- నిందితులకు ప్రత్యర్థుల ఫోన్ నంబర్లు
- ఇచ్చినమన్న బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యేలు
- సిట్ విచారణలో అంగీకారం..మీడియా ముందు కూడా వెల్లడి
- విచారణకు హాజరైన కల్వకుర్తి మాజీ ఎమ్మెల్యే జైపాల్ యాదవ్
- రెండు గంటలు ప్రశ్నించిన సిట్
- చిరుమర్తికి మళ్లీ నోటీసులు..మంగళవారం విచారణ!
- మరికొందరు నేతలను ప్రశ్నించేందకు సిట్ ఏర్పాట్లు
హైదరాబాద్, వెలుగు: ఫోన్ ట్యాపింగ్ కేసులో నిజాలు ఒక్కొక్కటిగా బయటపడుతున్నాయి. బీఆర్‌ఎస్ ప్రభుత్వ హయాంలో జరిగిన ఈ వ్యవహారం గుట్టును ఆ పార్టీ మాజీ ఎమ్మెల్యేలు విప్పుతున్నారు. స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీమ్ ముందు నిజాలు ఒప్పుకుంటున్నారు. తమ ప్రత్యర్థులు, వారి అనుచరులు, ప్రైవేట్ వ్యక్తుల ఫోన్ నంబర్లను తాము నిందితులకు అందించినట్లు అధికారులకు చెప్తున్నారు. విచారణలో భాగంగా నకిరేకల్ బీఆర్‌ఎస్ మాజీ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య, కల్వకుర్తి మాజీ ఎమ్మెల్యే జైపాల్ యాదవ్ పోలీసుల ముందు వాంగ్మూలం ఇచ్చారు. కేసులో నిందితుడైన మాజీ అడిషనల్ డీఎస్పీ తిరుపతన్నకు ఎలాంటి సమాచారం అందించారు..? ఎవరెవరి ఫోన్ నంబర్లు చేరవేశారు..? ఎందుకు ఇచ్చారు?.. అనే వివరాలను సిట్ రాబడ్తున్నది.
తిరుపతన్న అడిగితేనే వేముల వీరేశం అనుచరుల ఫోన్ నంబర్లు తన అనుచరుల ద్వారా పంపించానని ఇటీవల విచారణ అనంతరం చిరుమర్తి లింగయ్య మీడియాకు చెప్పారు. తాజాగా శనివారం మరో మాజీ ఎమ్మెల్యే జైపాల్ యాదవ్ కూడా విచారణ అనంతరం మీడియాతో మాట్లాడారు. తిరుపతన్నకు ఇద్దరి ఫోన్ నంబర్లు ఇచ్చానని. ఆ రెండు ఫోన్ నంబర్లు ట్యాప్ అయినట్లు పోలీసులు తనను ప్రశ్నించారని తెలిపారు. ఆధారాలు చూపించి విచారించారని, వారు అడిగిన ప్రశ్నలకు సమాధానాలు చెప్పానని జైపాల్ యాదవ్ వెల్లడించారు. కాగా.. నిందితుల కాల్ డేటా, వాట్సాప్ రిట్రీవ్ ఆధారంగా మరికొంత మంది మాజీ ఎమ్మెల్యేలు, జిల్లాల కీలక నేతలకు సిట్ నోటీసులు ఇచ్చి విచారించేందుకు సిద్ధమవుతున్నది. ఇందులో ఉమ్మడి నల్గొండ, మహబూబ్‌నగర్ జిల్లాలకు చెందిన కొందరిని మంగళవారం నుంచి ప్రశ్నించనున్నట్లు తెలుస్తున్నది.
నోటీసులు వద్దని.. నేరుగా వచ్చిన జైపాల్!
కల్వకుర్తి మాజీ ఎమ్మెల్యే జైపాల్ యాదవ్‌ను సిట్ విచారించింది. గురువారమే నోటీసులిచ్చేందుకు యత్నించిన పోలీసులను ఇంటికి రావొద్దని జైపాల్ యాదవ్ చెప్పినట్లు తెలిసింది. నోటీసులు లేకుండా తానే విచారణకు హాజరవుతానని ఆయన చెప్పినట్లు సమాచారం. దీంతో శనివారం ఉదయం 11 గంటలకు జూబ్లీహిల్స్ పీఎస్‌కు జైపాల్ యాదవ్ చేరుకున్నారు. ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్, జూబ్లీహిల్స్ ఏసీపీ వెంకటగిరి ఆధ్వర్యంలోని టీమ్ దాదాపు 2 గంటలు ఆయనను ప్రశ్నించింది.
తిరుపతన్న కాల్ డేటా, వాట్సాప్ రిట్రీవ్, ట్యాపింగ్ అయిన ఫోన్ నంబర్ల ఆధారంగా స్టేట్‌మెంట్ రికార్డ్ చేసింది. ఎస్‌ఐబీ పొలిటికల్ వింగ్ మాజీ అడిషనల్ డీఎస్పీలు భుజంగరావు, తిరుపతన్నతో ఎంత కాలంగా పరిచయం ఉందనే వివరాలు సేకరించింది. గత అసెంబ్లీ ఎన్నికల్లో కల్వకుర్తి నియోజకవర్గంలోని జైపాల్ యాదవ్ ప్రత్యర్థులు, వారి అనుచరులకు సంబంధించిన వివరాలతో స్టేట్‌మెంట్ రికార్డ్ చేశారు. తిరుపతన్న ట్యాప్ చేసిన రెండు ఫోన్ నంబర్ల గురించి వివరాలు రాబట్టారు. ఆ నంబర్లను తిరుపతన్నకు ఎందుకు పంపించారు? అనే కోణంలో ప్రశ్నించారు. గతేడాది నవంబర్‌లో తిరుపతన్నకు రెండు ఫోన్ నంబర్లు ఇచ్చినట్లు జైపాల్ యాదవ్ అంగీకరించారు.
కసిరెడ్డి అనుచరుల నంబర్లు చేరవేత!
అప్పటి బీఆర్‌ఎస్ ఎమ్మెల్సీగా ఉన్న కసిరెడ్డి నారాయణ రెడ్డి ఎమ్మెల్యేగా టికెట్ దక్కక పోవడంతో బీఆర్‌ఎస్‌కు రిజైన్ చేసి కాంగ్రెస్ నుంచి పోటీ చేశారు. దీంతో కసిరెడ్డి నారాయణ రెడ్డి, ఆయన ముఖ్య అనుచరులపై బీఆర్‌ఎస్ పెద్దలు ఫోకస్ చేశారు. అధిష్టానం ఆదేశాలతో తన ప్రత్యర్థులైన కసిరెడ్డి, తల్లోజు ఆచారి కు సంబంధించిన వివరాలు, ఫోన్ నంబర్లను తిరుపతన్న టీమ్‌కు జైపాల్ యాదవ్ చేరవేసినట్లు సిట్ ఆధారాలు సేకరించింది.
లింగయ్యకు మళ్లీ నోటీసులు
నకిరేకల్ మాజీ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్యకు సిట్ అధికారులు మరోసారి నోటీసులు జారీ చేశారు. వారం రోజులలోగా మళ్లీ విచారణకు హాజరుకావాలని సూచించారు. గురువారం జరిగిన విచారణకు కొనసాగింపుగా కొన్ని వివరాలు అందించాలని తెలిపారు. సిట్ నోటీసుల మేరకు మంగళవారం లేదా బుధవారం ఆయన విచారణకు హాజరయ్యే అవకాశం ఉంది.
తిరుపతన్నకు నంబర్లు ఇచ్చిన: జైపాల్ యాదవ్
తిరుపతన్న తమ సామాజిక వర్గానికి చెందిన వ్యక్తి కావడంతో పరిచయం ఉందని కల్వకు ర్తి మాజీ ఎమ్మెల్యే జైపాల్ యాదవ్ అన్నారు. ‘‘రెండు కుటుంబాల మధ్య తలెత్తిన వివాదాన్ని తిరుపతన్న, నేను కలిసి పరిష్కరిద్దామనుకున్నాం. ఈ క్రమంలోనే తిరుపతన్నకు ఇద్దరి ఫోన్ నంబర్లు ఇచ్చాను. వారికి రాజకీయాలతో సంబంధం లేదు. ఆ ఫోన్ నంబర్లు ట్యాపింగ్ అయినట్లు పోలీసులు నన్ను ప్రశ్నించారు. పోలీసులు అడిగిన ప్రశ్నలకు సమాధానాలు చెప్పాను. విచారణకు సహకరిస్తాను’’ అని తెలిపారు.