- టీ హబ్‌లో వేద జ్ఞానం, ఆధునిక సాంకేతికతలపై అంతర్జాతీయ సదస్సు
గచ్చిబౌలి, వెలుగు: వేద శాస్త్రాలలో నిరూపితమైన సాంకేతికతలు ఉన్నాయని, వేద శాస్త్రాల నుంచి వచ్చిన ఫలితాలే దేశాభివృద్ధికి సహకరిస్తాయని డీఆర్డీఓ మాజీ చైర్మన్ జి. సతీశ్ రెడ్డి అన్నారు. శనివారం ఐటీ కారిడార్ లోని టీ హబ్ లో బ్రహ్మోస్, డీఆర్డీఓ, డీఎస్ఐఆర్, యూనివర్సిటీ ఆఫ్ హైదరాబాద్, అస్పైర్ యూనివర్సిటీ, టీబీఐ యూనివర్సిటీ, బిర్లా ఇనిస్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ అండ్ సైన్స్, అటల్ ఇంక్యూబేషన్ సెంటర్, టీ హబ్ సహకారంతో ఐకాన్ భారత్ ఆధ్వర్యంలో వేద జ్ఞానం, ఆధునిక సాంకేతికలపై అంతర్జాతీయ సదస్సు నిర్వహించారు.
ఈ సదస్సుకు సతీశ్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరై జ్యోతి వెలిగించి సదస్సును ప్రారంభించారు. ఈ సందర్భంగా సతీశ్ రెడ్డి మాట్లాడుతూ.. ఏ దేశమైనా స్వావలంబన సాధించాలంటే ఆధునిక టెక్నాలజీతోనే సాధ్యమవుతుందని తెలిపారు. దేశీయ ఉత్పత్తి, ఆవిష్కరణలను ప్రోత్సహించడమే లక్ష్యంగా భారత్ ముందుకు సాగుతుందని చెప్పారు. ఆధునిక సాంకేతిక పరిజ్ఞానంతో కూడిన ఆవిష్కరణలతో ప్రాచీన శాస్త్ర విజ్ఞానాన్ని ఈ సదస్సు అందంగా తీర్చిదిద్దిందని పేర్కొన్నారు. హైదరాబాద్ సిటీ పరిశోధన, అభివృద్ధి కేంద్రంగా నిలుస్తుందని వివరించారు.
విద్యా సంస్థలు చాలా ఆలస్యంగా వేద శాస్త్రాలపై ఆసక్తిని కనబరుస్తున్నాయని స్పష్టం చేశారు. ఈ సదస్సులో బిట్స్ వైస్చాన్స్ లర్, ఐఐటీ ఢిల్లీ మాజీ డైరెక్టర్ప్రొ.రాంగోపాల్‌రావు, ఎస్ఆర్ఐవిటీ చైర్మన్ డా. ఎబిఎస్ శాస్ర్తీ, టీహబ్ సీఈఓ శ్రీనివాస్‌రావు, ఐకాన్ భారత్ ఆర్గనైజింగ్ చైర్మన్ డా. పి.జి. రావు, జర్మన్అసోన్అధ్యక్షుడు డా. ఉల్రిచ్ బెర్క్, ఐఏఎస్సీ యూఎస్ఏ చైర్మన్ డా. బలరాంసింగ్, సీఎస్ఐఆర్ మాజీ డీజీ డా. శేఖర్ సి మండే, ప్రముఖ శాస్ర్తవేత్తలు, వేద పండితులు, సాంకేతిక నిపుణులు పాల్గొన్నారు.