డుమ్మాలకు కేరాఫ్ కేసీఆర్.. కీలక సమావేశాలకు గైర్హాజరు

డుమ్మాలకు కేరాఫ్ కేసీఆర్.. కీలక సమావేశాలకు గైర్హాజరు
  • ఇవాళ హెచ్‌ఆర్‌సీ, లోకాయుక్త, సమాచార కమిషన్ సెలెక్షన్ కమిటీ మీటింగ్ కూ వెళ్లలే
  •  అదే సమయంలో ఎర్రవల్లి ఫాంహౌస్ లో పార్టీ నేతలతో మీటింగ్
  •  ప్రధాన ప్రతిపక్ష నేత అసెంబ్లీకి వచ్చింది రెండు సార్లే!
  • ఇంతవరకూ డిప్యూటీ లీడర్ లేకుండానే బీఆర్ఎస్ ఎల్పీ

హైదరాబాద్: మాజీ ముఖ్యమంత్రి, బీఆర్ఎస్ అధినేత డుమ్మాలకు కేరాఫ్ గా మారారు. కీలక సమావేశాలకు గైర్హాజరవుతుండటం గమనార్హం. 2023 డిసెంబర్ 7న కాంగ్రెస్ ప్రభుత్వం కొలువు దీరింది. అప్పటి నుంచి ఆయన కేవలం రెండు సార్లు మాత్రమే అసెంబ్లీకి హాజరయ్యారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి  ప్రధాన ప్రతిపక్ష నేతగా  కొనసాగుతున్న కేసీఆర్ కీలక సమావేశాలకు డుమ్మా కొట్టడం చర్చనీయాంశమైంది. ఇవాళ మూడు కీలక సమావేశాలు జరిగాయి. వీటన్నింటికీ ప్రధాన ప్రతిపక్ష నేత హోదాలో కేసీఆర్ హాజరై తన అభిప్రాయాన్ని వెల్లడించాల్సి ఉంది. కానీ ఈ మూడు మీటింగ్ లకు కేసీఆర్ వెళ్లలేదు. ఇదే సమయంలో ఎర్రవల్లిలోని తన ఫాంహౌస్ లో నల్లగొండ, మహబూబ్ నగర్ జిల్లాల నేతలతో పార్టీ సిల్వర్ జూబ్లీ సమావేశానికి  సన్నాహక సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎల్కతుర్తిలో జరపతలపెట్టిన సమావేశానికి జన సమీకరణపై మాట్లాడారు. ప్రధాన ప్రతిపక్ష నేత హోదాలో జీత భత్యాలు తీసుకుంటూ.. అదనపు సెక్యూరిటీ, ఇతర సౌకర్యాలు పొందుతున్న ఆయన సమావేశానికి రాకపోవడం హాట్ టాపిక్ గా మారింది. 

సెలెక్షన్ కమిటీ మీటింగ్ కు కూడా..

రాష్ట్రంలో హెచ్‌ఆర్‌సీ, లోకాయుక్త, సమాచార కమిషన్‌లు అత్యంత కీలక  కమిషన్‌లు. హెచ్‌ఆర్‌సీలో చైర్మన్, ముగ్గురు కమిషన్ సభ్యుల స్థానాలు ప్రస్తుతం ఖాళీగా ఉన్నాయి.  సమాచార కమిషన్‌కు సంబంధించి కమిషన్ చైర్మన్, ఐదుగురు కమిషనర్‌ల స్థానాలు కొంతకాలంగా పెండింగ్‌లో ఉంటూ వస్తున్నాయి.  లోకాయుక్త, ఉపలోకాయుక్త కూడా ఖాళీగా ఉన్నాయి. ఈ మూడు కమిషన్ల భర్తీ కోసం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇవాళ  సెలెక్షన్ కమిటీ సమావేశాన్ని నిర్వహించారు. ఈ మూడింటికి సెలక్షన్ కమిటీలో ముఖ్యమంత్రి చైర్మన్‌గా ప్రధాన ప్రతిపక్ష నేత హోదాలో బీఆర్ఎస్ చీఫ్ కేసీఆర్ తదితరులు సభ్యులుగా ఉంటారు. ఈ సెలక్షన్ కమిటీ సమావేశానికి మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్‌‌ రావాల్సిందిగా ఆహ్వానం పంపారు. ఆయన  రాలేదు . ఈ సమావేశంలో ఎవరెవరిని కమిషన్ చైర్మన్‌లుగా నియమించాలి, అలాగే సభ్యులుగా ఎవరిని నియమించాలనే దానిపై  చర్చ జరిగింది. 

15 నెలలు దాటినా నో డిప్యూటీ

అసెంబ్లీలో ప్రధాన ప్రతిపక్ష నేతగా ఉన్న కేసీఆర్.. బీఆర్ఎస్ ఎల్పీకి డిప్యూటీ లీడర్ ను నియమించలేదు. శాసన సభలో జరిగే  బీఏసీ సమావేశాలకు మాజీ మంత్రులు హరీశ్ రావు, వేముల ప్రశాంత్ రెడ్డి హాజరవుతున్నారు. దీనిపై మంత్రి కోమటిరెడ్డి  పలుమార్లు అభ్యంతరం వ్యక్తం చేశారు. బీఆర్ఎస్ ఎల్పీ నేత సభకు రాలేదని, హరీశ్ రావు సాధారణ ఎమ్మెల్యే మాత్రమేనని, ఆయనకు అంత సమయం ఎందుకు ఇస్తున్నారంటూ ప్రశ్నించారు. అయినా కేసీఆర్ స్పందించలే.. డిప్యూటీ లీడర్ ఎవరో ప్రకటించలేదు.