![ఉమ్మడి మెదక్ జిల్లా సంక్షిప్త వార్తలు](https://static.v6velugu.com/uploads/2022/09/Former-BJP-MLC-Ramchandra-Rao-comments-on-CM-KCR_9ZRsTqhl2C.jpg)
కేసీఆర్ నిరంకుశ పాలనకు ప్రజలే బుద్ధి చెబుతారు
బీజేపీ మాజీ ఎమ్మెల్సీ రాంచంద్రరావు
సదాశివపేట, వెలుగు : టీఆర్ఎస్ నిరంకుశపాలనకు ప్రజలు విసుగుచెందారని, వచ్చే ఎన్నికల్లో కేసీఆర్‌కు ప్రజలు తగిన గుణపాఠం చెబుతారని బీజేపీ మాజీ ఎమ్మెల్సీ రాంచంద్రరావు అన్నారు. శనివారం వెంకటాపూర్ గ్రామంలో జరిగిన ప్రజాగోస బీజేపీ భరోసా కార్యక్రమానికి ఆయన చీఫ్ గెస్టుగా హాజరయ్యారు. పార్టీ సంగారెడ్డి జిల్లా అధ్యక్షుడు నరేందర్ రెడ్డి ఆధ్వర్యంలో చేపట్టిన బైక్ ర్యాలీని ఆయన జెండా ఊపి ప్రారంభించారు. ఈ సందర్భంగా రాంచంద్రరావు మాట్లాడుతూ నరేంద్ర మోడీ పేద ప్రజల కోసం ఎన్నోసంక్షేమ అమలు చేస్తున్నారని తెలిపారు. రాష్ట్రంలో ఎనిమిదేండ్లుగా టీఆర్ఎస్ ప్రభుత్వం బూటకపు హామీలతో కాలక్షేపం చేస్తోందని విమర్శించారు. కాళేశ్వరం ప్రాజెక్ట్‌లో ఎంతో అవినీతి జరిగిందని ఆరోపించారు. సీఎం కేసీఆర్ రాష్ట్రాన్ని అప్పులమయం చేశారని మండిపడ్డారు. వచ్చే ఎన్నికల్లో సంగారెడ్డి నియోజకవర్గంలో బీజేపీ జెండా ఎగరవేయాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో బీజేపీ జగిత్యాల జిల్లా ఇన్చార్జి చంద్రశేఖర్, రాష్ట్ర కార్యవర్గ సభ్యులు విష్ణువర్ధన్ రెడ్డి, నాయకులు కోవూరు సంగమేశ్వర్, నెమలికొండ వేణుమాధవ్, దేశ్‌పాండే, మాణికరావు తదితరులు పాల్గొన్నారు.
టీచర్లు అంకిత భావంతో పని చేయాలి
ఎమ్మెల్సీ కూర రఘోత్తం రెడ్డి
సిద్దిపేట, వెలుగు : సమాజ నిర్మాణంలో ఉపాధ్యాయుల పాత్ర కీలకమని టీచర్స్ ఎమ్మెల్సీ కూర రఘోత్తమ్ రెడ్డి అన్నారు. శనివారం సిద్దిపేటలో ని విపంచి కళా నిలయంలో లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో ఉత్తమ ఉపాధ్యాయులను సన్మానించారు. కార్యక్రమానికి ఆయన చీఫ్ గెస్టుగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రభుత్వ పాఠశాలల్లో చదివే బడుగు, బలహీన వర్గాల పిల్లల కోసం ఉపాధ్యాయులు అంకితభావంతో పనిచేయాలని సూచించారు. విద్య, వైద్యం ఉచితంగా అందితేనే దేశం అభివృద్ధి చెందుతుందని తెలిపారు. కార్యక్రమంలో జడ్పీ చైర్ పర్సన్ రోజా శర్మ, మున్సిపల్ చైర్ పర్సన్ మంజుల రాజనర్సు, లయన్స్ ప్రతినిధులు బాబురావు, ఏ.అమరనాథరావు, జ్యోతి, నారాయణ, నాగరాజు పాల్గొన్నారు. ఈ సందర్భంగా 50 మంది ఉపాధ్యాయులను శాలువా, మెమొంటో, అభినందన పత్రంతో ఘనంగా సత్కరించారు.
ఆంథోనీస్ కాలేజీలో గ్రాండ్‌గా ఫ్రెషర్స్ పార్టీ
సంగారెడ్డి టౌన్, వెలుగు : సంగారెడ్డిలోని సెయింట్ ఆంథోనీస్ జూనియర్ కాలేజీలో శనివారం గ్రాండ్‌గా స్టూడెంట్స్ ఫ్రెషర్స్ పార్టీ నిర్వహించారు. ఐపీఈ- 2022లో స్టేట్ ర్యాంక్ సాధించిన విద్యార్థులకు, నీట్ 2022 ఫలితాల్లో ఆలిండియా జనరల్ కేటగిరిలో పీడబ్ల్యూడీ కేటగిరిలో మనీషా10967, పీడబ్ల్యూడీ కేటగిరిలో ఎస్.భావని 3744 ర్యాంకు సాధించినందించారు. ఈ సందర్భంగా వారిని సత్కరించి మెమెంటోలు అందజేశారు. కాలేజీ డైరెక్టర్ సాల్మాన్రెడ్డి మాట్లాడుతూ విద్యార్థులు స్పష్టమైన లక్ష్యాన్ని నిర్దేశించుకొని గమ్యం చేరుకోవాలని సూచించారు. విద్యార్థుల ఆటపాటలు ఆకట్టుకున్నాయి. వేడుకల్లో కాలేజీ ప్రిన్సిపాల్ జ్యోతి రెడ్డి, మేనేజ్మెంట్ టీం సభ్యులు బాలరెడ్డి, విజయ్ రెడ్డి, అరుణరెడ్డి, డిగ్రీ కాలేజీ ప్రిన్సిపాల్ జవహర్ పాల్గొన్నారు.
విద్యతో ప్రపంచాన్నే జయించవచ్చు
నర్సాపూర్ ఆర్డీవో వెంకట ఉపేందర్‌రెడ్డి
మెదక్ (కౌడిపల్లి), వెలుగు : విద్యతో ప్రపంచాన్నే జయించవచ్చని నర్సాపూర్ ఆర్డీవో వెంకట ఉపేందర్ రెడ్డి, నర్సాపూర్ సీఐ లాల్ మదర్ అన్నారు. కౌడిపల్లి మండలం తునికి మహాత్మా జ్యోతిభాపూలే గురుకులంలో మూడు రోజులుగా కొనసాగుతున్న ఉమ్మడి జిల్లా అండర్ -14 క్రీడల ముగింపు సభకు హాజరయ్యారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ సిద్దిపేట, మెదక్, సంగారెడ్డి నుంచి విద్యార్థులు వచ్చి క్రీడల్లో పాల్గొనడం ఆనందంగా ఉందన్నారు. ప్రతి ఒక్క విద్యార్థి ఆటల్లో పాల్గొనాలని సూచించారు. ప్రిన్సిపాల్ శివప్రసాద్ మాట్లాడుతూ పాఠశాలలో గ్రౌండ్ లేక పిల్లలు నిరుత్సాహ పడుతున్నారన్నారు. త్వరలో డిగ్రీ కాలేజ్ కూడా రాబోతుందని, గ్రౌండ్ ఏర్పాటు చేస్తే మరింత మంది విద్యార్థులు ఆటల్లో రాణించడానికి అవకాశం ఉంటుందని తెలిపారు. టోర్నమెంటులో ఖో-ఖో ఫస్ట్ తునికి జ్యోతిభాపూలే, కబడ్డీ ఫస్ట్ శంకరంపేట్, వాలీబాల్ ఫస్ట్ ఐనోల్ రావడంతో విజేతలకు ఆర్డీవో, సీఐల బహుమతులు ప్రదానం చేశారు. కార్యక్రమంలో సీఐ లాల్ మదర్, కౌడిపల్లి ఎస్సై శివప్రసాద్ రెడ్డి, ఫిజికల్ డైరెక్టర్ వెంకటరెడ్డి, రాజన్న, పాఠశాల లెక్చరర్లు, విద్యార్థులు పాల్గొన్నారు.
అక్రమంగా నిల్వ చేసిన రేషన్ బియ్యం స్వాధీనం
దుబ్బాక, వెలుగు: అక్రమంగా నిల్వ చేసిన రేషన్ బియ్యాన్ని టాస్క్‌పోర్స్ అధికారులు శనివారం స్వాధీనం చేసుకున్నారు. రాయపోల్ మండలం బేగంపేట శివారులోని ఫౌల్ట్రీ ఫామ్‌లో రేషన్ బియ్యాన్ని డంపు చేశారన్నా పక్కా సమాచారంతో దాడులు నిర్వహించి 80 క్వింటాళ్ల బియ్యం స్వాధీనం చేసుకున్నట్లు టాస్క్‌పోర్స్ సీఐ గురుస్వామి తెలిపారు. గ్రామానికి చెందిన తిగుల్ల చంద్రయ్య, ట్రాలీ ఆటో డ్రైవర్లు భాస్కర్ నాయక్, కుమార్ నాయక్‌ను అరెస్ట్ చేసినట్లు చెప్పారు. ప్రభుత్వం పేదల కోసం ఇచ్చే బియ్యాన్ని కొనుగోలు చేసినా, అమ్మినా క్రిమినల్ కేసులు పెడుతామని ఆయన హెచ్చరించారు.
ఆసరా పింఛన్ల కార్డుల పంపిణీ
మెదక్ (పెద్దశంకరంపేట)/కోహెడ, వెలుగు : మెదక్ జిల్లా పెద్ద శంకరంపేట మండలం మాడ్చెట్‌పల్లి, శివాయపల్లి గ్రామాల్లో కొత్తగా మంజూరైన ఆసరా పింఛన్ల కార్డులను శనివారం నారాయణఖేడ్ ఎమ్మెల్యే భూపాల్‌రెడ్డి, హుస్నాబాద్‌లో ఎమ్మెల్యే సతీశ్‌కుమార్ పంపిణీ చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ అర్హులైన వారందరికీ తెలంగాణ ప్రభుత్వం ఆసరా పింఛన్లను పంపిణీ చేస్తోందని తెలిపారు. సీఎం కేసీఆర్ పేదల సంక్షేమానికి ఎన్నో సంక్షేమ పథకాలను అమలు చేస్తున్నారని, లబ్ధిదారులు సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. అనంతరం మండల పరిధిలోని కొత్తపేట సర్పంచ్ అనంతరావు భార్య ఇటీవల మృతి చెందడంతో ఎమ్మెల్యే భూపాల్‌రెడ్డి వారి కుటుంబ సభ్యులను పరామర్శించారు.
ఉచిత పథకాలు బంద్ చేస్తే పేదలు బతికేదెలా?
చేర్యాల, వెలుగు: ఉచిత పథకాలను బంద్ చేస్తే పేద ప్రజలు ఎలా బతుకుతారో ప్రతిపక్షపార్టీలు చెప్పాలని ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరిరెడ్డి అన్నారు. శనివారం మండల కేంద్రంలోని వాసవీ గార్డెన్లో కల్యాణలక్ష్మి, షాదీ ముబారక్ స్కీం లబ్ధిదారులకు ఆయన చెక్కులు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ దేశంలో ఏ రాష్ట్రం కూడా అమలు చేయని పథకాలను, తెలంగాణలో సీఎం కేసీఆర్ అమలు చేస్తున్నారన్నారు. దేశంలో కేసీఆర్ నాయకత్వంలో రైతు ప్రభుత్వం ఏర్పడబోతుందన్నారు. ఉచితాలను బంద్ చేయాలన్న వారికి ఓటు వేయవద్దని ఆయన ప్రజలకు సూచించారు. 47 లబ్ధిదారులకు చెక్కులను పంపిణీ చేసినట్లు తెలిపారు. కార్యక్రమంలో మున్సిపల్ చైర్పర్సన్ ఎ. స్వరూపారాణి తదితరులు పాల్గొన్నారు.
కారు బోల్తా పడి యువకుడు మృతి
కంది, వెలుగు : కారు బోల్తాపడి ఓ యువకుడు మృతి చెందాడు. ఈ ఘటన ఇంద్రకరణ్ పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగింది. ఎస్సై రాజేశ్తెలిపిన ప్రకారం... కంది గ్రామం లక్ష్మీ నగర్ కాలనీకి చెందిన ఖదీర్ తన స్నేహితులతో కలిసి శుక్రవారం రాత్రి గణేశ్ నిమజ్జనం ఊరేగింపులో పాల్గొన్నారు. నిమజ్జనం జరుగుతుండగా టీ తాగడానికి ఫ్రెండ్స్ అబేద్, జావీద్ తో కలిసి ఓడీఎఫ్ కు కారులో వెళ్లారు. అక్కడ హోటల్ బంద్ ఉండడంతో తిరిగి సంగారెడ్డికి వెళ్తుండగా ఓడీఎఫ్ వై జంక్షన్ వద్ద కారు అదుపుతప్పి బోల్తా పడింది. ఖదీర్ అక్కడికక్కడే చనిపోయాడు. జావేద్, అబేద్‌కు గాయాలయ్యాయి. మృతుడి అన్న సర్వర్ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నామని ఎస్సై తెలిపారు.
మట్టి తరలిస్తున్న వారిపై చర్యలు తీసుకోవాలి
బీజేపీ సిద్దిపేట జిల్లా ప్రధాన కార్యదర్శి సురేశ్‌గౌడ్
కొమురవెల్లి, వెలుగు : మండల కేంద్రంలోని ప్రభుత్వ భూమి, మల్లన్న దేవస్థానం భూముల్లో అనుమతులు లేకుండా మట్టి తరలిస్తున్నవారిపై చర్యలు తీసుకోవాలని బీజేపీ సిద్దిపేట జిల్లా ప్రధాన కార్యదర్శి బూర్గు సురేశ్‌గౌడ్ డిమాండ్ చేశారు. శనివారం మండల కేంద్రంలో బీజేపీ మండల అధ్యక్షుడు దండ్యాల వెంకట్‌రెడ్డి అధికారులతో కలిసి మట్టి అక్రమంగా తరలిస్తున్న ప్రాంతాన్ని పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కొమురవెల్లి మల్లికార్జున స్వామి ఆలయానికి సంబంధించిన భూముల నుంచి చాలా రోజులుగా అనుమతులు లేకుండా కొందరు అధికార పార్టీ లీడర్లు మట్టి తరలిస్తున్నారని ఆరోపించారు. ఈ విషయంపై బీజేపీ నాయకులు పలుమార్లు మల్లికార్జున స్వామి ఆలయ ఈవో, తహసీల్దార్ దృష్టికి తీసుకెళ్లినా స్పందనలేదన్నారు. వెంటనే కలెక్టర్ స్పందించి మట్టి అక్రమ తరలింపును అడ్డుకోవాలని కోరారు.
తెలంగాణ హరితహారం భేష్
గజ్వేల్, వెలుగు: తెలంగాణలో హరితహారం కార్యక్రమం అద్భుతంగా ఉందని, అడవుల పెంపుదల, విలేజ్ నర్సరీలు, పల్లె ప్రకృతి వనాల నిర్వహణ బాగున్నాయని యూపీ స్టేట్ ఫారెస్ట్ మినిస్టర్అరుణ్కుమార్ అన్నారు. శనివారం ఆయన సిద్దిపేట జిల్లాలోని ములుగు, గజ్వేల్ మండలాల్లో పర్యటించారు. గజ్వేల్ ఇంటిగ్రేటెడ్ మార్కెట్, జప్తి సింగాయిపల్లి, ములుగు గ్రామాల్లోని నర్సరీలు, పల్లె ప్రకృతి వనాలను ఆయన పరిశీలించారు. ఫారెస్ట్ స్టేట్ఆఫీసర్లు దోబ్రియాల్, ఆర్సీ శోభ హరితహారం గురించి ఆయనకు వివరించారు. అడవుల పెంపకంలో ప్రజలు భాగస్వామ్యం కావడం బాగుందని అరుణ్ కుమార్ అన్నారు. .
రామచంద్రపురంలో మిజోరాం గవర్నర్
రామచంద్రాపురం, వెలుగు : బీజేపీ మహిళా మోర్చా రాష్ట్ర మాజీ ప్రధాన కార్యదర్శి గోదావరి, రాష్ట్ర నాయకుడు అంజిరెడ్డి కుటుంబాన్ని మిజోరాం గవర్నర్ కుంభంపాటి హరిబాబు శనివారం సంగారెడ్డి జిల్లా రామచంద్రాపురంలో కలిశారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. అంజిరెడ్డి కూతుళ్ల వివాహాలకు గత నెలలో హాజరుకాలేక పోయినందునే ఇప్పుడు వారి కుటుంబాన్ని కలిశానని చెప్పారు. దేశ ఆర్థిక ప్రగతిలో ఈశాన్య రాష్ట్రాలు ముఖ్య పాత్ర పోషిస్తున్నాయని, కేంద్రం అన్ని రాష్ట్రాల అభివృద్ధికి తగిన చర్యలు తీసుకుంటుందని తెలిపారు.