
న్యూఢిల్లీ: ఇండియా టీ20 వరల్డ్ కప్ టీమ్‌లో రిషబ్ పంత్, అక్షర్ పటేల్‌కు చోటు కల్పించాలని మాజీ కెప్టెన్ సౌరవ్ గంగూలీ అన్నాడు. మ్యాచ్ పరిస్థితిని బట్టి బ్యాటింగ్ ఆర్డర్‌ను మార్చుకుంటే సరిపోతుందన్నాడు. ‘నా వరకైతే టీ20 వరల్డ్ కప్ టీమ్‌లో పంత్, అక్షర్ ఉంటారని అనుకుంటున్నా. ఈ సీజన్‌లో ఈ ఇద్దరు బాగా ఆడుతున్నారు. ఎనిమిదో స్థానంలో వచ్చి 15, 20 రన్స్ చేసే బ్యాటర్ కోసం రోహిత్ చూస్తున్నాడు. అక్షర్ ఈ ప్లేస్‌ను భర్తీ చేస్తాడని భావిస్తున్నా. జడేజా, అక్షర్ పటేల్‌లో సహజ నైపుణ్యం ఉంది. చాలా ప్రతిభావంతులు’ అని దాదా పేర్కొన్నాడు. టీ20లకు పెద్దగా టెక్నిక్ అవసరం లేదని, ప్రాథమికాంశాలకు కట్టుబడి పవర్ హిట్టింగ్ చేసే సామర్థ్యం ఉంటే సరిపోతుందన్నాడు. వికెట్ కీపర్‌గా రిషబ్ పంత్‌కే చాన్స్ ఇవ్వాలన్నాడు. సంజూ శాంసన్‌కు కూడా మెరుగైన అవకాశాలున్నాయని గంగూలీ వెల్లడించాడు.