హైదరాబాద్: తెలంగాణ పాలిటిక్స్‌ను షేక్ చేసిన ఫోన్ ట్యాపింగ్ కేసులో బీఆర్ఎస్ నేత, నకిరేకల్ మాజీ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య విచారణకు గైర్హాజరయ్యారు. అనారోగ్య కారణంగా 2024, నవంబర్ 11న విచారణకు హాజరుకాలేనని ఆయన పోలీసులకు సమాచారం అందించారు. ఈ నెల (నవంబర్) 14న విచారణకు హాజరవుతానని చిరుమర్తి పోలీసులకు తెలిపినట్లు సమాచారం.
కాగా, గత బీఆర్ఎస్ ప్రభుత్వం హయాంలో పలువురు ప్రతిపక్ష నేతలతో పాటు సెలబ్రెటీలు, బిల్డర్లు, వ్యాపారవేత్తల ఫోన్లను ట్యాపింగ్ చేసినట్లు గుర్తించిన పోలీసులు ఈ మేరకు కేసు నమోదు దర్యాప్తు చేస్తున్నారు. రాష్ట్ర రాజకీయాల్లో సంచలనం రేపిన ఈ కేసులో ఎస్ఐబీ మాజీ చీఫ్ ప్రభాకర్ రావు, ప్రణీత్ రావు, భుజంగరావు, తిరుపతన్నలపై పోలీసులు కేసు నమోదు చేసిన విషయం తెలిసిందే.ఈ కేసులో ప్రధాన నిందితుడు ప్రభాకర్ రావు విదేశాలకు పారిపోగా.. ప్రణీత్ రావు, భుజంగరావు, తిరుపతన్న జ్యుడిషియల్ రిమాండ్‌లో భాగంగా ప్రస్తుతం జైల్లో ఉన్నారు.
ALSO READ | ఫోన్ ట్యాపింగ్ కేసులో BRS మాజీ ఎమ్మెల్యేకు నోటీసులు
ఫోన్ ట్యాపింగ్ కేసులో ఇప్పటి వరకు కేవలం అధికారులను మాత్రమే విచారించిన పోలీసులు.. ఫస్ట్ టైమ్ ఓ రాజకీయ నేతకు నోటీసులు ఇవ్వడం స్టేట్ పాలిటిక్స్‌లో తీవ్ర చర్చనీయాశంగా మారింది. ఈ కేసులో నిందితుడైన తిరుపతన్న, చిరుమర్తి లింగయ్య మధ్య పలుమార్లు సంభాషణ జరిగినట్లు గుర్తించిన పోలీసులు.. ఈ మేరకు చిరుమర్తికి నోటీసులు ఇచ్చారు. 2024, నవంబర్ 11న విచారణలో భాగంగా హైదరాబాద్‌లోని జూబ్లీహిల్స్ ఏసీపీ ఆఫీస్‌కు రావాలని పోలీసులు ఆదేశించారు.
అనారోగ్యం కారణంగా చిరుమర్తి లింగయ్య పోలీసులు ఎదుట విచారణకు హాజరు కాలేదు. చిరుమర్తి విచారణ అనంతరం మరికొంత మంది రాజకీయ నేతలకు నోటీసులు ఇచ్చే అవకాశం ఉన్నట్లు పొటికల్ సర్కిల్స్‌లో ప్రచారం జరుగుతోంది. త్వరలోనే రాష్ట్ర రాజకీయాల్లో బాంబులు పేలాబోతున్నాయంటూ ప్రభుత్వ పెద్దలు కామెంట్లు చేస్తోన్న నేపథ్యంలో.. స్టేట్ పాలిటిక్స్‌లో తీవ్ర దుమారం రేపిన ఫోన్ ట్యాపింగ్ కేసులో పోలీసులు విచారణ స్పీడప్ చేయడం చర్చనీయాంశంగా మారింది. బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యేకు నోటీసులు ఇవ్వడంతో ఫోన్ ట్యాపింగ్ కేసులో నెక్ట్స్ ఏం జరగబోతుందనే దానిపై ఉత్కంఠ నెలకొంది.