ప్రజల గుండెలు చీలిస్తే నేనే కనిపిస్త.. నా గుండె చీలిస్తే తెలంగాణ కన్పిస్తది: కేసీఆర్​

  •     దేవుడు తెలంగాణ కోసమే నన్ను పుట్టించాడనిపిస్తది
  •     కాంగ్రెస్​ సర్కార్​పై యుద్ధం చేస్తం.. నిరుద్యోగ భృతి, మెగా డీఎస్సీ ఏమైంది?
  •     ఐదెకరాల పైనున్నోళ్లకు రైతుబంధు ఇస్తే ముల్లేమైనా పోతదా?
  •     తీర్థం పుచ్చుకొని.. ప్రసాదం తిని.. ఊరేగింపులు తీస్తే కడుపు నిండుతదా? 
  •     కాంగ్రెస్​కు ఓటేస్తే బీజేపీకి వేసినట్టేనని విమర్శ

యాదాద్రి, వెలుగు: భగవంతుడు తెలంగాణ కోసమే తనను పుట్టించినట్లు అనిపిస్తుందని బీఆర్​ఎస్​ చీఫ్​ కేసీఆర్​ అన్నారు. గెలిచినా, ఓడినా తెలంగాణ ప్రజల తరఫున కొట్లాడే ఏకైక వ్యక్తిని తానేనని చెప్పారు. ‘‘ప్రజల గుండెలు చీలిస్తే కేసీఆర్​ కన్పిస్తడు. కేసీఆర్​ గుండె చీలిస్తే తెలంగాణ కన్పిస్తది” అని ఆయన తెలిపారు. కాంగ్రెస్​కు ఓటేస్తే బీజేపీకి వేసినట్టేనని, ఈ ఎన్నికల్లో బీఆర్​ఎస్​ను గెలిపిస్తే పార్లమెంట్​లో కొట్లాడి మన హక్కులను సాధించుకొస్తామని చెప్పారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా గురువారం యాదాద్రి జిల్లా భువనగిరి రోడ్​ షోలో కేసీఆర్​ మాట్లాడారు.

కాంగ్రెస్​ పాలనలో 225 మంది రైతులు చనిపోయారని.. ముఖ్యమంత్రి, మంత్రులు పట్టించుకోలేదని ఆయన అన్నారు. మిల్లర్ల వద్ద కమీషన్లు తీసుకొని సెంటర్లలో వడ్లు కొనడం లేదని ఆరోపించారు. ‘‘కేసీఆర్​ పక్కకు పోంగనే కరెంట్​ పోయింది. మరి.. వీళ్లను దద్దమ్మలు అనకుంటే ఏమనాలె?  నా కండ్ల ముందే పంటలు ఎండిపోతున్నయ్.  వడ్లకు బోనస్​ ఇస్తానని కాంగ్రెస్​ బోగస్​ మాటలు చెప్పింది. తెలంగాణకు ప్రధాన శత్రువు కాంగ్రెస్సే. వాళ్ల వల్లే కరువు వచ్చింది. ఈ ప్రభుత్వంపై యుద్ధం చేస్తం’’ అని ఆయన అన్నారు.  ‘‘ఐదెకరాలకే రైతుబంధు ఇస్తమంటున్నరు. మరి ఐదెకరాలకు పైనున్నోడు ఏం కావాలె.. రైతులకు ఏమైనా బెంజి కార్లు ఉన్నయా? రూ. కోట్ల ఆస్తులున్నయా? అందరికీ ఇస్తే నీ అబ్బజాగీరేమైనా పోతదా? నీ ముల్లెమైనా పోతదా?” అని రాష్ట్ర ప్రభుత్వంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. 

నా బిడ్డను అరెస్టు చేసినా భయపడలే

‘‘బీజేపీ ప్రభుత్వం నా బిడ్డను తీసుకపోయి అరెస్ట్ చేసింది.. అయినా నేను భయపడేది లేదు. ప్రాణం పోయేదాకా న్యాయం కోసం కొట్లాడుత” అని కేసీఆర్​ అన్నారు. ‘‘పిచ్చిలో, ఉన్మాదంలో కాకుండా, ఆలోచన చేసి పరిణితితో ఓట్లు వేయాలి. బీజేపీ పదేండ్ల పాలనలో పెద్ద పెద్ద మాటలు, నినాదాలు ఇచ్చింది కానీ ఏ ఒక్క వర్గానికి మేలు చేయలేదు. దేశంలో అనేక సమస్యలు ఉంటే.. బీజేపీ అవేం పట్టించుకోవడం లేదు. అక్షింతలు కలిపి..  తీర్థం పుచ్చుకొని. . పులిహోరా ప్రసాదం తిని.. ఊరేగింపులు తీస్తే మన కడుపు నిండుతదా.. మన పొలాలకు నీళ్లువస్తయా?” అని ఆయన ప్రశ్నించారు. “ ఒక పార్టీ దేవుడి పేరుతో ఓట్లు అడుగుతున్నది. మరో పార్టీ దేవుడి మీద ఒట్లు వేస్తున్నది” అని అన్నారు. యాదాద్రి దేవాలయాన్ని తాము అద్భుతంగా నిర్మించామని,  ఎన్నడూ ఆలయాన్ని ఓట్ల కోసం వాడుకోలేదని చెప్పారు. 

స్టూడెంట్లు చనిపోతున్నా పట్టించుకుంటే

గురుకులాల్లో కల్తీ ఆహారం వల్ల విద్యార్థులు చనిపోతున్నారని,  భువనగిరి హాస్టల్​లో స్టూడెంట్​ చనిపోతే రాష్ట్ర సర్కారు పట్టించుకోలేదని కేసీఆర్​ ఆగ్రహం వ్యక్తం చేశారు. ‘‘మేం అధికారంలోకి వచ్చిన తర్వాత అంతకు ముందున్న  కాంగ్రెస్​ ప్రభుత్వం అమలు చేసిన ఫీజు రీయింబర్స్​మెంట్​కొనసాగించినం.   ఇప్పటి ప్రభుత్వం మాత్రం రీయింబర్స్​మెంట్​ ఇస్తలేదు. మేం చేనేత  సంక్షేమం కోసం తెచ్చిన అన్ని పథకాలు రద్దు చేసింది. జాబ్ క్యాలెండర్‌, మెగా డీఎస్సీ ఏమైంది? నిరుద్యోగ భృతి ఏమైంది? ఆడపిల్లలకు స్కూటీ రాలేదు కాని రాష్ట్రంలో లూటీ జరుగుతున్నది. రూ.2లక్షల  రుణమాఫీ అన్నరు.. ఇచ్చిండ్రా? కల్యాణలక్ష్మికి తులం బంగారం ఇస్తామని చెప్పి తుస్సు మనిపించిన్రు” అని కేసీఆర్ విమర్శించారు.