బీసీలు 42% రిజర్వేషన్లకు కొట్లాడాలి..రౌండ్ టేబుల్ మీటింగ్ లో జస్టిస్ ఈశ్వరయ్య

బీసీలు 42%  రిజర్వేషన్లకు కొట్లాడాలి..రౌండ్ టేబుల్ మీటింగ్ లో జస్టిస్ ఈశ్వరయ్య
  • కులగణన తప్పుల తడక: జాజుల 
  • బీసీలు 21 లక్షలు ఎట్ల తగ్గుతరు?: చిరంజీవులు 

హైదరాబాద్, వెలుగు:  బీసీలు 42 శాతం రిజర్వేషన్ల కోసం పోరాటం చేయాలని నేషనల్ బీసీ కమిషన్ మాజీ చైర్మన్, రిటైర్డ్ జడ్జి ఈశ్వరయ్య పిలుపునిచ్చారు. తమిళనాడు తరహాలో బీసీలు ప్రత్యేకంగా 9వ షెడ్యూల్ లో రిజర్వేషన్లు చేర్చే విధంగా కొట్లాడాలన్నారు. లోకల్ బాడీల్లో 42 శాతం బీసీ రిజర్వేషన్లు అనే అంశంపై సోమవారం హైదరాబాద్ రెడ్ హిల్స్ ఎఫ్ టీ సీసీఐ బిల్డింగ్​లో జరిగిన రౌండ్ టేబుల్ మీటింగ్ లో జస్టిస్ ఈశ్వరయ్య, రిటైర్డ్ ఐఏఎస్ చిరంజీవులు,  బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు జాజుల శ్రీనివాస్ గౌడ్, బీసీ మేధావులు, ప్రొఫెసర్లు పాల్గొన్నారు. జస్టిస్ ఈశ్వరయ్య మాట్లాడుతూ.. కులగణన లెక్కల్లో తప్పులు ఉన్నాయని, దీనిపై సలహాలు, సూచనలు తీసుకోవాలన్నారు. ఇదే విషయాన్ని సీఎం రేవంత్ రెడ్డి, మంత్రి శ్రీధర్ బాబును కలిసి తెలియజేశానన్నారు.

 కాగా, సమగ్ర సర్వే వివరాలతో పోలిస్తే కులగణన లెక్కలు తప్పుల తడకగా మారాయని రిటైర్డ్ ఐఏఎస్ చిరంజీవులు అన్నారు. బీసీల జనాభా 21 లక్షలు ఎలా తగ్గుతుందని ప్రశ్నించారు. సోమవారం సోమాజిగూడ ప్రెస్ క్లబ్ లో ఆయన మాట్లాడారు. కులగణనలో ముస్లింల సంఖ్య తగ్గించి ఓసీల సంఖ్యను పెంచారని ఆరోపించారు. చాలా మంది సర్వేలో పాల్గొనలేదని, వారి వివరాల సేకరణపై ప్రభుత్వం నిర్ణయం చెప్పాలన్నారు. కాగా, కులగణన సర్వే రిపోర్ట్ తప్పుల తడకగా ఉందని, బీసీ లెక్కలను తక్కువ చేసి, అగ్రకులాల జనాభాను ఎక్కువ చేసి చూపించారని బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు జాజుల శ్రీనివాస్ గౌడ్ అన్నారు. 

సోమవారం సెక్రటేరియట్ మీడియా సెంటర్ లో ఆయన మాట్లాడారు. 2014లో బీసీలు 51 శాతం  ఉంటే.. 2024 లో 46 శాతం ఉంటారా? అని ప్రశ్నించారు. ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్లను కాపాడడం కోసమే అగ్రకులాల జనాభాను పెంచి చూపారన్నారు. బీసీ సబ్ కమిటీలో భట్టి, పొన్నం ఉండాలి కానీ, ఉత్తమ్ కుమార్ రెడ్డి ఎలా ఉంటారని ప్రశ్నించారు. మంగళవారం రాష్ట్రవ్యాప్తంగా కులగణన సర్వే రిపోర్టులను చెత్తబుట్టలో వేసి నిరసనలు తెలుపుతామని, బుధవారం తదుపరి కార్యాచరణ ప్రకటిస్తామన్నారు.