
- బెంగాల్‌లోని ఖరగ్ పూర్లో ఘటన
కోల్‌కతా: బెంగాల్‌కు చెందిన బీజేపీ మాజీ ఎంపీ దిలీప్ ఘోష్ సహనం కోల్పోయారు. శుక్రవారం ఖరగ్‌పూర్‌లోని వార్డు నంబర్ 6 లో జరిగిన రోడ్డు ప్రారంభోత్సవ కార్యక్రమానికి హాజరైన ఆయనను స్థానిక మహిళలు చుట్టుముట్టారు. మేం ఇప్పుడు గుర్తొచ్చామా ? ఎంపీగా ఉన్నప్పుడు మా ఏరియాకు ఎందుకు ఒక్కసారి కూడా రాలేదని నిలదీశారు.
రోడ్డును మా కౌన్సిలర్ ప్రదీప్ సర్కార్ నిర్మిస్తే మీరొచ్చి ప్రారంభిస్తారా ? అని ఫైర్ అయ్యారు. దాంతో మహిళలపై దిలీప్ ఘోష్ తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. "ఈ రోడ్డు నిర్మాణానికి డబ్బులిచ్చింది నేనే. మీ తండ్రి డబ్బులతో రోడ్డు వేయలేదు! కావాలంటే వెళ్లి ప్రదీప్ సర్కార్ నే అడగండి!" అని ఫైర్ అయ్యారు.
దిలీప్ ఘోష్ కామెంట్ పై మహిళలు మరింత అగ్రహానికి గురయ్యారు. "మా నాన్న గురించి ఎందుకు మాట్లాడుతున్నారు? ఎంపీ మీరు కదా! రోడ్డు వేయాల్సింది కూడా మీరే" అని నిలదీశారు. దాంతో పూర్తిగా సంయమనం కోల్పోయిన దిలీప్ ఘోష్ బెదిరింపులకు దిగారు. "అలా అరవకండి.
అరిస్తే మీ గొంతు నులిమేస్తా" అని మహిళకు వార్నింగ్ ఇచ్చారు. తాను పార్లమెంటేరియన్‌గా ఉన్న టైంలో.. ఎంపీ లాడ్ ఫండ్ నుంచి ఈ రోడ్డుకు డబ్బు ఇచ్చానని వివరణ ఇచ్చారు. మహిళలకు, దిలీప్ ఘోష్ మధ్య తీవ్ర వాగ్వాదంతో ఉద్రిక్తత నెలకొంది. భద్రతా సిబ్బంది, బీజేపీ కార్యకర్తలు దిలీప్ ఘోష్ ను వెంటనే కారు ఎక్కించగా..మహిళలు వెహికల్ ను చుట్టుముట్టారు. ఆయనకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. నిరసనల మధ్యే ఘోష్ కారు ముందుకు కదిలింది.