శంకర్పల్లి, వెలుగు: సభలు, సమావేశాల్లో తనకు మాట్లాడే అవకాశమే ఇవ్వడం లేదని చేవెళ్ల మాజీ ఎమ్మెల్యే, బీఆర్‌ఎస్‌నేత రత్నం అసంతృప్తి వ్యక్తం చేశారు. ‘పల్లె పల్లెకి రత్నం’ కార్యక్రమంలో భాగంగా ఆదివారం ఆయన శంకర్ పల్లి మండలంలోని జన్వాడ, మిర్జాగూడ గ్రామాల్లో పర్యటించారు. రాష్ట్ర ప్రభుత్వ పథకాలను ప్రజలకు వివరిస్తూనే.. వచ్చే ఎన్నికల్లో తనకు మద్దతుగా నిలవాలని రత్నం కోరారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ.. పార్టీ హైకమాండ్నుంచి స్పష్టమైన ఆదేశాలు వచ్చాయని, వచ్చే ఎన్నికల్లో చేవెళ్ల అసెంబ్లీ నియోజకవర్గం నుంచి బీఆర్ఎస్ తరఫున వంద శాతం తానే పోటీలో ఉంటానని స్పష్టం చేశారు.
తాను ఎమ్మెల్యేగా ఉన్న టైంలో ఎలాంటి నామినేటెడ్ పోస్టులు అమ్ముకోలేదని, తన కుటుంబమే ఎదగాలనే నీచ సంస్కృతి తనది కాదన్నారు. ఎవరెన్ని అడ్డంకులు సృష్టించినా వచ్చే ఎన్నికల్లో బరిలో నిలుస్తానని, తనకి స్థానిక మంత్రి సబితారెడ్డి, మాజీ మంత్రి మహేందర్‌రెడ్డి, ఎంపీ రంజీత్‌రెడ్డి సంపూర్ణ మద్దతు ఉందని చెప్పారు. ‘పల్లె పల్లెకి రత్నం’లో భాగంగా అన్ని గ్రామాల్లో పర్యటిస్తానని వెల్లడించారు. రత్నం వెంట శంకర్ పల్లి మున్సిపల్ కౌన్సిలర్లు సంతోశ్, శ్రీనాథ్, మాజీ ఎంపీపీ బీర్ల నర్సింహ, మాజీ సర్పంచ్శ్రీధర్, లీడర్లు శ్రీనివాస్‌రెడ్డి, బయానంద్ తదితరులు ఉన్నారు.