అమ్మాయిలకు 24 ఏళ్లకే పెళ్లి చేయండి.. లేకపోతే లవ్ జిహాదీకి బలవుతారు: కేరళ నేత సంచలన కామెంట్స్

 అమ్మాయిలకు 24 ఏళ్లకే పెళ్లి చేయండి.. లేకపోతే లవ్ జిహాదీకి బలవుతారు: కేరళ నేత సంచలన కామెంట్స్

లవ్ జిహాదీలు పెరిగిపోతున్నాయా.. ఇప్పటికే ఆ రాష్ట్రంలోని ఓ జిల్లాలో 400 మంది అమ్మాయిలు లవ్ జిహాదీలకు బలయ్యారా.. లవ్ జిహాదీలకు అమ్మాయిలు బలికాకుండా ఉండటానికి ఏం చేయాలి.. ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి.. కేరళ బీజేపీ మాజీ ఎమ్మెల్యే చేసిన కామెంట్స్ సంచలనంగా ఉన్నాయి. ఈ పూర్తి వివరాల్లోకి వెళితే.. బీజేపీ నేత, మాజీ ఎమ్మెల్యే పీసీ జార్జ్ లవ్ జిహాద్‎పై  సంచలన వ్యాఖ్యలు చేశారు. పాలాలో మాదకద్రవ్యాలకు వ్యతిరేకంగా జరిగిన ఓ కార్యక్రమంలో పాల్గొన్న పీసీ జార్జ్ మాట్లాడుతూ.. కోట్టయంలోని మీనాచల్ తాలూకాలో దాదాపు 400 మంది అమ్మాయిలు లవ్ జిహాద్‌లో చిక్కుకున్నారు.  వారిలో 41 మంది మాత్రమే తిరిగి వచ్చారని సెన్సేషనల్ కామెంట్స్ చేశారు.

ముఖ్యంగా క్రిస్టియన్ అమ్మాయిలు ఎక్కువగా లవ్ జిహాదీకి బలి అవుతున్నారని ఆయన ఆరోపించారు. మీ అమ్మాయిలు లవ్ జిహాదీకి బలి కాకుండా ఉండాలంటే.. వారికి 24 ఏళ్ల లోపు పెళ్లి చేయాలని క్రిస్టియన్ పేరెంట్స్‎కు సూచించారు పీసీ జార్జ్. పెళ్లి తర్వాత కూడా అమ్మాయిలు చదువు కొనసాగించవచ్చని హితవు పలికారు.

‘‘క్రైస్తవులు తమ కుమార్తెలకు 25, 30 సంవత్సరాల వయసు వరకు ఎందుకు వివాహం చేయరు..? అప్పటి వరకు వారిని ఇంట్లో ఎందుకు ఉంచుతారు..? 25 సంవత్సరాల వయసున్న ఒక అమ్మాయి నిన్న తప్పిపోయింది. రాత్రి 9.30 గంటలకు ఇంట్లో నుంచి వెళ్లిపోయింది. యువతిని 25 సంవత్సరాల వరకు పెళ్లి చేయకుండా ఉంచినందుకు ఆమె తండ్రిని నిందించాలి. ఆమెను ఎందుకు వివాహం చేయలేదు..? ఇది చర్చించాల్సిన విషయం’’ అని జార్జ్ వివాదస్పద వ్యాఖ్యలు చేశారు.

Also Read :- కోర్టు తీర్పు తర్వాత అమృత చెల్లి ఆందోళన

ఇతరుల్లా ముస్లిం అమ్మాయిలు హద్దులు దాటకపోవడానికి కారణం ఏమిటంటే.. వారికి 18 ఏళ్లు నిండిన వెంటనే వివాహం చేస్తారని పేర్కొన్నారు. అలాగే.. క్రైస్తవులు తమ సొంత కుమార్తెలను వివాహం చేసుకోవాలని షాకింగ్ కామెంట్స్ చేశారు. లవ్ జిహాద్, క్రిస్టియన్లపై పీసీ జార్జ్ చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపుతున్నాయి. క్రైస్తవులు తమ సొంత కుమార్తెలను వివాహం చేసుకోవాలని ఆయన చేసిన వ్యాఖ్యలపై సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఈ క్రమంలో పీసీ జార్జ్ వ్యాఖ్యలపై కేరళ యూత్ కాంగ్రెస్ ఆగ్రహం వ్యక్తం చేసింది. 

ఈ మేరకు పీసీ జార్జ్‎పై పోలీసులకు ఫిర్యాదు చేసింది. కేరళలో లవ్ జిహాద్ పేరుతో ఒక్క కేసు కూడా నమోదు కాకపోయినా పీసీ జార్జ్ తప్పుడు ప్రచారం చేస్తున్నారని.. ఆయనపై చర్యలు తీసుకోవాలని కోరారు. పీసీ జార్జ్ కు వివాదస్పద వ్యాఖ్యలు చేయడం ఇదే తొలిసారి కాదు. గతంలో కూడా ఆయన ఇలాంటి తరహా వ్యాఖ్యలు చేశారు. ఇటీవల ఒక టీవీ ఛానల్ డిబేట్లో మైనారిటీ సమాజానికి వ్యతిరేకంగా ద్వేషపూరిత ప్రసంగం చేయడంతో ఆయనపై కేసులు నమోదు అయ్యాయి. ఈ కేసులో ఆయన జైలుకు వెళ్లి 2025, ఫిబ్రవరి 28నే బెయిల్‎ పై బయటకు వచ్చారు. ఇదిలా ఉండగానే ఆయన మరోసారి వివాదస్పద వ్యాఖ్యలు  చేసి వార్తల్లో నిలిచారు.