హైదరాబాద్: ఎమ్మెల్యేలు కౌశిక్ రెడ్డి, అరికెపూడి గాంధీ డైలాగ్ వార్తో స్టేట్ పాలిటిక్స్‌లో హైటెన్షన్ నెలకొంది. కౌశిక్ రెడ్డిపై దాడి నేపథ్యంలో ఇవాళ (సెప్టెంబర్ 13) ఎమ్మె్ల్యే అరికెపూడి గాంధీ నివాసంలో శేరిలింగపల్లి నియోజకవర్గ స్థాయి విస్తృత స్థాయి సమావేశానికి బీఆర్ఎస్ పిలుపునిచ్చింది. కౌశిక్ రెడ్డి, అరికెపూడి గాంధీల మధ్య మాటల యుద్ధం పీక్ స్టేజ్‌కు చేరుకోవడంతో పోలీసులు అలర్ట్ అయ్యారు. ఈ నేపథ్యంలో బీఆర్ఎస్ నేతలను ఎక్కడికక్కడ పోలీసులు అదుపులోకి తీసుకుంటున్నారు. ఈ క్రమంలోనే బీఆర్ఎస్ కీలక నేత మాజీ మంత్రి హరీష్ రావు, మాజీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్‌ను పోలీసులు హౌస్ అరెస్ట్ చేశారు.
కోకాపేటలోని తన నివాసంలో హరీష్ రావును పోలీసులు నిర్భందించారు. హరీష్ రావు ఇంటి వద్ద భారీగా బలగాలను మోహరించి బారికేడ్లను ఏర్పాటు చేశరు. హరీష్ రావును కలిసేందుకు వచ్చే బీఆర్ఎస్ శ్రేణులను పోలీసులు అడ్డుకుంటున్నారు. మరోవైపు అరికెపూడి గాంధీ ఇంటికి వెళ్లకుండా మాజీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్, ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్, ఎమ్మెల్యేలు కేపీ వివేకానంద, మాధవరం కృష్ణారావు, ఎమ్మెల్సీ శంభీపూర్లను సైతం పోలీసులు గృహ నిర్భందం చేశారు.
Also Read :- శాంతి భద్రతలకు విఘాతం కల్గిస్తే ఎవర్నీ వదలం
ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చేసుకోకుండా ముందస్తుగా బీఆర్ఎస్ నేతల ఇంటి వద్ద పోలీసులను భారీగా మోహరించారు. మరోవైపు కౌశిక్ రెడ్డిపై దాడికి నిరసనగా హైదరాబాద్‌కు రావాలని హరీష్ రావు ఇచ్చిన పిలుపు మేరకు బీఆర్ఎస్ నేతలు రాష్ట్ర వ్యాప్తంగా హైదరాబాద్‌కు చేరుకుంటున్నారు. ఈ క్రమంలో పోలీసులు బీఆర్ఎస్ శ్రేణులను ఎక్కడికక్కడే అదుపులోకి తీసుకుంటున్నారు. ఎట్టి పరిస్థితుల్లో గాంధీ ఇంటికి చేరుకుంటామని కౌశిక్ రెడ్డి సవాల్ చేయడంతో ఏం జరుగుతుందోనని తీవ్ర ఉత్కంఠ నెలకొంది.