, వెలుగు: బెల్లంపల్లి మాజీ ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్యకు భారీ షాక్​ తగిలింది.  మున్సిపల్​ చైర్​పర్సన్​, వైస్​ చైర్మన్లపై అవిశ్వాసం  ప్రకటించి క్యాంపునకు తరలివెళ్లిన బీఆర్ఎస్​ కౌన్సిలర్లు  20 మంది ఆ పార్టీకి గురువారం మూకుమ్మడిగా  రాజీనామా చేశారు. అవిశ్వాసం మీద శుక్రవారం ఓటింగ్​ జరగనుండగా బీఆర్‌‌‌‌ఎస్​ను కౌన్సిలర్లు ఊహించని దెబ్బ కొట్టారు.   ఈ మేరకు  తాము ఉన్న  క్యాంపు నుంచి ఒక వీడియో సందేశాన్ని,   రాజీనామా లేఖను   సోషల్ మీడియాలో  షేర్ చేశారు.

  మాజీ ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్య బీఆర్ఎస్ కు  వ్యతిరేకంగా వ్యవహరిస్తున్నారని, ఆయనే  మున్సిపల్ చైర్ పర్సన్ జక్కుల శ్వేత,  మరికొంత మంది కౌన్సిలర్లను కాంగ్రెస్​లోకి పంపారని    కౌన్సిలర్లు  షేక్  అఫ్సర్, దామెర శ్రీనివాస్ ఆరోపించారు.  చైర్ పర్సన్ శ్వేత,  వైస్ చైర్మన్ బత్తుల సుదర్శన్  పదవులను  కాపాడేందుకు దుర్గం చిన్నయ్య ప్రయత్నిస్తున్నారని అన్నారు.   అవిశ్వాసం నెగ్గాలని   20 మందితో తాము క్యాంపులో ఉంటే  దుర్గం చిన్నయ్య, ఎంపీ  బోర్లకుంట వెంకటేష్ నేత, చెన్నూర్ మాజీ ఎమ్మెల్యే బాల్క సుమన్,  ఎమ్మెల్సీ  దండె విఠల్ తమను అసలు  పట్టించుకోలేదని మండిపడ్డారు. ఈ విషయాన్ని బీఆర్ఎస్  వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కు లేఖ రాసినట్టు చెప్పారు.  

రాజీనామ చేసిన కౌన్సిలర్లు వీరే...

బీఆర్ఎస్ కు  రాజీనామా కౌన్సిలర్లలో నెల్లి శ్రీలత, తడక పద్మావతి, రాజనాల కమల, ఎలిగేటి సుజాత, చిట్యాల శ్రీలక్ష్మి, పోతురాజుల లీల, సుకేశిని భరద్వాజ్​,  సముద్రాల లావణ్య, జిలకర తార, గురండ్ల లక్ష్మి, కొక్కెర చంద్రశేఖర్, షేక్ అప్సర్, గోశిక రమేశ్​, దామెర శ్రీనివాస్, తుంగపల్లి సుజాత, గడ్డం అశోక్ గౌడ్, పోలుఉమాదేవి, షేక్ ఆస్మా, బొడ్డు నారాయణ, గెల్లి రాజలింగు యాదవ్  ఉన్నారు. 

నేడే మున్సిపల్​  మీటింగ్​

బెల్లంపల్లి మున్సిపాలిటీలో చైర్ పర్సన్, వైస్ చైర్మన్ పై ప్రతిపాదించి అవిశ్వాస తీర్మానంపై ఓటింగ్ కోసం శుక్రవారం ఉదయం 11 గంటలకు ప్రత్యేక సమావేశం జరుగనుంది. కలెక్టర్ సంతోష్ ఆధ్వర్యంలో మీటింగ్ నిర్వహిస్తారు.