నాగర్‌కర్నూల్, వెలుగు: తాను పార్టీ మారడం లేదని, కాంగ్రెస్‌లో చేరుతున్నట్టుగా వస్తున్నవన్నీ వదంతులేనని బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే మర్రి జనార్దన్‌రెడ్డి చెప్పారు. ఓడిపోయిన తాను పార్టీ మారాల్సిన అవసరం ఏముందన్నారు. శుక్రవారం నాగర్‌కర్నూల్‌జిల్లా బీఆర్ఎస్ఆఫీస్లో నేతలు, కార్యకర్తలతో మర్రి జనార్దన్‌రెడ్డి సమావేశమయ్యారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. ‘‘మా ఎమ్మెల్యేలు దొడ్డిదారిన వెళ్లి సీఎం రేవంత్‌ను కలుస్తున్నారు. కానీ నేను అలా కాదు.. అవసరమైతే మా పార్టీ అధినేత కేసీఆర్‌కు చెప్పి మరీ కలుస్తాను’’ అని అన్నారు.
‘‘మల్కాజ్గిరి నుంచి గానీ, మహబూబ్‌నగర్ నుంచి గానీ పోటీ చేయాలని బీఆర్ఎస్, కాంగ్రెస్, బీజేపీ నుంచి ఆఫర్లు వచ్చాయి. కానీ ఈ ఐదేండ్లు రాజకీయాల్లో ఉండాలా? ఖాళీగా ఉండాలా? అనే నిర్ణయం ఇంకా తీసుకోలేదు. ఈ ఐదేండ్లు నా ఆరోగ్యాన్ని, వ్యాపారాన్ని కాపాడుకోవాలని అనుకుంటున్నాను. బీజేపీ వాళ్లు బెదిరించి పార్టీలో చేర్చుకుంటారు. కానీ నన్ను మాత్రం మామూలుగానే అడిగారు. ప్రజలు నాకు విశ్రాంతి ఇచ్చారు. వ్యాపారంలో నేను సంపాదించిన డబ్బు రాజకీయాల కోసం కాకుండా నిరుపేదల చదువు, పేద ఆడపిల్లల పెళ్లిళ్లకు ఖర్చు పెడ్తాను. ఏ పార్టీ పిలిస్తే ఆ పార్టీలోకి వెళ్లేంత అమాయకుడిని కాదు. నేను ఏ నిర్ణయం తీసుకున్నా కేసీఆర్, బీఆర్ఎస్కార్యకర్తలకు చెప్పి చేస్తాను” అని అన్నారు.