తల్లి అంత్యక్రియలకు వచ్చిన BRS మాజీ ఎమ్మెల్యే షకీల్ అరెస్ట్..!

తల్లి అంత్యక్రియలకు వచ్చిన BRS మాజీ ఎమ్మెల్యే షకీల్ అరెస్ట్..!

హైదరాబాద్: బీఆర్ఎస్ నేత, బోదన్ మాజీ ఎమ్మె్ల్యే షకీల్ అరెస్ట్ అయ్యారు. శంషాబాద్ విమానాశ్రయంలో పోలీసులు అతడిని అదుపులోకి తీసుకున్నారు. షకీల్‎పై గతంలో నమోదైన కేసుల్లో భాగంగా పోలీసులు అరెస్ట్ చేసినట్లు తెలుస్తోంది. గత కొన్ని రోజులుగా దుబాయ్‎లో ఉంటున్న షకీల్ గురువారం ( ఏప్రిల్ 10) తల్లి అంత్యక్రియలకు హాజరయ్యేందుకు హైదరాబాద్ వచ్చాడు. సమాచారం అందుకున్న పోలీసులు ఎయిర్ పోర్టులో షకీల్‎ను అదుపులోకి తీసుకున్నారు. అయితే.. తల్లి అంత్యక్రియలకు హాజరయ్యేందుకు పోలీసులు షకీల్‎కు అనుమతి ఇచ్చినట్లు సమాచారం. 

కాగా.. 2023, డిసెంబర్ 23న అర్ధరాత్రి మాజీ ఎమ్మెల్యే షకీల్ కుమారుడు రాహిల్‌ అతివేగంగా కారు నడుపుతూ బేగంపేటలోని ప్రజాభవన్‌ వద్ద ట్రాఫిక్‌ డివైడర్లను ఢీకొట్టిన విషయం తెలిసిందే. రాహిల్ తప్పతాగి ఈ యాక్సిడెంట్ చేసినట్లు గుర్తించిన పోలీసులు రాహిల్‎తో పాటు కారులో ఉన్న అతడి స్నేహితులపై కేసు నమోదు చేశారు. ఈ కేసు నుంచి కుమారుడు రాహిల్‎ను తప్పించేందుకు తప్పుడు సాక్ష్యాలు సమర్పించడంతో షకీల్‎ను కూడా పోలీసులు నిందితుడిగా చేర్చారు. 

ఈ కేసు నమోదు కాగానే షకీల్, రాహిల్ దుబాయ్ పారిపోయారు. అప్పటి నుంచి దుబాయ్‎లోనే ఉంటుండగా.. బుధవారం (ఏప్రిల్ 9) షకీల్ తల్లి మృతి చెందారు. దీంతో తల్లి అంత్యక్రియల్లో పాల్గొనేందుకు షకీల్ దుబాయ్ నుంచి హైదరాబాద్‎కు రాగా పోలీసులు ఎయిర్ పోర్టులో మాజీ ఎమ్మెల్యేను అదుపులోకి తీసుకున్నారు.