సిద్దిపేట, వెలుగు: అసెంబ్లీ ఎన్నికల్లో ప్రజలు పొరపాటున ఒక మాయలో పడి గాలికి ఓటేశారని, ఏం కోల్పోయారో ఇప్పుడు వాళ్లకు తెలిసొచ్చిందని బీఆర్ఎస్చీఫ్, మాజీ సీఎం కేసీఆర్అన్నారు. ‘‘గాలికి ఓటేస్తే శిక్ష ప్రజలకే పడ్తది. కేసీఆర్‌కు, బీఆర్ఎస్కు పోయేదేమీ లేదు. కొత్త ప్రభుత్వం ఏర్పడిన 11 నెలల్లో ఏం కోల్పోయారో ప్రజలు తెలుసుకున్నారు. ప్రజాస్వామ్యం అంటే పార్టీలు, ఎమ్మెల్యేలు గెలవడం కాదు.. ప్రజలు గెలవాలి. కానీ ఒక్కోసారి ప్రజల నెత్తిమీద దయ్యమొచ్చి కూసుంటది.. మాయలో పడి గాలికి ఓటేస్తే శిక్ష ప్రజలకే పడ్తది’’ అని ఆయన వ్యాఖ్యానించారు.
రాబోయే రోజుల్లో వంద శాతం బీఆర్ఎస్ ప్రభుత్వమే వస్తుందని ధీమా వ్యక్తం చేశారు. శనివారం ఎర్రవల్లి ఫామ్ హౌస్‌లో పాలకుర్తి నియోజకవర్గానికి చెందిన కొందరు బీఆర్ఎస్ లో చేరారు. ఇందులో కేసీఆర్ పాల్గొని మాట్లాడారు. ‘‘అధికారంలోకి రాంగనే వాడ్ని లోపల వేయాలి.. వీడ్ని లోపల వేయాలి.. అని మేం చూడం. ప్రభుత్వమంటే అందర్నీ కాపాడి నిర్మాణాత్మకంగా పనిచేసి పదిమందికి లాభం చేయాలి. ప్రస్తుత ప్రభుత్వంలో ఉన్నవాళ్లు ఎట్లమాట్లాడ్తున్నరో మీరంతా చూస్తున్నరు. గాలి వాటుగా కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది. దీని ఫలితాలను ప్రజలు అనుభవిస్తున్నరు’’ అని వ్యాఖ్యానించారు. కేసులకు, జైళ్లకు తాము భయపడబోమని ఆయన అన్నారు.
మొదలుపెడ్తే రేపటి దాకా తిడ్తనే ఉంటం
‘‘కూలగొడ్తం.. పడగొడ్తం.. అది చేస్తం.. ఇది చేస్తామని పిచ్చి పిచ్చి మాటలు ప్రభుత్వం మాట్లాడటం తగదు. మాకు తిట్టడం వచ్చు. ఇయ్యాల తిట్టుడు మొదలు పెడ్తే రేపటి దాకా తిడ్తనే ఉంటం’’ అని కేసీఆర్ అన్నారు. ఒక బాధ్యతను ప్రభుత్వానికి అప్పగిస్తే ఆ బరువును తీసుకొని ప్రజలకు సేవ చేయాలని సూచించారు. మేనిఫెస్టోలో ప్రజలకు ఇచ్చిన హామీలతోపాటు ఎవరూ అడగనివి కూడా తాము చేశామని కేసీఆర్అన్నారు.
దళిత బంధు తర్వాత గిరిజన బంధు, బీసీ బంధు తీసుకురావాలని తన మనసులో ఉండేదని తెలిపారు. ‘‘చూస్తుండగానే 11 నెలలు గడిచిపోయినయ్. రాబోయే రోజుల్లో వందకు వంద శాతం మన ప్రభుత్వం రావడం ఖాయం. ఇందుకోసం అందరూ కష్టపడి పనిచేయాలి. భవిష్యత్‌లో బీఆర్ఎస్ దే అధికారమని ప్రజలు చెప్పడమే కాదు.. రావడం ఖాయం” అని బీఆర్ఎస్ నేతలనుద్దేశించిన ఆయన అన్నారు.
భవిష్యత్తుకు ఢోకా లేదు
‘‘ఒక్క ఎన్నికతోనే కేసీఆర్, బీఆర్ఎస్ పార్టీ పని అయిపోయిందని కొందరు అంటున్నరు. కానీ, శూన్యంలో సునామీ సృష్టించి ప్రత్యేక రాష్ట్ర ఏర్పాటు చేయించుకున్న ఘనత బీఆర్ఎస్ దేనని మరిచిపోవద్దు. మన భవిష్యత్‌కు ఎలాంటీ ఢోకా లేదు” అని బీఆర్ఎస్ నేతలతో కేసీఆర్ చెప్పారు. పదేండ్లలో ఎంతోమందిని నాయకులుగా తయారు చేసుకున్నామని.. జెడ్పీ చైర్మన్లను, ఎమ్మెల్యేలను, ఎంపీలను, ఎమ్మెల్సీల ను గెలిపించుకున్నామని తెలిపారు. కాంగ్రెస్ ప్రభుత్వంపై వ్యతిరేకత మొదలైందని, ప్రజలు అన్ని విషయాలు అర్థం చేసుకుంటున్నారని ఆయన అన్నారు. బీఆర్ఎస్ నాయకులెవరూ కేసులకు, జైళ్లకు భయపడవద్దని, రాబోయే రోజుల్లో వచ్చేది బీఆర్ఎస్ ప్రభుత్వమేనని చెప్పారు.