వైసీపీ టికెట్పై పోటీ.. మాజీ జేడీ లక్ష్మీనారాయణ క్లారిటీ

వైసీపీ టికెట్పై పోటీ.. మాజీ జేడీ లక్ష్మీనారాయణ క్లారిటీ

తాను  వైఎస్సార్ సీపీలో చేరుతున్నాననే వార్తల్లో వాస్తవం లేదన్నారు సీబీఐ మాజీ జేడీ లక్ష్మీనారాయణ. శ్రీశైలం ఎమ్మెల్యే  శిల్పా చక్రపాణిని తమ పూర్వ విద్యార్థుల కార్యక్రమానికి ఆహ్వానించడానికి కలిశానన్నారు. అక్కడే వైద్య పరీక్షలకు సంబంధించిన ప్రభుత్వ కార్యక్రమానికి ఆయన తనను ఆహ్వానించారన్నారు. ఆ సమావేశంలో తాను వైద్య శిబిరాలు, నాడు - నేడు కార్యక్రమాలను అభినందించానని చెప్పారు. అంతమాత్రాన తాను అధికార పార్టీలో చేరుతున్నానని.. వచ్చే ఎన్నికల్లో వారి టిక్కెట్టుపై పోటీ చేస్తానంటూ తప్పుడు వార్తలు ప్రచారం చేయడం సరికాదన్నారు. 

ఈ ఊహాగానాలలో ఏ మాత్రం నిజం లేదన్నారు. ప్రజలు తమ విలువైన సమయాన్ని వృధా చేసుకోవద్దని సూచించారు. ఓటర్ల చైతన్య కార్యక్రమం కొనసాగించే  తన పోరుబాటకు కట్టుబడి ఉన్నానని తెలిపారు.

అక్టోబర్ 27న శ్రీశైలంలో నిర్వహించిన జగనన్న ఆరోగ్య సురక్ష కార్యక్రమంలో జేడీ లక్ష్మీనారాయణ పాల్గొన్నారు. ఈ సందర్బంగా జగన్ చేపట్టిన నాడు-నేడు, జగనన్న ఆరోగ్య సురక్ష పథకాలను ఆయన ప్రశంసించారు. విద్య, వైద్య రంగాల్లో మంచి చేసిన వారికి మెరుగైన ఫలితాలుంటాయని లక్ష్మీనారాయణ అన్నారు. నాడు-నేడు ద్వారా ప్రభుత్వ పాఠశాలలు చాలా అందంగా రూపుదిద్దుకున్నాయన్నారు.  అంగన్వాడీల్లో చిన్నపిల్లల పౌష్టికాహారం చాలా బాగుందన్నారు. జగనన్న ఆరోగ్య సురక్ష ద్వారా బాధితుల వద్దకే వెళ్లి మందులు ఇవ్వడం శుభపరిణామమని జేడీ లక్ష్మీనారాయణ వ్యాఖ్యానించారు. ఈక్రమంలో త్వరలోనే జేడీ వైసీపీలో చేరుతారనే ప్రచారం జరిగింది.