బంగ్లాదేశ్‌లో పరిస్థితులు మరింత హింసాత్మకంగా మారాయి. నిరసనకారులు ఏకంగా ఆ దేశ ప్రధాని షేక్ హసీనాను పదవి నుంచి దిగిపోయేలా చేయడంతో పాటు దేశం విడిచి పారిపోయేలా చేశారు. అంతటితో వారి ఆగ్రహావేశాలు చల్లారడం లేదు. మాజీ ప్రధాని షేక్ హసీనాకు చెందిన అవామీ లీగ్ పార్టీ నేతలు, అభ్యర్థులే లక్ష్యంగా దాడులకు దిగుతున్నారు. ఈ క్రమంలో కొందరు అల్లరి మూకలు బంగ్లాదేశ్ మాజీ కెప్టెన్, ఎంపీ ముష్రఫే మోర్తాజా ఇంటికి నిప్పు పెట్టారు.
Also Read:-0.005 సెకండ్ల తేడాతో..100 మీ. స్వర్ణం గెలిచిన నోవా లైల్స్
2024లో జరిగిన సాధారణ ఎన్నికల్లో షేక్ హసీనా నేతృత్వంలోని అవామీ లీగ్ అభ్యర్థిగా పోటీ చేసిన మోర్తాజా ఎంపీగా గెలుపొందారు. ఖుల్నా డివిజన్‌లోని నరైల్-2 నియోజకవర్గం నుండి పార్లమెంటు సభ్యుడిగా విజయం సాధించారు. ప్రభుత్వ కోటాలో రిజర్వేషన్లకు వ్యతిరేకంగా విద్యార్థులు తీవ్ర స్థాయిలో నిరసన తెలుపుతున్నా.. మోర్తాజా స్పందించకపోవడంతో నిరసనకారుల్లో ఆగ్రహం కట్టలు తెంచుకుంది. వందలాది నిరసనకారులు బంగ్లా మాజీ కెప్టెన్ ఇంటి వద్దకు చేరి నిప్పు పెట్టారు. నిమిషాల వ్యవధిలోనే ఇల్లు కాలి బూడిదైంది. ప్రధాని షేక్ హసీనా పదవీవిరమణ చేసి దేశం విడిచిపెట్టి వెళ్లిన అనంతరం ఈ ఘటన చోటుచేసుకుంది.
Bangladesh former national captain and currently AL mp Mashrafe Mortaza's house being burned down.. pic.twitter.com/hteebrdXcJ
— Shishir 🇧🇩 (@shishir_bin) August 5, 2024
అజ్ఞాతంలోకి బంగ్లా క్రికెటర్లు
బంగ్లా మాజీ కెప్టెన్ ముష్రఫే మోర్తాజా ఇంటికి నిప్పు పెట్టిన విషయం తెలిశాక.. ఆ దేశానికి చెందిన పలువురు క్రికెటర్లు, వారి కుటుంబసభ్యులు అజ్ఞాతంలోకి వెళ్లినట్లు కథనాలు వస్తున్నాయి. తమకు మద్దతులివ్వలేదన్న కోపంతో నిరసనకారులు ఎక్కడ తమపై దాడులకు దిగుతారో అన్న భయంలో క్రికెటర్లు ఇళ్లు ఖాళీ చేసినట్లు సమాచారం.
ఈ నిరసనలకు కారణాలేంటి?
1971లో పాకిస్తాన్ నుండి బంగ్లాదేశ్ విముక్తి కోసం జరిగిన యుద్ధంలో పోరాడిన సైనికుల కుటుంబాలకు ప్రభుత్వ ఉద్యోగాల్లో 30 శాతం రిజర్వేషన్లు కల్పిస్తూ హసీనా ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. దీనిపై విద్యార్థుల నుంచి వ్యతిరేకత రావడంతో మొదట వెనక్కి తగ్గింది. కొన్నిరోజుల అనంతరం ఈ రిజర్వేషన్లు చట్టబద్ధమేనని హైకోర్టు తీర్పివ్వడంతో ఆందోళనలు మరోసారి మొదలయ్యాయి. ప్రభుత్వ విధానాన్ని నిరసిస్తూ విద్యార్థులు రోడ్డెక్కడం, దానికి రాజకీయ రంగు పులుముకోవడంతో పరిస్థితులు దిగజారాయి. అయితే, రిజర్వేషన్లపై హైకోర్టు ఇచ్చిన తీర్పును ఆ దేశ అత్యున్నత న్యాయస్థానం రద్దు చేసింది. 1971 యుద్ధంలో పోరాడిన సైనికుల కుటుంబాలకు ప్రభుత్వ ఉద్యోగాల్లో రిజర్వేషన్లను 5 శాతానికి పరిమితం చేసింది.