హైదరాబాద్: వికారాబాద్ జిల్లా లగచర్లలో కలెక్టర్, రెవెన్యూ సిబ్బందిపై దాడి కేసులో అరెస్ట్ అయిన బీఆర్ఎస్ నేత, కొడంగల్ మాజీ ఎమ్మెల్యే పట్నం నరేందర్ రెడ్డిని చర్లపల్లి జైలుకు తరలించారు. కొడంగల్ ఫస్ట్ క్లాస్ మేజిస్ట్రేట్ పట్నం నరేందర్ రెడ్డికి 14 రోజుల జ్యుడిషియల్ రిమాండ్ విధించడంతో పోలీసులు అతడిని చర్లపల్లి జైలుకు తరలించారు. బీఆర్ఎస్ శ్రేణులు ఆందోళన చేసే అవకాశం ఉండటంతో పోలీసులు పెద్ద ఎత్తున బలగాలను మోహరించారు.
కాగా, వికారాబాద్ జిల్లాలోని లగచర్ల గ్రామంలో ఫార్మా కంపెనీ ఏర్పాటుపై ప్రజాభ్రిప్రాయం తెలుసుకునేందుకు వెళ్లిన వికారాబాద్ జిల్లా కలెక్టర్ ప్రతీక్ జైన్, రెవెన్యూ అధికారులపై దాడి జరిగింది. ఈ ఘటనలో పట్నం నరేందర్ రెడ్డి అనుచరుడు, బీఆర్ఎస్ కార్యకర్త సురేష్‌ను ఏ1గా పోలీసులు చేర్చారు. పోలీసులు నిందితుడు సురేష్ కాల్ డేటా విశ్లేషించగా.. దాడి జరిగిన సమయంలో సురేష్, పట్నం నరేందర్ రెడ్డి పలుమార్లు ఫోన్ కాల్స్ మాట్లాడుకున్నట్లు పోలీసులు గుర్తించారు.
ఈ క్రమంలోనే 2024, నవంబర్ 13వ తేదీ ఉదయం హైదరాబాద్‌లో పట్నం నరేంద్ రెడ్డిని పోలీసులు అదుపులోకి తీసుకుని పరిగి పోలీస్ స్టేషన్‌కు తరలించారు. ఈ ఘటనపై పట్నం నరేంద్ రెడ్డిని దాదాపు 5 గంటల పాటు ప్రశ్నించిన పోలీసులు అనంతరం వైద్య పరీక్షల నిమిత్తం కొడంగల్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. వైద్య పరీక్షల అనంతరం పట్నం నరేందర్ రెడ్డిని కొడంగల్ ఫస్ట్ క్లాస్ మేజిస్ట్రేట్ ముందు హాజరు పర్చారు. కొడంగల్ ఫస్ట్ క్లాస్ మేజిస్ట్రేట్ నరేందర్ రెడ్డికి 14 రోజుల జ్యుడిషియల్ రిమాండ్ విధించారు. దీంతో పోలీసులు ఆయనను చర్లపల్లి జైలుకు తరలించారు.